Team India: టీమ్‌ఇండియా ఇలాగైతే ఈసారి కూడా ప్రపంచకప్‌ కొట్టడం అనుమానమే!

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ సగం పూర్తయింది. ఇంకా సగం కన్నా తక్కువ మ్యాచ్‌లే మిగిలిఉన్నాయి. అయితే, ఇప్పటివరకు టీమ్‌ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు..

Published : 27 Apr 2022 01:25 IST

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ సగం పూర్తయింది. ఇంకా సగం కన్నా తక్కువ మ్యాచ్‌లే మిగిలిఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమ్‌ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లు (ఇద్దరు ముగ్గురు మినహా) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే పొట్టి ప్రపంచకప్‌పైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది వరకు టాప్‌ ఆటగాళ్లంతా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా 2015 నుంచి ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీలు సాధించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీ20 లీగ్‌లో భారత ఆటగాళ్లు ఎవరెవరు ఎలా ఆడుతున్నారో తెలుసుకుందాం.


రోహిత్‌ విఫలం: గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా విజయపథంలో నడిపించాడు. అయితే, ఈ టీ20 లీగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు ముంబయి కెప్టెన్‌గా, ఇటు ఓపెనర్‌గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. 8 మ్యాచ్‌లు ఆడి 19.13 సగటుతో 153 పరుగులే చేశాడు. కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలిపించలేదు.


ఇషాన్‌ తడబాటు: గతేడాది టీమ్‌ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినా సరైన ప్రదర్శనలు లేక తంటాలు పడ్డాడు. ఇప్పుడు ముంబయి జట్టులోనూ భారీ అంచనాల నడుమ తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 28.43 సగటుతో 199 పరుగులు చేశాడు. అయితే, ఇందులో సగానికి పైగా పరుగులు తొలి రెండు మ్యాచ్‌ల్లో వచ్చినవే. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. దీంతో అతడి బ్యాటింగ్‌ తీరు నానాటికీ పడిపోతోంది.


విరాట్‌ దారుణం: ఇక అన్ని జట్ల సారథిగా తప్పుకొన్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా రెచ్చిపోతాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 17 సగటుతో 119 పరుగులే చేశాడు. నానాటికీ కోహ్లీ ప్రదర్శన దిగజారిపోతోంది. అతడిలాగే ఆడితే టీమ్‌ఇండియాకు చాలా నష్టమనే చెప్పాలి.


రాహుల్‌ అత్యుత్తమం: టీమ్‌ఇండియాలో ప్రస్తుత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడంటే.. అది కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే. అతడు లఖ్‌నవూ వంటి కొత్త జట్టుకు కెప్టెన్‌గా ఆకట్టుకుంటూనే.. బ్యాట్స్‌మన్‌గానూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 61.33 సగటుతో 368 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు, ఒక అర్ధ శతకంతో మెరిశాడు.


సూర్యకుమార్‌ నిలకడగా: నిలకడత్వానికి పెట్టింది పేరు సూర్యకుమార్‌ యాదవ్‌. ముంబయితో ఈ సీజన్‌ ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయినా తర్వాత రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 47.80 సగటుతో 239 పరుగులు చేశాడు. రాహుల్‌ తర్వాత అత్యంత నమ్మకం కలిగిస్తున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముంబయి తరఫున ఎంత బాగా ఆడుతున్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. దీంతో అతడికి సరైన ఆటగాడు తోడైతే జట్టుకెంతో మేలు చేస్తాడు.


సాదాసీదా: మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు మంచిపేరుంది. ఆఖర్లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాలను తారుమారు చేస్తాడు. కానీ, ఈసారి దిల్లీని గెలిపించలేకపోతున్నాడు. అతడు పరుగులు తీస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేక అవస్థ పడుతున్నాడు. ఫలితంగా దిల్లీ కూడా సరైన ఫలితాలు సాధించలేకపోతోంది. ఇప్పటి వరకు అతడు ఆడిన 7 మ్యాచ్‌ల్లో (6 ఇన్నింగ్స్‌) 37.60 సగటుతో 188 పరుగులే సాధించాడు. దీంతో సాదాసీదా బ్యాటింగ్‌తో కొనసాగుతున్నాడు.


శ్రేయస్‌ ఓకే కానీ..: మిడిల్‌ ఆర్డర్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఈ సీజన్‌లో కోల్‌కతా కెప్టెన్‌గా విఫలమైనా.. బ్యాట్స్‌మన్‌గా భారీ స్కోర్లు చేయకపోయినా.. మోస్తరు పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 35.43 సగటుతో 248 పరుగులు చేశాడు. వాటిల్లో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. శ్రేయస్‌ నుంచి ఇంకా గొప్ప ప్రదర్శనలు ఆశించాల్సిన అవసరం ఉంది.


హార్దిక్‌ గ్రేట్‌: ఎవరూ ఊహించని రీతిలో చెలరేగుతున్నాడు కొత్త జట్టు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. అటు కెప్టెన్‌గా జట్టును అందరికన్నా మిన్నగా నడిపిస్తూనే ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడు. టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనే 73.75 సగటుతో 295 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటా వేస్తూ అక్కడ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేసి 7.56 ఎకానమీతో 4 వికెట్లు తీశాడు. దీంతో గ్రేట్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు.


జడేజా ఎందుకిలా: చాలా కాలంగా టీమ్‌ఇండియాలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా సేవలందించిన రవీంద్ర జడేజా ఈసారి చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అంచనాలు అందుకోలేక పూర్తిగా తడబడుతున్నాడు. అటు సారథిగా, ఇటు ఆల్‌రౌండర్‌గా తేలిపోయాడు. బ్యాటింగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 22.40 సగటుతో 112 పరుగులే చేసిన జడ్డూ.. బౌలింగ్‌లోనూ మోస్తరుగా నెట్టుకొస్తున్నాడు. దీంతో 8 మ్యాచ్‌ల్లో 5 వికెట్లే పడగొట్టి 8.19 ఎకానమీ నమోదు చేశాడు.


బుమ్రా కష్టంగానే: ప్రపంచ శ్రేణి పేసర్‌గా పేరున్న ముంబయి ప్రధాన బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఈ సీజన్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7.54 ఎకానమీతో ఫర్వాలేదనిపిస్తున్నా 5 వికెట్లే తీసి సాదాసీదా బౌలర్‌ వలే ఆడుతున్నాడు. దీంతో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు పెద్ద ప్రమాదం కాదన్నట్లు కనిపిస్తోంది. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.


షమి ఓకే: గుజరాత్‌ పేసర్‌గా మహ్మద్‌ షమి మంచి స్థితిలోనే బౌలింగ్‌ చేస్తున్నాడు. ఎకానమీ పరంగా చూసినా వికెట్లు సాధించడంలో గమనించినా ఈ టీమ్‌ఇండియా పేసర్‌ గొప్పగా రాణిస్తున్నాడు. దీంతో అతడు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 7.21 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. షమి ఇంకాస్త మెరుగైతే టీమ్‌ఇండియాకు కచ్చితంగా ప్రయోజనకరమే.


భువనేశ్వర్‌ ఫర్వాలేదు: హైదరాబాద్‌ కీలక పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఈ సీజన్‌లోనూ బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 7.41 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే, స్వింగ్‌ బౌలర్‌గా మంచి గుర్తింపున్న భువి ఇంకాస్త మెరుగైతే టీమ్‌ఇండియా జట్టులో మరోసారి ఢోకాలేకపోవచ్చు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని