Anand Mahindra: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్‌ మహీంద్రా గిఫ్ట్‌..

చెస్‌ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై చిన్నోడు ప్రజ్ఞానంద (Praggnanandhaa) తల్లిదండ్రులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఓ బహుమతి ప్రకటించారు.

Updated : 28 Aug 2023 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సృజనాత్మక, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల చెస్‌ ప్రపంచకప్‌ (Chess Worldcup)లో టైటిల్‌ చేజార్చుకున్నప్పటికీ.. దిగ్గజ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి అందరి మనసులు గెల్చుకున్న ప్రజ్ఞానంద (Praggnanandhaa)పై ఆయన ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి మహీంద్రా మంచి గిఫ్ట్‌ ప్రకటించారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్‌ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఫిడె చెస్‌ వరల్డ్‌ కప్‌ (FIDE Chess World cup)లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద (Praggnanandhaa)ను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ పెట్టారు. దీనికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ప్రజ్ఞానందకు థార్‌ వాహనాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ ట్వీట్లకు స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. సోమవారం ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ప్రజ్ఞానందకు థార్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని చాలా మంది నన్ను కోరుతున్నారు. అయితే నా దగ్గర మరో ఐడియా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్‌ ఆటను పరిచయం చేయాలని.. వారికి ఆ గేమ్‌పై ఆసక్తిని పెంచేలా వారిని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నా. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా మన భావితరాల భవిష్యత్తుకు మంచి పెట్టుబడి అని భావిస్తున్నా. అందువల్ల, ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్‌ బాబుకు నేను XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. కుమారుడి అభిరుచిని ప్రోత్సహించి.. ఆ రంగంలో అతడు ఎదిగేలా నిరంతర మద్దతునిచ్చిన ఆ తల్లిదండ్రులు ఈ కానుకకు పూర్తి అర్హులు’’ అని ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) రాసుకొచ్చారు.

నాటి లడ్డూనే.. నేటి గోల్డ్‌ ఎహే: బల్లెం వీరుడి కథ తెలుసా..?

అంతేగాక, ఈ ఆలోచనకు తన అభిప్రాయం కూడా తెలపాలంటూ మహీంద్రా అండ్‌ మహీంద్రా సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్ జెజురికర్‌ను ఆనంద్‌ మహీంద్రా ట్యాగ్ చేశారు. దీనికి రాజేశ్ బదులిస్తూ.. ‘‘అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ప్రజ్ఞానందకు అభినందనలు. అతడి తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని గుర్తించి.. వారికి కానుకను ప్రకటించినందుకు ఆనంద్‌ మహీంద్రాకు కృతజ్ఞతలు. XUV400 ప్రత్యేక ఎడిషన్‌ ఈవీని అతడి తల్లిదండ్రులకు డెలివరీ చేస్తాం’’ అని తెలిపారు.

ప్రస్తుతం ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మీ ఆలోచనా ధోరణి నిజంగా స్ఫూర్తిదాయకం. చెస్‌ లాంటి ఆటలపై పిల్లలకు ఆసక్తిని కలిగించడం మన భవిష్యత్తు తరానికి గొప్ప పెట్టుబడి. మీ నిర్ణయానికి అభినందనలు సర్‌’’ అని నెటిజన్లు మహీంద్రాను కొనియాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని