Cricket News: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు భారత స్క్వాడ్‌ ఇదే..

ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కూడా తమ వైస్‌ కెప్టెన్‌ను వెల్లడించింది.

Updated : 29 Feb 2024 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు కోసం భారత స్క్వాడ్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కొత్త వైస్‌ కెప్టెన్‌ వచ్చాడు. అంపైరింగ్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు సీనియర్‌ వెల్లడించాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

బుమ్రా వచ్చాడు.. కేఎల్ రాహుల్ లేడు

నాలుగో టెస్టులో విశ్రాంతి తీసుకున్న భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు సిద్ధమయ్యాడు. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా స్క్వాడ్‌ను అప్‌డేట్ చేస్తూ బీసీసీఐ ప్రకటన వెలువరించింది. గాయం కారణంగా దూరమైన కేఎల్ రాహుల్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆడటం లేదు. వాషింగ్టన్ సుందర్‌ను విడుదల చేయడంలో రంజీల్లో ఆడేందుకు వెళ్తాడు. ముంబయి-తమిళనాడు సెమీఫైనల్‌లో (మార్చి 2 నుంచి) సుందర్ ఆడతాడు. అది ముగిశాక అవసరమైతే జాతీయజట్టులో చేరతాడు. 

స్క్వాడ్‌ ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదుత్‌ పడిక్కల్, ఆర్‌.అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌


కృనాల్‌ స్థానంలో పూరన్‌కు అవకాశం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మరో 22 రోజుల్లో ప్రారంభం కానుంది.  ఈక్రమంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కీలక ప్రకటన చేసింది. కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌కు డిప్యూటీగా వెస్టిండీస్‌ స్టార్‌ నికోలస్‌ పూరన్‌ను నియమించింది. గత సీజన్‌ వరకు ఎల్ఎస్‌జీ వైస్‌ కెప్టెన్‌గా కృనాల్ పాండ్య ఉన్నాడు. వైస్‌ కెప్టెన్సీ జెర్సీని నికోలస్‌కు కేఎల్ రాహుల్‌ అందించాడు. గత వేలంలో పూరన్‌ను రూ.16 కోట్లు వెచ్చించి మరీ లఖ్‌నవూ సొంతం చేసుకుంది. 


అంపైరింగ్‌కు మారియస్ ఎరాస్మస్‌ గుడ్‌బై

సీనియర్‌ అంపైర్‌ మారియస్‌ ఎరాస్మస్ తన కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీసే తనకు చివరిదని ఎరాస్మస్‌ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని బోలాండ్‌ క్రికెట్‌ జట్టుతో తన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించిన ఎరాస్మస్.. ఆ తర్వాత అంపైరింగ్‌లోకి వచ్చాడు. ఫిబ్రవరి 2006లో తొలిసారి దక్షిణాఫ్రికా - ఆసీస్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20లు, మరో 18 మహిళల టీ20లకు అంపైరింగ్‌ చేశాడు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఇంతటి గొప్ప గౌరవాన్ని, ట్రావెలింగ్‌ను మిస్‌ అవుతున్నా’’ అని వ్యాఖ్యానించాడు. ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును మూడుసార్లు ఎరాస్మస్‌ సొంతం చేసుకున్నాడు. భారత్‌ ఆడిన చాలా మ్యాచులకూ అతడు అంపైరింగ్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని