Team India: అప్పుడు ఇలానే ప్రయోగాలు.. మరి ఇప్పుడేమవుతుందో..!

ఆసియా కప్‌.. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్‌ రానుంది. ఈ ఏడాది టీమ్‌ఇండియా (Team India) ఆడే మెగా టోర్నీలు ఇవి. ఇలాంటి సమయంలో జట్టు కూర్పులో ప్రయోగాలు చేస్తూ టీమ్‌ఇండియా విమర్శలపాలవుతోంది.

Updated : 30 Jul 2023 14:00 IST

118/5, 181/10.. ఇదీ వెస్టిండీస్‌తో గత రెండు వన్డేల్లో (WI vs IND) భారత్‌ స్కోర్లు. తొలి మ్యాచ్‌లో అతికష్టం మీద గట్టెక్కగా.. రెండో వన్డేలో మాత్రం టీమ్‌ఇండియా (Team India) ఓటమిపాలై నిరాశపరిచింది. ఇషాన్‌ కిషన్‌ మినహా ఎవరూ ప్రభావం చూపించలేకపోయారు.

వారు లేకపోవడమా? ఆ మ్యాచ్‌ చూడాలంటేనే బోర్

తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) క్రీజ్‌లోకే రాలేదు. ఇక రెండో వన్డేలో మాత్రం వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నీల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే ఇలా చేశామని మేనేజ్‌మెంట్‌, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ చెప్పారు. ఫలితాలు సానుకూలంగా వస్తే ఫర్వాలేదు.. కానీ అనుకున్న విధంగా ఆటగాళ్ల ప్రదర్శన లేకపోవడంతో అభిమానుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా..? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

అప్పుడూ ఇలానే..!

గతేడాది టీ20 ప్రపంచ కప్‌ టోర్నీకి ముందు కూడా భారత్‌ ప్రయోగాలు చేసింది. ఎక్కువ మంది ఆటగాళ్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కో  సిరీస్‌కు ఒక్కో జట్టుతో బరిలోకి దిగింది. తీరా గత ఆసియా కప్ (అదీ టీ20 ఫార్మాట్‌) సహా పొట్టి కప్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఆసియా కప్‌ 2022 లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితం కాగా.. గత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ వరకూ చేరినా ఇంగ్లాండ్‌ చేతిలో ఘోరంగా ఓడింది. అప్పుడు పని ఒత్తిడి కారణంగా విడివిడి జట్లుగా ఎంపిక చేసి మరీ విదేశాల్లో సిరీస్‌లను ఆడించడం జరిగింది. 

మరోసారి అదే బాటలోనా..?

పన్నెండేళ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2013లో చివరి సారిగా భారత్ ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. అప్పటి నుంచి జరిగిన టోర్నీల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్‌ బ్యాటర్లకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్‌ అవుతుందనే ఊహాగానాలూ వస్తున్నాయి. భారత్‌ వేదికగానే వన్డే ప్రపంచ కప్‌ జరగనుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి క్రమంలో అనవసర ప్రయోగాలకు పోతే.. వికటించే ప్రమాదం ఉంటుందని ఆందోళన అభిమానుల్లో నెలకొంది. రోహిత్, విరాట్‌తోపాటు ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌ టోర్నీల్లో బరిలోకి దిగే ఆటగాళ్లను ఆడిస్తే బాగుంటుందని క్రికెట్‌ మాజీలు సూచించారు. 

అతడు ఓకే.. మిగతా వారి పరిస్థితేంటి? 

టీమ్‌ఇండియా గత రెండు వన్డేల్లో చేసిన ప్రయోగాలతో ఒక్క ఆటగాడు మాత్రమే తన సత్తా ఏంటో చూపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ త్యాగం చేయడంతో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ రెండు మ్యాచుల్లోనూ హాఫ్‌ సెంచరీలతో అలరించాడు. మరో ఓపెనర్ గిల్ పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో మెగా టోర్నీల్లో రోహిత్‌కు తోడుగా ఇషాన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశాలను మెరుగుపర్చుకున్నాడు. సంజూ శాంసన్‌, హార్దిక్‌, సూర్యకుమార్‌ తేలిపోవడం కలిచివేస్తోంది. పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న వేళ.. ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. టీ20ల్లో అదరగొట్టిన సూర్య కుమార్‌ వన్డే ఫార్మాట్‌లో ప్రభావం చూపించడం లేదు. అవకాశాలు రావడం లేదని బాధపడుతున్న సంజూ.. వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు.

ఆ మూడింటి వల్లే.. ఇప్పటి ఆటగాళ్లు ఇలా: కపిల్‌దేవ్

ఇక బౌలింగ్‌లో ముకేశ్‌ కుమార్‌ కాస్త ఫర్వాలేదనిపించినా.. బుమ్రా ఒకవేళ ఫిట్‌నెస్‌ సాధించకపోతే ఆ లోటును భర్తీ చేస్తాడని భావిస్తున్న ఉమ్రాన్‌ మాలిక్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. కుల్‌దీప్‌, జడేజా విషయంలో ఎలాంటి సమస్య లేదు. విండీస్‌తో జరగనున్న (ఆగస్ట్‌ 1న) చివరి వన్డేలోనూ టీమ్‌ఇండియా ప్రయోగాలు చేస్తుందో లేదో చూడాలి. అప్పుడు యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. రెండో వన్డేలో ఎలాగూ అక్షర్ పటేల్‌ను బరిలోకి దింపారు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడికి బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చారు. అందులో ఒక ఓవర్‌ మెయిడిన్‌ వేయడం విశేషం. అయితే, ఆసియా కప్‌ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై ఉంది.

మరి వారు వస్తే ఎలా..?

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం బాగానే ఉంది. ప్రస్తుతం కొందరు జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA)లో ఉంటూ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వారిలో ప్రధానంగా కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, బుమ్రా ముఖ్యులు. షమీ కూడా ప్రస్తుతం విండీస్ పర్యటనలో లేడు. అలాగే మిడిలార్డర్‌లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించే అజింక్య రహానె కూడా జట్టులో స్థానం ఆశిస్తున్నాడు. వీరందరూ అందుబాటులోకి వస్తే ఏం చేస్తారనేది మేనేజ్‌మెంట్‌ ముందున్న పరిస్థితి. బుమ్రా ప్రధాన పేసర్‌ కాబట్టి ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే అతడికి ఇబ్బంది ఉండదు. కేఎల్ రాహుల్, శ్రేయస్‌లో ఎవరు జట్టులోకి వస్తారో ఇప్పుడే చెప్పలేం. వారు ఫిట్‌నెస్‌ సాధించాల్సి ఉంటుంది. వీరిద్దరూ మిడిలార్డర్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌కు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మరో వైపు యువ బ్యాటర్ యశస్విని కూడా తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని