ODI WC 2023: వాళ్లకు చెలగాటం.. వీళ్లకు ప్రాణసంకటం

హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన రెండు జట్లకు ఈసారి వరల్డ్ కప్‌లో (ODI World Cup 2023) షాక్‌లు తగిలాయి. దీంతో ప్రతి టీమ్ కూడా ప్రతి మ్యాచ్‌ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం విశేషం.

Updated : 20 Oct 2023 12:51 IST

(ఫొటో సోర్స్‌: ట్విటర్ (ఎక్స్‌)

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఆరంభ దశలోనే సెమీస్‌ రేసు రసవత్తరంగా మారింది. ప్రతి జట్టూ కనీసం మూడు మ్యాచ్‌లు ఆడగా.. సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నాలుగు జట్లు తప్పుకొన్నట్లే. వాటి మీద ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ జట్లతో మ్యాచ్‌లను ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. సెమీస్‌ మీద పెద్దగా ఆశల్లేని ఈ జట్లు టోర్నీపై తమదైన ముద్ర వేయడానికి, వీలైనన్ని విజయాలు సాధించడానికి చూస్తాయనడంలో సందేహం లేదు. కలిసొచ్చిన రోజు ఏ జట్టునైనా ఓడించే సామర్థ్యమున్న ఆ జట్ల నుంచి.. సెమీస్‌ బెర్తులు ఆశిస్తున్న జట్లకు ముప్పు తప్పేలా లేదు.

చిన్న జట్లు అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్‌ ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరగలవని ఎవరికీ అంచనాలు లేవు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మీదా అంచనాలు తక్కువే. వీటిలో అఫ్గానిస్థాన్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు ఓడిపోయింది. ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించినప్పటికీ.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో చిత్తవడంతో ఇక సెమీస్‌ గురించి ఆలోచించడం కష్టమే. ఇక దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్‌ కూడా ముందంజ వేయడం అసాధ్యమే. శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్‌ మీద ఆశలు వదులుకుంది. బంగ్లాదేశ్‌ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడింది. ఇవన్నీ సాంకేతికంగా సెమీస్‌ రేసులో ఉన్నట్లే కానీ.. పెద్ద జట్లను దాటి ముందుకు వెళ్లడం కష్టమే. ఈ విషయం ఆ జట్లకు కూడా తెలియంది కాదు. అయితే ఈ జట్లను సెమీస్‌ రేసులో ఉన్న పెద్ద జట్లు తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులు.

ఈ ఫలితాలే నిదర్శనం

ఈసారి ప్రపంచకప్‌లోకి హాట్‌ ఫేవరెట్‌గా అడుగు పెట్టింది డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌. కానీ అఫ్గానిస్థాన్‌ లాంటి చిన్న జట్టు చేతిలో షాక్‌ తింది. దీంతో ఒక్కసారిగా ఫేవరెట్‌ జాబితా నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఆ ఓటమి సెమీస్‌ అవకాశాలపై తీవ్రంగానే ప్రభావం చూపే ప్రమాదముంది. కచ్చితంగా ఖాతాలో చేరుతుందనుకున్న ఓ విజయం చేజారితే.. ఆ జట్టుపై ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పేదేముంది? ఇక శ్రీలంక, ఆస్ట్రేలియాలపై వరుసగా రెండు భారీ విజయాలతో ఒక్కసారిగా సెమీస్‌ రేసులో ముందంజ వేసిన దక్షిణాఫ్రికాకు.. తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గాలి తీసేసింది. డచ్‌ జట్టు ఈ టోర్నీలో అఫ్గాన్, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్ల మీద గెలిచినా గొప్పే అనుకున్నారు. కానీ ఏకంగా దక్షిణాఫ్రికానే ఓడించేసింది. సఫారీ జట్టు అవకాశాలను సైతం ఈ ఓటమి బాగానే దెబ్బ కొట్టేలా ఉంది.

ప్రస్తుతానికి సెమీస్‌ రేసులో న్యూజిలాండ్, భారత్‌లే ముందజలో ఉన్నాయి. మిగతా నాలుగు జట్లు కొంచెం ఇబ్బందికర స్థితిలోనే ఉన్నాయి. ఈ జట్లు ఇకపై జాగ్రత్తగా ఆడాలి. ప్రతి మ్యాచ్‌ వాటికి కీలకమే. ఓడే ప్రతి మ్యాచ్‌ సెమీస్‌ అవకాశాలను దెబ్బ తీస్తుంది. మరోవైపు సెమీస్‌పై ఆశల్లేని శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గాన్, నెదర్లాండ్స్‌ లాంటి జట్లు పోరాడితే పోయేదేముంది అన్నట్లు దూకుడుగా ఆడే అవకాశముంది. సాంకేతికంగా కూడా సెమీస్‌ రేసు నుంచి తప్పుకొన్నాయంటే.. వాటికి ప్రతి మ్యాచ్‌ చెలగాటమే. అదే సమయంలో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న జట్ల పరిస్థితి ప్రాణసంకటంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చిన్న జట్లతో మ్యాచ్‌లు కూడా ఆసక్తికరంగా మారతాయి. టోర్నీలో మరికొన్ని సంచలన ఫలితాలు వస్తే.. సెమీస్‌ రేసు మరింత రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని