Team India: ఆ మూడింటి వల్లే.. ఇప్పటి ఆటగాళ్లు ఇలా: కపిల్‌దేవ్

టీమ్‌ఇండియా (Team India) ప్రస్తుత తరం క్రికెటర్లు అధిక మొత్తంలో సంపాదించడంతో తమకెవరూ సాటిరారనే భావనలో ఉన్నట్లుగా ఉందని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) అభిప్రాయపడ్డాడు. ఇదే సీనియర్ల నుంచి సూచనలు తీసుకోవడానికి అడ్డుగా మారిందని పేర్కొన్నాడు.

Updated : 30 Jul 2023 10:51 IST

ఇంటర్నెట్ డెస్క్: గత తరం ఆటగాళ్లు ఏవైనా సందేహాలు ఉంటే తన వద్దకు వచ్చేవారని.. ఇప్పటి ప్లేయర్లు మాత్రం అలా ఉండటం లేదని ఇటీవల భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గావస్కర్ వ్యాఖ్యలకు మరో భారత దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) మద్దతు తెలుపుతూ ఇప్పటి తరం ఆటగాళ్లపై తీవ్రంగా స్పందించాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లు ఇలా తయారు కావడానికి మూడు అంశాలే ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. సంపద, పొగరు, అహం వల్లే సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ ఏదైనా సరే నిరంతరం నేర్చుకుంటూనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. 

‘‘అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండటం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగెటివిటీని వారు పట్టించుకోరు. ఇదే సమయంలో ‘మేం ఎవరినీ ఏం అడగాల్సిన అవసరం లేదు’ అని భావిస్తుంటారు. అనుభవజ్ఞడైన వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవచ్చనే నమ్మకం ఉండాలి. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంటే గర్వం వస్తుంది. అంతా మాకు తెలుసులే అని అనుకోవడం జరుగుతుంది. ఇదే అప్పటి, ఇప్పటి తరం క్రికెటర్ల మధ్య ప్రధాన తేడా. 

మేం ఏం చేసినా.. చివరికి మా లక్ష్యమదే: రాహుల్ ద్రవిడ్

ఇప్పుడున్న భారత ఆటగాళ్లలో (Team India) చాలా మందికి నైపుణ్యంపరంగా సీనియర్ల అవసరం ఉంది. ఇలాంటి సమయంలో సునీల్‌ గావస్కర్ అందుబాటులో ఉంటే మీరంతా (యువ క్రికెటర్లు) ఎందుకు వెళ్లి మాట్లాడకూడదు? ఇక్కడ ఎందుకు అహం?. వారు ‘మేం బాగా ఆడుతున్నాం’ అనుకున్నాసరే.. దాదాపు 50 ఏళ్లపాటు క్రికెట్‌లోనే జీవిస్తున్న వారినుంచి సలహాలు తీసుకోవచ్చు. అతడికి ఎన్నో విషయాలపై పట్టు ఉంటుంది. వాటిని వినడం వల్ల మన ఆలోచనల్లో ఏదైనా మార్పులు రావచ్చు’’ అని కపిల్ వ్యాఖ్యానించాడు. బీసీసీఐ (BCCI) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌తోపాటు ఐపీఎల్‌లో (IPL) ఒక్క సీజన్‌ ఆడినా భారీ మొత్తంలో డబ్బును ఇప్పటితరం ఆటగాళ్లు దక్కించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని