Team India: వస్తున్నారు... ఆడేస్తున్నారు.. సత్తా చాటిన యువ క్రికెటర్లు

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ భారత్‌ గెలవడానికి ప్రధాన కారణం.. యువ క్రికెటర్లు. బ్యాటింగ్‌లో అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పర్యటక జట్టుకు బజ్‌బాల్‌ క్రికెట్‌ రుచి చూపించారు.

Published : 10 Mar 2024 17:54 IST

టెస్టు జట్టులో స్థానం! ఏ భారత క్రికెటర్‌కైనా ఇదో పెద్ద కల. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడినా రాని తృప్తి అయిదురోజుల మ్యాచ్‌లో బరిలో దిగితే కలుగుతుందని ప్రతి క్రికెటర్‌ అంగీకరిస్తారు. 

కొన్నేళ్ల క్రితం వరకు భారత క్రికెట్లో టెస్టు జట్టు కూర్పు ఫిక్స్‌డ్‌గా ఉండేది. దిగ్గజ ఆటగాళ్లతో కిక్కిరిసిపోయి కనిపించేది.. సీనియర్‌ క్రికెటర్లు పాతుకుపోవడంతో రెడ్‌ బాల్‌ క్రికెట్లోకి రావడం కుర్రాళ్లకు అంత తేలిక అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు కొత్త కుర్రాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో తేలిగ్గా చోటు దక్కించుకుంటున్నారు. ఛాన్స్‌ రావడమే ఆలస్యం సత్తా చాటుతున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సర్ఫ్‌రాజ్‌ఖాన్, ధ్రువ్‌ జురెల్, దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఇదే కోవకు చెందుతారు. రజత్‌ పటీదార్‌ ఒక్కడే ఇందుకు మినహాయింపు.

సీనియర్లు లేకపోవడంతో..

రెగ్యులర్‌ సభ్యులు అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోవడం.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతిలో ఉండడం, కేఎల్‌ రాహుల్‌కు గాయం, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు లాంటి కారణాలు యువ ఆటగాళ్లకు టెస్టు ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కలను తీరుస్తున్నాయి. ఇలా అనూహ్యంగా ఛాన్స్‌లు దక్కించుకుంటున్న వాళ్లలో దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా ఏళ్ల తరబడి అవకాశాలు రాక విసిగిపోయిన సర్ఫరాజ్‌ఖాన్‌ లాంటివాళ్లూ ఉన్నారు. కెరీర్‌ ఆరంభంలోనే టెస్టు టేస్టు ఏమిటో తెలుసుకున్న ధ్రువ్‌ జురెల్‌ లాంటి వాళ్లూ ఉన్నారు. 

పడిక్కల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రతిభావంతుడిగా పేరు సంపాదించినా అతడికి టెస్టు జట్టులో ఆలస్యంగా స్థానం దక్కింది. 2021లో శ్రీలంకపై టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత ఈ కుర్రాడు కనిపించకుండాపోయాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున సత్తా చాటడంతో పరిమిత ఓవర్లకే పరిమితమవుతాడా అనిపించాడు. కానీ ఈ కుర్రాడికి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రజత్‌ పటీదార్‌ వరుసగా విఫలం కావడంతో పడిక్కల్‌కు ఛాన్స్‌ దక్కింది. ఇన్నాళ్లకు తనకు ఇష్టమైన టెస్టు రూపంలో భారత జట్టులోకి పిలుపొచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవ్‌దత్‌ అర్ధసెంచరీతో సత్తా చాటాడు. 

దూకుడు.. కొత్త షాట్లు

ఒకప్పుడు అవకాశం దొరికితే నెమ్మదిగా ఆడి జట్టులో స్థానాన్ని ఎలాగైనా పదిలం చేసుకోవాలనే ఆలోచనలో కుర్రాళ్లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడా ట్రెండ్‌ లేదు. పరిమిత ఓవర్ల జోరును టెస్టుల్లోకి చొప్పించి ధనాధన్‌ ఆటతో చెలరేగుతున్నారు కొత్త కుర్రాళ్లు. అరంగేట్రంలో తొలి అర్ధశతకాన్ని పడిక్కల్‌ సిక్స్‌తో పూర్తి చేయడమే ఇందుకు ఉదాహరణ. పరుగులు రాబట్టేందుకు రిస్క్‌ తీసుకోవడానికి కూడా యువ ఆటగాళ్లు జంకట్లేదు. ఇందుకు సర్ఫరాజ్‌ చక్కని ఉదాహరణ. ఈ కుర్రాడైతే ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్‌లా ఆడుతున్నాడు. అతడు కొడుతున్న కొన్ని షాట్లు బౌలర్ల మతిని పోగొడుతున్నాయి. తాజాగా ధర్మశాల అయిదో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేసే క్రమంలో పేసర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో సర్ఫ్‌రాజ్‌ కొట్టిన బౌండరీ అలాంటిదే. వుడ్‌ మెరుపు వేగంతో వేసిన బంతిని శరీరాన్ని విల్లులా వంచి సర్ఫ్‌రాజ్‌ బౌండరీకి పంపి ఔరా అనిపించాడు. నిజానికి అతడి శరీరతత్వానికి అలాంటి షాట్‌ ఆడడం సాహసమే. కానీ ఇప్పటి కుర్రాళ్లు అవేం ఆలోచించట్లేదు ఎలాగైనా పరుగులు రాబట్టాలన్న తపనతో ఉన్నారు. ఒకరకంగా ఈ దృక్పథం టెస్టు క్రికెట్‌ను ఆసక్తికరంగా మార్చడంలో ఒక కారకంగా మారుతోంది. అరుదుగా దొరికిన టెస్టు అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న యువ ఆటగాళ్లు.. సీనియర్లకు సవాల్‌ విసురుతున్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఇస్తున్నారు. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని