kohli-Tendulkar: విరాట్‌-సచిన్‌.. వీరిది భారత క్రికెట్‌లో ఓ అపురూప బంధం..!

భారత క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చిన ఆటగాళ్లు సచిన్‌-విరాట్‌. ఒకరు చరిత్రను లిఖిస్తే.. మరొకరు ఆ చరిత్రను తిరగరాస్తున్నారు. వీరిద్దరి మధ్య అద్భుతమైన సోదర బంధం ఉంది. బ్యాటింగ్‌ టెక్నిక్‌ నుంచి మానసిక దృఢత్వం వరకు సచిన్‌ నుంచి కింగ్‌ ఎన్నో విషయాలను పుణికి పుచ్చుకొన్నాడు. ఈ విషయాన్ని అంగీకరించడానికి అతడు ఎక్కడా సంకోచించడు.

Updated : 06 Nov 2023 13:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కింగ్‌ కోహ్లీకి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ (Sachin Tendulkar)తో ఉన్న బంధం చాలా ప్రత్యేకమైంది. విరాట్‌ (Virat Kohli)కు సచిన్‌ మార్గదర్శిగా.. మిత్రుడిగా.. సోదరుడిగా అండగా నిలుస్తూ ముందుకు నడిపించాడు. అంతేకాదు.. భారత క్రికెట్‌ భవిష్యత్తు విరాట్‌ (Virat Kohli) చేతుల్లో ఉందని దాదాపు పదేళ్ల క్రితమే సచిన్‌ (Sachin Tendulkar) బలంగా నమ్మాడు. కింగ్‌ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ సచిన్‌ దుర్భేద్యమైన 49 వన్డే శతకాల రికార్డును సమం చేశాడు.

భారత్‌తో తలపడేది ఎవరు? రెండు బెర్తుల కోసం నాలుగు జట్ల పోటీ.. సెమీస్ రేసు ఇలా..

సచిన్‌ కూడా తమ్ముడి విజయాన్ని చూసిన అన్నలా ఈ క్షణాలను చూసి మురిసిపోయాడు.. ‘‘49 నుంచి 50కు చేరడానికి నాకు 365 రోజులు పట్టింది(వయసునుద్దేశించి). కానీ రాబోయే కొన్ని రోజుల్లోనే నువ్వు 49 నుంచి 50కి (సెంచరీలు) చేరుకుని నా రికార్డు బద్దలుకొడతావని ఆశిస్తున్నా. అభినందనలు’’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి విరాట్‌ (Virat Kohli) కూడా వినమ్రంగా ‘‘నా హీరో రికార్డును సమం చేయడం చాలా ప్రత్యేకం. ఆయన (సచిన్‌) బ్యాటింగ్‌లో పరిపూర్ణత ఉంటుంది. కానీ, నేను ఆయనంత బాగా ఆడటంలేదనే భావిస్తుంటాను. నాకు ఇదో భావోద్వేగ క్షణం. నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుంది. సచిన్‌ ఆటను టీవీలో చూస్తూ పెరిగిన రోజులు గుర్తున్నాయి. ఆయన నుంచి వచ్చిన అభినందనలు నాకు చాలా ప్రత్యేకం’’ అని తన అభిమానం చాటుకొన్నాడు.

తొలిసారి కలిసి ఆడినప్పుడు..

విరాట్‌ 2008లో కొత్తగా టీమ్‌ ఇండియాకు సెలక్ట్‌ అయ్యాడు. అతడిని జట్టులోని సీనియర్లు ఆటపట్టించాలనుకొన్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన వారు.. సచిన్‌కు పాదాభివందనం చేస్తారు. నువ్వు కూడా వెళ్లు అన్నారు. లేకపోతే ఏం జరిగినా మాకు సంబంధం లేదని భయపెట్టారు. విరాట్‌ చాలా సేపు ఆలోచించి నిజమే అనుకొని మైదానంలో ప్రాక్టిస్‌ అనంతరం సచిన్‌ గదిలోకి వెళ్లి కాళ్లకు దణ్ణం పెట్టబోయాడు. వెంటనే మాస్టర్‌ అడ్డుకొని.. ఎందుకిలా చేస్తున్నావ్‌ అని అడిగాడు.. ఏమో ఇది జట్టు ఆచారమని యువరాజ్‌, భజ్జీ, మునాఫ్‌ పటేల్‌ చెప్పారని అన్నాడు. ఈ విషయాన్ని విరాట్‌ పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించాడు. అప్పటికే సచిన్‌ భారత క్రికెట్‌లో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు. ఆ తర్వాత సచిన్‌తో విరాట్‌ బంధం బలపడింది. కోహ్లీ బ్యాటింగ్‌ మెరుగుపడటానికి సచిన్‌ చాలా సందర్భాల్లో సాయం చేశాడు. అతడు మరింత శ్రమించాల్సిన విభాగాలను సూచించేవాడు. ‘‘సచిన్‌ స్థాయి వ్యక్తులు ఇలా కేరింగ్‌ తీసుకొని చెప్పడం చాలా అరుదు’’ అంటూ విరాట్‌ ఓ సందర్భంలో గుర్తు చేసుకొన్నాడు.

2011లో ప్రపంచకప్‌ను భారత్‌ అందుకున్న సమయంలో విరాట్‌ ఏకంగా మాస్టర్‌ను భూజాలపై ఎత్తుకొని మైదానంలో తిప్పాడు. అనంతరం మాట్లాడుతూ ‘‘ఈ దేశం భారాన్ని ఆయన 21 ఏళ్లు మోశాడు. అందుకే ఇప్పుడు ఆయన్ను మేము భూజాలపై ఎత్తుకొవాల్సిన సమయం వచ్చింది’’ అని చెప్పాడు. అప్పట్లో జట్టులో విరాట్‌కు భజ్జీ, యువరాజ్‌, జహీర్‌ఖాన్‌తో మంచి స్నేహం ఉంది. ప్రపంచకప్‌ గెలిచిన రోజు రాత్రి ఈ ముగ్గురు.. సచిన్‌ గదిలోకి వెళ్లారు. మోకాళ్లపై కూర్చొని ‘తుఝ్‌ మే రబ్‌ దిఖ్తాహై’ (నీలో భగవంతుడిని చూస్తున్నాను) అంటూ ‘రబ్‌ నే బనాదీ జోడీ’ సినిమా పాట అందుకొన్నారు.

కోహ్లీ రికార్డుపై పదేళ్ల క్రితమే జోస్యం..

2012లో సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ సందర్భంగా రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దానిలో పాల్గొన్న సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడం అసంభవం. ఎవరైనా మీ రికార్డు బద్దలు కొడతారని అనుకొంటున్నారా..?’’ అంటూ ప్రశ్నించాడు. దానికి సచిన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ హాల్లోనే ఉన్నారు.. వారు విరాట్‌, రోహిత్‌. భారతీయులు నా రికార్డును దాటేసినంత కాలం నేను ఏమీ అనుకోను’’ అని చెప్పాడు. మాస్టర్‌ అంచనా నిజమైంది. విరాట్‌, రోహిత్‌లు పలు రికార్డులు బద్దలు కొట్టారు. ముఖ్యంగా విరాట్‌ నిన్నటి మ్యాచ్‌లో సచిన్‌ పేరిట ఉన్న 49 శతకాల (వన్డేల్లో) కీలక రికార్డును సమం చేశాడు.

నాడు కన్నీరు పెట్టుకొన్న విరాట్‌..!  

మాస్టర్‌ బ్లాస్టర్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజు జరిగిన ఓ ఘటన వీరి బంధం ఎంత బలమైందో చెప్పేందుకు సరైన సాక్ష్యం. నాడు రిటైర్మెంట్‌ కార్యక్రమం తర్వాత సచిన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండగా.. కోహ్లీ అక్కడికి వచ్చాడు. చేతికి కట్టుకొనే ఓ దారాన్ని సచిన్‌కు ఇచ్చాడు. వాస్తవానికి ఆ దారాన్ని విరాట్‌కు అతడి తండ్రి బతికున్న రోజుల్లో ఇచ్చారు. దానిని ఎప్పుడూ విరాట్‌ తన బ్యాగ్‌తో పాటు తీసుకెళతాడు. కానీ, సచిన్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా దానిని బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో విరాట్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌కు ఆ దారం విలువ తెలుసు.. అందుకే దానిని కొద్దిసేపు తన వద్ద ఉంచుకొని మళ్లీ విరాట్‌కే ఇచ్చేశాడు. ఈ విషయాన్ని సచిన్‌, విరాట్‌లు వేర్వేరు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

మైదానాన్ని వీడినా కొనసాగిన బంధం..

2014 జులైలో ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత కోహ్లీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది. దీంతో అతడు ఒంటరిగా ఫీలవ్వడం మొదలుపెట్టాడు. అసలు బ్యాటింగే మర్చిపోయానా? అని తనను తానే సందేహించుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో సచిన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. బ్యాటింగ్‌లో సమస్యలకు పరిష్కారాలను చర్చించాడు. ఈ సందర్భంగా ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొనే సమయంలో బ్యాటింగ్‌లో చేసుకోవాల్సిన మార్పులను సచిన్‌ సూచించాడు. ఆ తర్వాత విరాట్‌ బ్యాటింగ్‌ వేగంగా గాడిలో పడింది. అక్కడి నుంచి కొన్నేళ్లపాటు విరాట్‌ బ్యాటింగ్‌ను చూసి ప్రపంచం నివ్వెరపోయింది. 2016లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలో మ్యాచ్‌ జరుగుతుంటే.. మైదానంలో స్క్రీన్‌పై సచిన్‌ను చూపించారు. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న కోహ్లీ తన క్రికెట్‌ దేవుడికి వేల మంది ప్రేక్షకుల ముందే అభివాదం చేశాడు. వన్డేల్లో విరాట్‌ 49 శతకాలు చేసినా.. ఇప్పటికీ సచిన్‌ను అదే స్థాయిలో ఆరాధిస్తాడు. ‘‘సచిన్‌తో నన్ను పోల్చడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం జనాలు ఏవేవో గణాంకాలు పట్టుకొస్తారు. వీటిని చూసి మీరు భిన్నంగా అర్థం చేసుకొంటారు. కానీ, మీ బాల్యం నుంచి ఒకరి ఆటను చూస్తూ ఎదగడం.. వారి ప్రభావం మీపై ఉండటం అనేది పూర్తిగా భిన్నమైంది. సచిన్‌, వివియన్‌ రిచర్డ్స్‌తో ఎవరినీ పోల్చలేం. వీరు తమ టైమ్‌లో క్రికెట్‌ను విప్లవాత్మకంగా మార్చేశారు’’ అని ఈ ఏడాది ఏప్రిల్‌లో విరాట్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని