Team India: ఆ ‘మూడోది’ కొట్టాలంటే... ఇప్పుడీ ‘మూడు’ మారాలి!

Eenadu icon
By Sports News Team Updated : 28 Sep 2025 07:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆసియా కప్‌ సూపర్ -4లో చివరి మ్యాచ్. ఈ ఫలితం ‘ఫైనల్‌’ రేసుపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఇప్పటికే ఫైనలిస్టులు ఖరారు అయిపోయారు. కానీ, భారత జట్టుకు మాత్రం ఆటపరంగా అత్యంత కీలకం. ఇప్పటివరకూ అజేయంగా కొనసాగుతున్నప్పటికీ ‘మూడు’ అంశాలు కలవరపెడుతున్నాయి. అవేంటో? శ్రీలంకతో మ్యాచ్‌లో ఏం చేయాలో ఓ లుక్కేద్దాం.

భారీ ఇన్నింగ్స్‌ బాకీ.. కెప్టెన్సీ భారమా?

ఆసియా కప్‌లో ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చింది. అదీ పాకిస్థాన్‌ పైనే లీగ్‌ స్టేజ్‌లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యూఏఈపై స్వల్ప స్కోరే లక్ష్యం కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ఒమన్‌పై అసలు బ్యాటింగ్‌కే రాలేదు. ఇక సూపర్ -4లో పాక్‌తో మ్యాచ్‌లో డకౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌పై 11 బంతుల్లో కేవలం ఐదే పరుగులు చేశాడు. మరోవైపు ఓపెనర్లు అదరగొట్టేస్తుంటే.. వన్‌డౌన్‌లో పెద్దగా ఒత్తిడి లేనప్పుడూ విఫలం కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఒకప్పుడు సూర్య క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు ఎలా బౌలింగ్‌ చేయాలోనని అనుక్షణం భయపడేవారు. ఇప్పుడు మాత్రం అలవోకగా సూర్యను పెవిలియన్‌కు పంపించొచ్చని భావిస్తున్నారు. తనదైన మార్క్‌ షాట్లను కూడా ఆడలేకపోవడం గమనార్హం. కెప్టెన్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌ వస్తే మిగతా ఆటగాళ్ల ప్రదర్శనా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కెప్టెన్‌గా మారినప్పటినుంచి సూర్య బ్యాట్‌ నుంచి పెద్దగా పరుగులు రావడం లేదు. భవిష్యత్తులో గిల్‌కు సారథ్యం అప్పగిస్తారనే ‘టెన్షన్‌’ సూర్య పడుతున్నాడేమోనని క్రికెట్ వర్గాల అంచనా.

అదేం ఫీల్డింగ్‌.. 

‘క్యాచ్‌లు మ్యాచ్‌ విన్నర్లు’ అని ఊరికే అనలేదు. కీలక ఆటగాడి క్యాచ్‌ మిస్ అయితే మ్యాచ్‌ ఫలితమే తారుమారు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ ఆసియా కప్‌లో భారత ఫీల్డర్లు అత్యధికంగా 12 క్యాచులు వదిలేశారు. హాంకాంగ్‌ (11), బంగ్లాదేశ్‌ (8) జట్లే చాలా నయం. పాక్‌ ఇప్పటివరకు మూడు క్యాచులు మాత్రమే మిస్‌ చేసింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌తోనే టీమ్‌ఇండియా తలపడాల్సి ఉంది. ఆలోగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ విభాగంలో పొరపాట్లను సరిదిద్దికోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని క్యాచ్‌లు మిస్‌ చేసినా.. బౌలర్లు రాణించడంతో భారత్‌కు ఇబ్బందిలేకుండా పోయింది. అంతకుముందు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ..  ‘హాఫ్‌ సెంచరీ’ సాధించి గన్‌ ఫైర్‌ చేష్టలు చేసిన ఫర్హాన్‌ డకౌట్‌ కావాల్సింది. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను అభిషేక్ వదిలేశాడు. ఒకవేళ అతడు త్వరగా ఔటై ఉంటే పాక్ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఈ విషయంపై ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌ ఇంకాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం లేకపోలేదు. లేకపోతే అతడి పదవికీ చేటు రావడం ఖాయం.

మిడిలార్డర్‌ బ్యాటర్లూ రాణించాలి..

దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభం అందించాడు. కానీ, తర్వాత వచ్చే బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్, శివమ్ దూబె అప్పుడప్పుడు మినహా వారిలో నిలకడ లోపించింది. వన్‌డౌన్‌లో బాగా ఆడే సంజు శాంసన్‌ను మిడిలార్డర్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌కు పంపించడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. పాక్‌తో సూపర్‌ -4 మ్యాచ్‌లో అప్పటికే విజయం దాదాపు ఖరారు అయినా సరే సంజుశాంసన్‌ ఐదో స్థానంలో వచ్చి చాలా ఇబ్బందిపడ్డాడు. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతడిని బ్యాటింగ్‌కే దింపలేదు. అనూహ్యంగా శివమ్‌ దూబెను వన్‌డౌన్‌లో ఆడించినా.. అది బూమరాంగ్‌ అయింది. తిలక్‌ వర్మ కూడా ఆరో బ్యాటర్‌గా వచ్చాడు. కేవలం ఐదు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీగా మార్పులు చేయడమే దీనికి కారణమనేవారూ లేకపోలేదు.

చివరిగా: ఇప్పటివరకూ జరిగిందంతా ఓ ఎత్తు. ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్‌ మరో ఎత్తు. ఫైనల్‌కు ముందు సన్నాహకంగా టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌ను భావించాలి. పొరపాట్లను సరిదిద్దుకొని బరిలోకి దిగాలి. మరోవైపు ప్రతీకారం కోసం ఎదురుచూస్తోన్న పాకిస్థాన్‌ తన శాయశక్తులా పోరాడుతుంది. అందుకే ఆ ‘మూడో’ మ్యాచ్‌లోనూ మనమే నెగ్గాలంటే ఈ ‘మూడు’ అంశాల్లో మెరుగవ్వాల్సిందే.

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :
Published : 26 Sep 2025 12:56 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు