Team india: టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌ టూర్‌... సెలక్టర్లకు కఠిన పరీక్షే!

Eenadu icon
By Sports News Team Updated : 12 May 2025 14:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా(Team India), ఇంగ్లండ్‌తో జూన్‌లో అయిదు టెస్టుమ్యాచ్‌లు ఆడనుంది. ఈ టూర్‌కు భారత జట్టు ఎంపిక ప్రస్తుతం సెలక్టర్లకు కఠిన సవాళ్లు విసురుతోంది. ఇటీవలే రోహిత్‌ శర్మ (Rohit Sharma) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కూడా టెస్ట్‌ క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఇలా దాదాపు ఒకేసారి రో-కో ద్వయం నిష్క్రమణతో ఇంగ్లండ్‌లో పర్యటించబోయే టీమ్‌ ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాములా మారనుంది. దీంతో ఈసారి సీనియర్‌ బ్యాటర్లు లేకుండానే టీమ్‌ఇండియా, ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

ఎక్కువ సమయమూ లేదు

ఈ వారంలోనే సెలక్షన్‌ కమిటీ ఇంగ్లండ్‌ వెళ్లబోయే ఇండియా- ఎ జట్టును ఎంపిక చేయనుంది. సీనియర్‌ జట్టు ఎంపికకు కూడా పెద్దగా సమయం లేదు. గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించే అవకాశాముంది. టీమ్‌ఇండియాకు సారథి ఎవరో ఇప్పటికైతే ఇంకా తేలలేదు. కానీ... ఇండియా-ఎకు మాత్రం అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. తనుష్ కోటియన్, బాబా ఇంద్రజిత్‌, ఆకాశ్‌దీప్‌, కరుణ్‌ నాయర్‌ తదితరులు భారత్‌- ఎ జట్టుకు దాదాపు ఎంపికైనట్లే!  నితీశ్‌ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇంగ్లండ్‌లో వీరి ఆటతీరు ఆధారంగా వీరిలోంచి పలువురు సీనియర్‌ జట్టులో స్థానం పొందే అవకాశమూ ఉంది.

అభిమానుల్లో ఆసక్తి! 

రంజీ ట్రోఫీలో దుమ్మురేపిన శార్దూల్‌ ఠాకూర్‌ టీమ్‌ఇండియా సీనియర్‌ టీమ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌ పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తాయి. అందుకే సెలక్టర్ల నుంచి శార్దూల్‌ పిలుపు అందుకునే ఛాన్స్‌ ఉంది. ధ్రువ్‌ జురేల్‌, రిషభ్‌పంత్‌.. ఈ ఇద్దరు వికెట్‌ కీపర్లకు బెర్త్‌ ఖాయం. ఇషాన్‌ కిషన్‌ ఇటీవలే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు పొందినప్పటికీ ఇంగ్లండ్‌ టూర్‌కు మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు. టెస్టులకు విరాట్‌ కోహ్లీ రిటైర్‌మెంట్‌ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌కు టీమ్‌లో స్థానం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన సాయిసుదర్శన్‌ వైపు కూడా సెలక్టర్లు మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. ముఖేష్‌ కుమార్‌, యశ్‌దయాళ్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవలే గాయం నుంచి కోలుకున్న సర్ఫరాజ్‌ఖాన్‌కు పిలుపు రావడం కష్టమే. సీనియర్‌ సీమర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) ఎంపికవడమూ అంత తేలికగా కనిపించడం లేదు. పునరాగమనం తర్వాత షమీ మునుపటి రిథమ్‌లో కనిపించడం లేదు. బౌలింగ్‌లో పదును కూడా తగ్గింది. వికెట్లు తీయడంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. వర్క్‌లోడ్‌ నేపథ్యంలో బుమ్రా (Jasprit Bumrah) కూడా ఈ సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒకేసారి ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణతో ఇంగ్లండ్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శన ఎలా ఉండనుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

Tags :
Published : 12 May 2025 13:43 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని