Praggnanandhaa: అమ్మానాన్న చిరకాల కల నెరవేరింది.. థాంక్యూ మహీంద్రా సర్‌: ప్రజ్ఞానంద

ఆనంద్‌ మహీంద్రా కారణంగా తన తల్లిదండ్రుల చిరకాల కోరిక తీరిందని అంటున్నాడు మన చెస్‌ ఛాంపియన్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa). మహీంద్రా ఆఫర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

Published : 30 Aug 2023 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెస్‌ ప్రపంచకప్‌ (Chess Worldcup) ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచినా సరే.. తన ప్రతిభతో కోట్లాది మంది భారతీయుల మనసులు గెల్చుకున్నాడు చెన్నై చిన్నోడు ప్రజ్ఞానంద (Praggnanandhaa). అయితే ఫైనల్‌ పోరులో టైటిల్‌ చేజార్చుకున్నప్పటికీ.. అతడి తల్లిదండ్రుల చిరకాల కల మాత్రం నెరవేరిందట. దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra)నే కారణమంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఫిడె చెస్‌ వరల్డ్‌ కప్‌ (FIDE Chess World cup)లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద (Praggnanandhaa)ను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఇటీవల ఓ బహుమతి ప్రకటించారు. అతడి తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్‌ బాబుకు XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించారు. దీనికి మహీంద్రా అండ్‌ మహీంద్రా సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్ జెజురికర్‌ స్పందిస్తూ.. ఆనంద్‌ మహీంద్రా ఆలోచనను అభినందించారు. వెంటనే XUV400 ప్రత్యేక ఎడిషన్‌ ఈవీని అతడి తల్లిదండ్రులకు డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్‌ మహీంద్రా గిఫ్ట్‌..

దీనిపై ప్రజ్ఞానంద స్పందిస్తూ ఆనంద్‌ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘‘ధన్యవాదాలు చెప్పేందుకు నాకు మాటలు కూడా రావట్లేదు. ఈవీ కారును కొనుగోలు చేయాలనేది మా అమ్మానాన్న చిరకాల కల. దాన్ని నిజం చేసినందుకు ఆనంద్‌ మహీంద్రా సర్‌, రాజేశ్ సర్‌కు కృతజ్ఞతలు’’ అని ప్రజ్ఞానంద ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.. ‘‘కార్లు తయారీదారుల అంతిమ లక్ష్యం.. కస్టమర్ల కలలను నెరవేర్చడమే’’ అంటూ రాసుకొచ్చారు.

ఇక, చెస్‌ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచినా.. తన ప్రతిభతో ఎంతో మందికి స్ఫూర్తిగా మారిన ప్రజ్ఞానందకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడిని రాష్ట్ర క్రీడా శాఖ అధికారులు దగ్గరుండి స్వాగతించారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని