Team India: టీమ్‌ఇండియాలో నిలకడలేమి.. మళ్లీ మొదటికొచ్చిందా..?

ఒకసారి దూకుడుగా ఆడేస్తారు. మరోసారి కుప్పకూలి నిరాశపరుస్తారు. ఇదీ ఆసియా కప్‌లో (Asia Cup 2023) భారత్ బ్యాటింగ్‌ పరిస్థితి. లీగ్‌ స్టేజ్‌లో పాక్‌పై టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా.. గౌరవప్రదమైన స్కోరు చేసింది. సూపర్ -4లో దూకుడుగా ఆడేసి భారీ స్కోరు చేసింది. తీరా ఇప్పుడు శ్రీలంకపై చెమటోడ్చాల్సి వచ్చింది. 

Updated : 13 Sep 2023 13:46 IST

ఒక్క రోజు ముందు జరిగిన మ్యాచ్‌లో భీకరమైన పేసర్లు.. దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్న చిరకాల ప్రత్యర్థిని అలవోకగా చిత్తు చేశాం. మరుసటి రోజు.. అదే మైదానం.. ఈసారి మాత్రం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఆసియా కప్‌ ఫైనల్‌కు (Asia Cup 2023) అయితే చేరిపోయాం కానీ.. మరోసారి టీమ్‌ఇండియా (Team India) నిలకడలేని బ్యాటింగ్‌ ప్రదర్శన కలవరపెట్టే అంశమే. మళ్లీ నిలకడలేమి భారత జట్టును అవహించిందా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది.

కొలంబో వేదికగా భారత్‌ వరుసగా మూడు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలుత పాకిస్థాన్‌పై 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీల హీరోలు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తోపాటు రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం ఆరంభంలో ఉన్న దూకుడును కొనసాగించలేక భారత్‌ ఇబ్బంది పడింది. పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారిందని భావించినా.. ఓపెనర్లు తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లను పారేసుకున్నారు. మిడిల్‌లో ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్ కాసేపు నిలబడినా.. అది సరిపోలేదు. అప్పుడు కూడా టీమ్‌ఇండియా వరుసగా వికెట్లను సమర్పించుకుంది. చివర్లో అక్షర్ పటేల్ కూడా ఓ చేయి వేశాడు కాబట్టే భారత్ 213 పరుగులు చేయగలిగింది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు తిరుగులేదని అంతా భావించే వేళ యువ స్పిన్నర్లు వెల్లలాగె, అసలంక, తీక్షణలకు మొత్తం వికెట్లను సమర్పించారు.

వ్యత్యాసం ఉండాలి కదా..

స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ  శ్రీలంక బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డారు కదా..? వారి సొంత మైదానంలోనే 214 రన్స్‌ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 172కే ఆలౌట్‌ అయింది కాబట్టి పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందనే వాదనను పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, శ్రీలంక ఆటగాళ్లకు భారత్‌లోని స్టార్‌ ప్లేయర్లకు చాలా వ్యత్యాసం ఉందనేది మరికొందరి వాదనా. టీమ్‌ఇండియాలోని ఆటగాళ్లతో పోలిస్తే వారంతా పెద్దగా అనుభవం లేనివారే. అయినా సరే చివరి వరకూ విజయం కోసం పోరాడారు. భారత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టారు. లేకపోతే పరాభవం ఎదురై విమర్శలకు గురి కావాల్సి వచ్చేది. అయితే, వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల కూడా భారత ప్రదర్శనపై ప్రభావం పడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకప్పుడు అలా..

గత పదేళ్ల కిందట వరకు భారత్‌లోని టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమైతే.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టేవారు. అయితే, ఎంఎస్ ధోనీ నాయకత్వం వచ్చాక దాదాపు ఎనిమిదో వికెట్‌ వరకు బ్యాటింగ్‌ చేయడం అలవాటైంది. ఇటీవల వరకు లోయర్ ఆర్డర్‌ కూడా కాసిన్ని పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలుస్తోంది. మళ్లీ ఇప్పుడు ఆ పాత రోజులకు టీమ్‌ఇండియా పరిస్థితి వెళ్తుందా..? అనేది అనుమానంగా మారింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌ను తీసుకుంటే.. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నప్పటికీ గిల్‌, విరాట్ వెనువెంటనే ఔట్‌ కావడంతో రోహిత్ కాన్సట్రేషన్‌ సన్నగిల్లి వికెట్‌ను ఇచ్చేశాడు. సరే ఇషాన్‌, రాహుల్‌ కుదురుకున్నారనుకునేలోపే.. వారితోపాటు హార్దిక్, జడేజా కూడా వెంటనే పెవిలియన్‌కు చేరిపోయారు. పార్ట్‌టైమ స్పిన్నర్‌ అసలంకకు కూడా నాలుగు వికెట్లను ఇవ్వడం మరింత బాధించే అంశం. పాకిస్థాన్ జట్టు కూడా ఇలా నిలకడలేమి ఆటతీరుతో కీలక సమయాల్లో మ్యాచ్‌లను ఓడిపోతుండేది.

ముందుంది మెగా టోర్నీ 

‘ఇలాంటి కఠిన సవాళ్లు ఎదురైతే మనం నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినట్లే’ అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినప్పటికీ.. ఆ మాటలు ఆసియా కప్ ఫైనల్‌ సహా మెగా టోర్నీ సందర్భంగా బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. వచ్చే ప్రపంచకప్‌లో కీలకమైన సమయంలో ఇలా వికెట్లను పారేసుకుంటే ప్రత్యర్థులు మరింత చెలరేగే అవకాశం ఉండటంతోపాటు ఐసీసీ కప్‌ను నెగ్గాలనే పదేళ్ల కలపై నీళ్లు పడటం ఖాయం. అన్ని మ్యాచుల్లోనూ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తేనే టైటిల్‌ను ఖాతాలో వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణిస్తేనే ఛాంపియన్‌గా నిలవగలం. 

-ఇంటర్నెట్ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని