Tilak Varma: వన్డే ప్రపంచ కప్‌... 2003, 2019 సీన్ రిపీట్‌ అవుతుందా?

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో బరిలోకి దిగబోయే భారత జట్టు (Team India)ను BCCI సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. అందులో తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ (Tilak Varma)కు చోటు దక్కలేదు. దీంతో 2003, 2019 ప్రపంచకప్‌ సమయంలో ఇలాగే తెలుగు క్రికెటర్లకు చోటు దక్కని అంశాలు చర్చలోకి వచ్చాయి.

Updated : 06 Sep 2023 18:47 IST

క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడికీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడటం ప్రథమ లక్ష్యమైతే.. ఆ తర్వాత ప్రపంచకప్ ఆడటం.. జట్టుతో పాటు కప్పు అందుకోవడం కల. టీ20ల్లో కూడా ప్రపంచకప్ ఉన్నా, సుదీర్ఘ చరిత్ర కలిగిన వన్డే ప్రపంచకప్ అంటే చాలా ప్రత్యేకం. ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం అందినట్లే అంది చేజారితే కలిగే బాధ అంతా ఇంతా కాదు. తెలుగు గడ్డ నుంచి ఈ అవకాశం త్రుటిలో చేజార్చుకున్న క్రికెటర్లు కొందరున్నారు. ఆయా సందర్భాల్లో వారికి అన్యాయం జరిగిందని తెలుగు వాళ్లే కాదు.. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఫీలయ్యారు. సెలక్షన్‌లో జరిగిన ఈ తప్పిదం టోర్నీలో జట్టు అవకాశాలను కూడా దెబ్బ తీయడం గమనార్హం. 2003లో వీవీఎస్ లక్ష్మణ్‌ (VVS Laxman)కు, 2019లో అంబటి రాయుడి (Ambati Rayudu)కి ఇలాంటి అన్యాయమే జరిగింది. అది జట్టుకూ చేటు చేసింది. ఇప్పుడు తిలక్ వర్మ (Tilak Varma) విషయంలోనూ సెలక్టర్లు తప్పు చేశారా అనే చర్చ జరుగుతోంది.

20 ఏళ్లు వెనక్కి వెళ్తే..

2003 వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఏం జరిగిందో.. అప్పటి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్‌ టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో ఆల్ టైం గ్రేట్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకోవడమే కాక వన్డే జట్టులోనూ స్థానం సంపాదించిన వీవీఎస్ లక్ష్మణ్.. ఈ ఫార్మాట్లోనూ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి మేటి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాపై నిలకడగా రాణించాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో లక్ష్మణ్ కచ్చితంగా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ, సెలక్షన్ కమిటీ అతడికే కాక అభిమానులకూ పెద్ద షాకిచ్చింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌నకు లక్ష్మణ్‌ను కాదని దినేశ్ మోంగియాను ఎంపిక చేసింది. 

ప్రపంచకప్‌కు ముందు ప్రదర్శన చూసుకుంటే కచ్చితంగా లక్ష్మణే.. దినేశ్ కన్నా మెరుగైన ఆటగాడని ఎవ్వరైనా ఒప్పుకొంటారు. కానీ, సెలక్టర్లు మాత్రం మన లక్ష్మణ్‌కు మొండిచేయి చూపించారు. తెలుగు వాళ్లే కాక.. దేశవ్యాప్తంగా మెజార్టీ క్రికెట్ అభిమానుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఆ ప్రపంచకప్‌లో దినేశ్ మోంగియా పెద్దగా సాధించిందేమీ లేదు. భారత్ ఓటమి పాలైన ఫైనల్ సహా అతను ఆడిన ఏ మ్యాచ్‌లోనూ రాణించలేదు. దినేశ్ 11 మ్యాచ్‌ల్లో కేవలం 20 సగటుతో 120 పరుగులే చేయడంతో లక్ష్మణ్‌ను ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పిదమని తేలింది.

నాలుగేళ్ల ముందు..

2019 ప్రపంచకప్‌ ముంగిట అంబటి రాయుడికి జరిగిన అన్యాయంపై పెద్ద చర్చే జరిగింది. అప్పుడు చీఫ్ సెలక్టర్ తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాదే. అప్పటికే టీమ్ ఇండియాకు కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ మెరుగైన ప్రదర్శనే చేశాడు రాయుడు. అతడి వన్డే సగటు 47 కావడం గమనార్హం. ఐతే చివరగా ఆడిన ఓ సిరీస్‌లో మాత్రమే రాయుడు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఆ మాత్రానికే సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టేశారు. మిడిలార్డర్లో సత్తా చాటగల అనుభవం, నైపుణ్యం ఉన్నా సరే రాయుడిని పక్కన పెట్టేశారు. 

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడతాడని.. ‘త్రీడీ ప్లేయర్’ అంటూ తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేసింది ప్రసాద్ కమిటీ. కానీ అతను ఏ డైమన్షన్‌లోనూ జట్టుకు ఉపయోగపడలేదు. పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారాడు. శంకర్ వల్ల జట్టు సమతూకమే దెబ్బతింది. విజయ్ ఫెయిలయ్యాడని దినేశ్ కార్తీక్‌ను ఆడిస్తే అతనూ తేలిపోయాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో ఓడి జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌లో రాయుడు ఉంటే కథ వేరుగా ఉండేదన్న అభిప్రాయం అభిమానుల్లోనే కాక విశ్లేషకుల్లోనూ వ్యక్తమైంది. 

మరి ఇప్పుడు?

ఇక వర్తమానంలోకి వస్తే.. ఈసారి హైదరాబాద్ నుంచి మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అతను కొన్నేళ్లుగా జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. కానీ తనతో పాటు తెలుగు గడ్డ నుంచి తిలక్ వర్మ కూడా ప్రపంచకప్‌లో ఆడతాడని అభిమానులు ఆశించారు. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో అతను అదరగొట్టాడు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి కూడా వచ్చాడు. ఈ మధ్యే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్‌లో ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలో పట్టుదలతో నిలిచాడు. 5 మ్యాచ్‌ల్లో 58 సగటుతో 173 పరుగులు చేశాడు. దీంతో అనూహ్యంగా ప్రపంచకప్ రేసులోకి వచ్చాడు. ఆసియా కప్‌ వన్డే టోర్నీకి ఎంపిక కావడంతో తిలక్ ప్రపంచకప్‌లో ఆడటంపై ఆశలు రేగాయి. 

కానీ చివరికి అనుభవం లేదని అతడిని పక్కన పెట్టేశారు. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నప్పటికీ కేఎల్ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌లకు అవకాశమిచ్చారు. మరోవైపు వన్డేల్లో సాధారణ ప్రదర్శన చేసిన, ఎన్నో అవకాశాలిచ్చినా ఉపయోగించుకోని సూర్యకుమార్‌ కూడా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌లో తిలక్‌ను ఆడించి, ఒకవేళ అతను రాణిస్తే ప్రపంచకప్‌నకు ఎంపిక చేసి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరంగేట్రంలోనే సీనియర్లను మించి చక్కటి ప్రదర్శన చేసిన తిలక్‌ను అనుభవం లేదని పక్కన పెట్టడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోసారి ప్రపంచకప్‌లో తెలుగు క్రికెటర్‌కు మొండిచేయి చూపించిన టీమ్‌ఇండియా.. ఈ విషయంలో చింతించే పరిస్థితి వస్తుందేమో చూద్దాం.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు