T20 World Cup 2024: ఆ ఇద్దరు.. ఆ కల నెలవేర్చుకుంటారా!

తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. ఇవాళ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Published : 05 Jun 2024 10:05 IST

వెస్టిండీస్‌... ఈ పేరు చెప్పగానే 2007 వన్డే ప్రపంచకప్‌ కళ్ల ముందు నిలుస్తుంది. భారత్‌ దారుణ పరాభవమే గుర్తుకొస్తుంది. కానీ అదే ఏడాదిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టాడు. గాయాన్ని మాన్పి అభిమానులను ఉర్రూతలూగించాడు.

మళ్లీ వెస్టిండీస్‌లో ప్రపంచకప్‌ వచ్చింది. కాకపోతే విండీస్‌ సహ ఆతిథ్య జట్టు. కానీ భారత్‌ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. ఈసారీ వన్డే ప్రపంచకప్‌లో పరాభవం ఎదుర్కొంది. అయితే 2007లోలా తొలి రౌండ్లోనే ఇంటికి రాలేదు. సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని బాధను మిగిల్చింది. అంటే 2007 వన్డే ప్రపంచకప్‌ నాటి మానసిక స్థితిలోనే ఉన్నారు ప్రస్తుత భారత అభిమానులు కూడా. ఈ బాధను ఇంకా మరిచిపోకమందే టీ20 ప్రపంచకప్‌ వచ్చింది. మరి ఈసారి 2007లో ఆడిన స్టార్లలో మిగిలిన రోహిత్‌శర్మ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు! 2007 వన్డే ప్రపంచకప్‌ సారథి అయిన రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకుంటారా! అభిమానుల బాధను తీరుస్తారా!

అతడొక్కడే

2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో రోహిత్‌శర్మ సభ్యుడు. ప్రస్తుత జట్టులో అతడొక్కడు మాత్రమే టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్నాడు. అపార అనుభవం ఉన్న రోహిత్‌పై ఇప్పుడు కెప్టెన్‌గా జట్టుకు కప్‌ అందించాల్సిన పెద్ద బాధ్యత ఉంది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఫైనల్‌కు చేర్చినా.. ఆఖరి మెట్టుపై తడబడడం రోహిత్‌కు చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని దూరం చేసింది. కెరీర్‌లో బహుశా చివరి ప్రపంచకప్‌ ఆడుతున్న రోహిత్‌.. కప్‌తో అభిమానులను మురిపించడానికి ఇంతకుమించిన అవకాశం దొరకదు. కానీ 2007 ప్రపంచకప్‌లో గెలిచిన తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ఇండియాకు మళ్లీ చిక్కలేదు. పోటీ కూడా బాగా పెరిగింది. ఈనేపథ్యంలో కప్‌ సాధించడం.. అది కూడా విదేశీ గడ్డపై నెగ్గడం పెద్ద సవాల్‌. బ్యాటింగ్‌ బలంగానే ఉన్నా.. బౌలింగ్‌ విభాగంలోనూ టీమ్‌ఇండియా బలంగా ఉంది. దీనికితోడు ప్రపంచ కప్ పీడకల నుంచి ఆటగాళ్లు కూడా ఇంకా మరిచిపోయి ఉండరు. ఈనేపథ్యంలో సహచరులను సమన్వయపరుచుకొంటూ.. వనరులను వాడుకుంటూ రోహిత్‌ ఎలా ముందుకెళ్తాడో అనేది ఆసక్తికరం.

అతడి కల తీరేనా!

కెప్టెన్‌ రోహిత్‌ది ఓ కథ అయితే... కోచ్‌ రాహుల్‌ది మరో కథ. 2007 వన్డే ప్రపంచకప్‌లో దారుణ పరాభవంతో సారథ్యం కూడా కోల్పోయాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.  సుదీర్ఘ కాలం భారత్‌కు ప్రాతినిథ్యం వహించినా ప్రపంచకప్‌ అతడి కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు రాహుల్‌ ముంగిట కోచ్‌గా సవాల్‌ ఉంది. అతడు జట్టును కప్‌ దిశగా నడిపించి.. వన్డే కప్‌ లోటును టీ20 కప్‌ ద్వారా అయినా తీర్చుకుంటాడా అనేది చూడాలి. పైగా కోచ్‌గా రాహుల్‌కు ఇదే చివరి కప్‌. ఈనేపథ్యంలో అతడి బుర్రకు పదునుపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అతడిపై ఎక్కువ ఒత్తిడి లేదు. ఎందుకంటే తనకు ఇదే చివరి కప్‌. ఈ కప్‌ను గెలిపిస్తే తెరవెనుక సూత్రధారిగా రాహుల్‌ చరిత్రలో నిలుస్తాడు. ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరిగే వెస్టిండీస్‌లో పిచ్‌లు భారత్‌ పిచ్‌ల మాదిరే కాస్త నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి ట్రాక్‌లపై మహా మహా జట్లను ఎదుర్కొని టీమ్‌ఇండియా కప్‌ అందుకోవాలంటే ద్రవిడ్‌ అపార అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అటు రోహిత్, ఇటు రాహుల్‌లు తమ కల నెరవేర్చుకుంటారా! అభిమానులను ఆనందంలో ముంచెత్తుతారా! అనేది వేచిచూడాల్సిందే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు