IPL 2024: ఐపీఎల్‌.. లీగ్‌ చరిత్రలో అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్లు ఇవే!

ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌ మార్చి 22న సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌తో ప్రారంభంకానుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం. 

Updated : 14 Mar 2024 11:40 IST

ఐపీఎల్-2024 (IPL 2024)సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఛాంపియన్‌గా నిలవడానికి పది జట్లూ సర్వశక్తులు ఒడ్డుతాయి. కానీ, కొన్ని మాత్రమే టాప్‌-4లో నిలిచి టైటిల్‌ రేసులో నిలబడతాయి. మరి లీగ్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లేవో ఓ లుక్కేద్దాం..  

ముంబయి ఇండియన్స్

ఐపీఎల్‌లో ఎక్కువసార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్టు ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians). ఇప్పటివరకు 16 ఎడిషన్లలో బరిలోకి దిగిన ముంబయి.. 10సార్లు ప్లేఆఫ్స్‌కు, ఆరుసార్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ను అందుకుంది. ఈ ఐదు టైటిళ్లు రోహిత్‌ శర్మ సారథ్యంలో వచ్చినవే. 2010లో మాత్రమే చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2011లో మూడో స్థానం, 2012, 2014, 2023లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎక్కువసార్లు (5) ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టు ముంబయే. 2023లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలిచి ఐదుసార్లు టైటిల్‌ అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. 


చెన్నై సూపర్‌ కింగ్స్‌ 

ఐపీఎల్‌లో అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌ ఆడిన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings). 14 సీజన్లలో లీగ్‌లో పాల్గొన్న సీఎస్కే రికార్డుస్థాయిలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. 2020, 2022లో మాత్రమే ఆ జట్టు టాప్‌-4లో నిలవలేదు. అత్యధిక (10) సార్లు ఫైనల్స్‌ ఆడిన రికార్డు చెన్నై పేరిటే ఉంది. ఐదుసార్లు  (2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్‌గా నిలిచింది. ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2009లో సెమీఫైనల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 2014లో రెండో క్వాలిఫయర్‌లో పంజాబ్‌ చేతిలో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో రెండు సీజన్లలో (2016, 2017) సీఎస్కేపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 

ఐపీఎల్‌లో విశేషమైన అభిమానగణం ఉన్న జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒకటి. జట్టు నిండా ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నా ఆ జట్టుకు ఇప్పటివరకు టైటిల్ కల నెరవేరలేదు. ఆర్సీబీ ఇప్పటివరకు 16 సీజన్లలో పాల్గొని ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్‌కు చేరి చివరి మెట్టుపై బోల్తాపడింది. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌, 2011లో సీఎస్కే, 2016లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2010, 2015, 2022లో 3వ స్థానం, 2020, 2021లో నాలుగో స్థానంలో నిలిచింది.  


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 

ఐపీఎల్‌లో ప్రమాదకరమైన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) ఒకటి. ఈ టీమ్‌ తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా మట్టికరిపించగలదు. ఇప్పటివరకు 16 సీజన్లు ఆడి 7 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్‌కు వెళ్లి రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. గంభీర్‌ సారథ్యంలో 2012 ఫైనల్‌లో సీఎస్కేను, 2014 ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించి టైటిల్‌ను అందుకుంది. 2021 ఫైనల్‌లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2017, 2018లో 3వ స్థానం.. 2011, 2016లో నాలుగో స్థానంలో నిలిచింది. 


సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఇప్పటివరకు 11 సీజన్లలో పాల్గొని ఆరుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. డేవిడ్ వార్నర్‌ సారథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ 2016 ఫైనల్‌లో ఆర్సీబీని ఓడించి తొలి టైటిల్‌ను అందుకుంది. 2018లో కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలో ఎస్ఆర్‌హెచ్‌ అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్‌లో మాత్రం సన్‌రైజర్స్‌కు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2020లో మూడో స్థానం, 2013, 2017, 2019లో నాలుగో స్థానంలో నిలిచింది.  


దిల్లీ క్యాపిటల్స్‌ 

దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) ఇప్పటివరకు 16 సీజన్లలో బరిలోకి దిగి ఆరుసార్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఈ జట్టు ఒకే ఒక్కసారి (2020)లో ఫైనల్‌కు చేరింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తుదిపోరులో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. 2009, 2012, 2019, 2021లో మూడో స్థానం, 2008లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక.. ఇతర జట్లలో అత్యధికంగా రాజస్థాన్‌ రాయల్స్‌ 14 ఎడిషన్లలో పాల్గొని ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. గుజరాత్ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు చేరాయి. అత్యల్పంగా పంజాబ్‌ కింగ్స్ 16 సీజన్లలో ఆడి రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వచ్చింది. 2014లో కేకేఆర్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2008లో మూడో స్థానం దక్కించుకుంది. 

- ఇంటర్నెట్ డెస్క్ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని