RCB: ఆర్సీబీని విక్రయించాలంటున్న టెన్నిస్ స్టార్‌.. బ్యాటర్ల విధ్వంసంపై సచిన్ ఆసక్తికర పోస్టు

ప్రతి ఏడాది మాదిరిగానే ఆర్సీబీ (RCB) ఈ సారి కూడా అభిమానులను నిరాశపరుస్తోంది. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. 

Updated : 16 Apr 2024 14:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఈ సాలా కప్‌ నమదే’ అంటూ ఏటా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్‌ సందడి చేస్తారు. జట్టునిండా స్టార్‌ ఆటగాళ్లున్నా సరైన సమయంలో రాణించకుండా కనబర్చకుండా చివరకు అభిమానులను నిరాశపరుస్తుంటారు. ఈ సీజన్‌లో కూడా ఆర్సీబీ తీరు మారలేదు. సగం (7) మ్యాచ్‌లు ఆడేసి ఒకే ఒక్కటి నెగ్గింది. సోమవారం సన్‌రైజర్స్‌ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో ఆర్సీబీ తీవ్రంగా పోరాడినా పరాజయం తప్పలేదు. 262 పరుగులు చేసి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఓటమిని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారీగా పరుగులు ఇచ్చిన ఆర్సీబీ బౌలర్లను ట్రోలింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపైనా మండి పడుతున్నారు. జట్టును వేరే యజమానికి అమ్మేసి పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

‘‘స్పోర్ట్, ఐపీఎల్, అభిమానులు, చివరికి ఆటగాళ్ల కోసమైనా ఆర్సీబీని బీసీసీఐ కొత్త యజమానికి విక్రయించాలి. ఇతర జట్ల వలే స్పోర్ట్స్‌ ఫ్రాంచైజీని నిర్మించడానికి శ్రద్ధ వహించే యజమానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను’’ అని మహేశ్ భూపతి సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X)లో రాసుకొచ్చాడు.

బెంగళూరు, హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరదపారించారు. దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఎక్స్‌ (X)లో ఆసక్తికర పోస్టు చేశాడు. ‘‘సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ఆర్సీబీ పవర్‌ హిట్టింగ్‌తో అద్భుతమైన ఆటతీరును కనబర్చాయి. మ్యాచ్‌లో 40 ఓవర్లలో 549 పరుగులు వచ్చాయి. ఇలా అయితే ఎవరైనా బౌలర్ కావాలని కోరుకుంటారా?’’ అని సచిన్ పోస్టు పెట్టాడు.

‘రూ.47 కోట్లు బెంచ్‌కే పరిమితం’

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు తమ స్టార్‌ ఆటగాళ్లను పక్కనపెట్టింది. కామెరూన్‌ గ్రీన్‌ (రూ.17.5 కోట్లు), అల్జారీ జోసెఫ్‌ (రూ.11.5 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్‌ సిరాజ్‌ (రూ.7 కోట్లు) తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నలుగురికి చెల్లించే మొత్తం రూ.47 కోట్లు. ఈ భారీ మొత్తం చెల్లించి వారిని బెంచ్‌కే పరిమితం చేయడాన్ని భారత ఆటగాడు అభినవ్‌ ముకుంద్ తప్పుబట్టాడు. ‘‘17.5+11.5+11+7 కోట్లు ఆర్సీబీ బెంచ్‌ మీద ఉంచింది’’ అని ఎక్స్‌ (X)లో పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని