Team India: హార్దిక్‌ ఒక్కడే దిక్కా?... ప్రత్యామ్నాయ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఎక్కడ?

హార్దిక్‌ (Hardik Pandya) అందుబాటులో లేనపుడు తుది జట్టులో ఆడించడానికి మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ లేడు. టీమ్‌ఇండియాకు ఆడే స్థాయి ఉన్న పేస్‌ ఆల్‌రౌండర్లు దేశవాళీ క్రికెట్లో కూడా పెద్దగా కనిపించడం లేదు.

Updated : 22 Oct 2023 19:08 IST

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుండటం సంతోషమే. కానీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయపడి మైదానానికి దూరం కాగానే ఆ మ్యాచ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయలేక ఇబ్బంది పడింది టీమ్‌ఇండియా. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు అతను అందుబాటులో లేకపోవడం కూర్పు పరంగా జట్టుకు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. హార్దిక్‌కు పెద్ద గాయమై ప్రపంచకప్‌నకు దూరమైతే అది జట్టు అవకాశాల పైనే ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి హార్దిక్‌ ఎంత విలువైన ఆటగాడో తెలియజేస్తూనే.. మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో లేక భారత్‌ పడుతున్న ఇబ్బందినీ తేటతెల్లం చేస్తోంది.

‘‘హార్దిక్‌ పాండ్య మాకెంతో ముఖ్యమైన ఆటగాడు. అతను అందుబాటులో లేనపుడు సరైన కూర్పు ఏదో పరిశీలించాలి. కానీ ఏం చేసినా.. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఉన్న సమతూకం రాదు’’.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ముంగిట టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్న మాటలివి. ఈ మాటల్ని బట్టి జట్టులో హార్దిక్‌ పాత్ర ఎంత కీలకమో అర్థమవుతుంది. హార్దిక్‌ ఉంటే మిడిలార్డర్లో ఒక నమ్మకమైన బ్యాటర్‌ ఉన్నట్లే. ప్రపంచకప్‌లో అతడికి బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు కానీ.. వచ్చినపుడు అతను ఎంతో కీలకం అవుతాడు.

టోర్నీలో బౌలర్‌గా అతనెంత ముఖ్య పాత్ర పోషిస్తున్నాడో తెలిసిందే. బంగ్లాతో మ్యాచ్‌లో అతను మూడు బంతులే వేశాడు. అంతకుముందు తొలి మూడు మ్యాచ్‌ల్లో అయిదు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలరైన శార్దూల్‌ కంటే కెప్టెన్‌ రోహిత్‌ హార్దిక్‌నే ఎక్కువ నమ్ముతూ దాదాపుగా పూర్తి కోటా ఓవర్లు వేయిస్తున్నాడు. ఇప్పుడు హార్దిక్‌ అందుబాటులో లేకపోవడంతో కూర్పు పెద్ద సమస్యగా మారింది. హార్దిక్‌ స్థానాన్ని బ్యాటింగ్‌లో ఒకరితో, బౌలింగ్‌లో ఒకరితో భర్తీ చేయాల్సి వస్తోంది. అందువల్ల అదనంగా ఒక బ్యాటర్‌ లేదా బౌలర్‌ను ఎంచుకునే అవకాశం పోతోంది.

ప్రత్యామ్నాయాలు ఏవీ?

హార్దిక్‌ అందుబాటులో లేనపుడు తుది జట్టులో ఆడించడానికి మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ లేడు. టీమ్‌ఇండియాకు ఆడే స్థాయి ఉన్న పేస్‌ ఆల్‌రౌండర్లు దేశవాళీ క్రికెట్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. విజయ్‌ శంకర్, శివమ్‌ దూబె లాంటి పేస్‌ ఆల్‌రౌండర్లను ప్రయత్నించి చూసినా ఫలితం లేకపోయింది. విజయ్‌ శంకర్‌ను 2019 ప్రపంచకప్‌నకు ఎంపిక చేస్తే అతను జట్టుకు భారంగా మారాడు. శివమ్‌ బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో నిలకడగా రాణించలేకపోతున్నాడు. హార్దిక్‌ లాగా బ్యాటింగ్‌ చేయాల్సినపుడు స్పెషలిస్టు బ్యాటర్‌లా, బౌలింగ్‌ ఇస్తే ప్రధాన బౌలర్లలో ఒకడిలా సత్తా చాటే ఆటగాడు ఎవరూ భారత క్రికెట్లో కనిపించడం లేదు. కపిల్‌ దేవ్‌ తర్వాత దశాబ్దాల పాటు ఆయనకు దీటైన ఆల్‌రౌండర్‌ ఒక్కరూ కనిపించలేదు.

చివరికి హార్దిక్‌ రూపంలో ఒక నాణ్యమైన ఆల్‌రౌండర్‌ దొరికాడు. కానీ అతడి మీద జట్టు అతిగా ఆధారపడాల్సి వస్తోంది. తనకు దరిదాపుల్లో నిలిచే పేస్‌ ఆల్‌రౌండర్‌ మరొకరు కనిపించడం లేదు. అయితే ప్రపంచకప్‌లో మిగతా పెద్ద జట్లన్నింట్లోనూ పేస్‌ ఆల్‌రౌండర్లు కనీసం ఇద్దరు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాకు స్టాయినిస్, మిచెల్‌ మార్ష్‌.. న్యూజిలాండ్‌కు మిచెల్, నీషమ్‌.. ఇంగ్లాండ్‌కు స్టోక్స్, సామ్‌ కరన్‌.. దక్షిణాఫ్రికాకు మార్కో జాన్సన్, ఫెలుక్వాయో లాంటి పేస్‌ ఆల్‌రౌండర్ల అండ ఉంది. జట్టులో అవకాశం దక్కని పేస్‌ ఆల్‌రౌండర్లు మరెంతోమంది ఉన్నారు. కానీ భారత్‌ మాత్రం కేవలం హార్దిక్‌ పాండ్య మీదే ఆధారపడాల్సి వస్తోంది. అతను అందుబాటులో లేకుంటే ఇబ్బంది తప్పట్లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని