Delhi Vs Kolkata: మేం అనుకున్న స్కోరు ఇది కాదు.. 270+ పరుగులు చేయడంపై శ్రేయస్‌

ఐపీఎల్‌లో కోల్‌కతా హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. వైజాగ్‌లో దిల్లీని వందకుపైగా పరుగుల తేడాతో చిత్తు చేసింది.

Published : 04 Apr 2024 08:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యుత్తమ స్కోరు సాధించిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. వారం రోజుల కిందట హైదరాబాద్‌ చేసిన 277 పరుగులకు కాస్త దగ్గరగా వచ్చినా ఆ రికార్డును అధిగమించలేదు. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ జట్టుపై 106 పరుగుల తేడాతో శ్రేయస్‌ నాయకత్వంలోని కోల్‌కతా విజయం సాధించింది. తొలుత కోల్‌కతా 272/7 స్కోరు చేయగా.. దిల్లీ 166 పరుగులే ఆలౌటైంది. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల సారథులు మాట్లాడారు. భారీ రికార్డును అధిగమిస్తారని భావించారా? అన్న ప్రశ్నకు శ్రేయస్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

‘‘అలాంటిదేమీ లేదు. మా ప్రారంభం చూశాక కచ్చితంగా 220 పరుగుల వరకు చేస్తామని అనుకున్నాం. కానీ, 270 సాధించడం చాలా బాగుంది. భారీ స్కోరు రికార్డు మిస్‌ అయినందుకు ఏమాత్రం బాధ లేదు. పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడటం ఎప్పుడూ రిస్కే. అయితే, ఇంతకుముందే చెప్పినట్లు సునీల్‌ నరైన్ ప్రత్యర్థి బౌలింగ్‌పై రెచ్చిపోతే మా పని ఇంకా తేలికవుతుంది. యువ ఆటగాడు రఘువంశీ నిర్భయంగా ఆడేస్తాడు. పరిస్థితికి అనుగుణంగా ఆడటం అతడి స్పెషాలిటీ. భారీ లక్ష్యం నిర్దేశించినా బౌలింగ్‌ సరిగ్గా లేకపోతే ఓటమి భయం ఉంటుంది. కానీ, మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. బాధ్యతగా ప్రత్యర్థిని కట్టడి చేసి విజయాన్ని అందించారు. యువ బౌలర్ హర్షిత్ రాణా గాయం పరిస్థితి ఇంకా తెలియదు. భుజం నొప్పితో బాధపడుతున్నట్లుగా ఉంది. వైభవ్‌ అరోరా కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి కారణమయ్యాడు. వరుసగా మూడు విజయాలు నమోదు చేయడం ఆనందంగా ఉంది. కానీ, నేల విడిచి సాము చేయం. ఎందుకంటే ఐపీఎల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు’’ అని శ్రేయస్‌ వెల్లడించాడు. 

మా బౌలర్లకు కలిసి రాలేదు: పంత్

‘‘మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. కానీ, ప్రణాళికలు అనుకున్న విధంగా సాగలేదు. మరింత బాగా బౌలింగ్ చేయగల సత్తా మాకుంది. తప్పకుండా తదుపరి మ్యాచుల్లో నాణ్యమైన ప్రదర్శన చేస్తాం. కొన్ని డీఆర్‌ఎస్‌లను తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాం. హోరెత్తిన అభిమానంతోపాటు డీఆర్‌ఎస్‌ టైమర్‌ను స్క్రీన్‌పై సరిగ్గా చూపకపోవడం వల్ల తీసుకోలేకపోయాం. స్క్రీన్‌కు సంబంధించి సమస్య ఉత్పన్నమైనట్లుంది. అక్షర్ పటేల్‌కు ఒక్క ఓవర్‌ మాత్రమే ఇవ్వడానికి కారణముంది. స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు వేయించకూడదని ముందే భావించాం. ఫాస్ట్‌ బౌలర్లు మరీ ఎక్కువగా పరుగులు ఇచ్చేశారు. తప్పకుండా పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుంటాం. వ్యక్తిగతంగా నా ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి రోజును ఆస్వాదిస్తున్నా. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజం. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతూ ఉండాలి’’ అని దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని