Asian Games-Ram Baboo: కూలీ నుంచి ఆసియా క్రీడల పతకం దాకా!

అతడు ఒకప్పుడు కూలీ.. తర్వాత హోటల్లోనూ వెయిటర్‌గా, కొరియర్‌ కంపెనీలో వర్కర్‌గా పని చేశాడు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం గెలుస్తాడని ఎవరైనా అనుకుంటారా! కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌బాబు (Ram Baboo) దీన్ని నిజం చేశాడు.

Published : 05 Oct 2023 15:18 IST

అతడు ఒకప్పుడు కూలీ.. తర్వాత హోటల్లోనూ వెయిటర్‌గా, కొరియర్‌ కంపెనీలో వర్కర్‌గా పని చేశాడు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం గెలుస్తాడని ఎవరైనా అనుకుంటారా! కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌బాబు (Ram Baboo) దీన్ని నిజం చేశాడు. 35 కిలోమీటర్ల నడక మిక్స్‌డ్‌ ఈవెంట్లో మంజు రాణితో కలిసి అతడు కాంస్యాన్ని సాధించాడు. పట్టుదల ఉంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. సమస్యలు ఎదురైనా కలలుగన్న లక్ష్యానికి చేరొచ్చని నిరూపించాడు.

పల్లె నుంచి వచ్చి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా బౌవార్‌ పల్లెకు చెందిన రామ్‌బాబు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి బాల్యమంతా పొలం గట్ల మీదా సాగిపోయింది. అక్కడే పరుగులు తీసేవాడు. ఇదే అతడిని రాటుదేల్చింది. ఒక సహజసిద్ధమైన అథ్లెట్‌గా మార్చింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన రామ్‌బాబు మీద గట్టి ప్రభావమే చూపించింది. ఎలాగైనా తానూ మారథాన్‌ అథ్లెట్‌ కావాలని కలలు కన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించాలని భావించాడు. కానీ అతడి నేపథ్యం కలలకే పరిమితం చేసేలా కనిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నాడు. 

కూలీకెళ్లి.. వెయిటర్‌గా పని చేసి

తన కలను నెరవేర్చుకోవడం కోసం రామ్‌బాబు రకరకాల పనులు చేసేవాడు.. వచ్చిన డబ్బులలో కొన్ని దాచుకుని టోర్నీల్లో పాల్గొనేవాడు. కుటుంబం కోసం వారణాసిలో హోటల్‌లో వెయిటర్‌గా కూడా పని చేశాడు. అంతేకాదు ఒక కొరియర్‌ కంపెనీలో చేరి జ్యూట్‌ బ్యాగులను కుట్టే పనిలో కుదిరాడు. ఈ సమయంలోనే ఒలింపియన్‌ బసంత్‌ బహుదూర్‌ రాణా పరిచయడం కావడం రామ్‌బాబుకు అదృష్టంగా మారింది. మరో కోచ్‌ సుందర్‌రాజన్‌ డబ్బులు పోగేసి రామ్‌బాబుకు ఇచ్చేవాడు. కానీ కొవిడ్‌ రూపంలో అతడికి మరో ప్రతిబంధకం ఎదురైంది. దీంతో ప్రాక్టీస్‌ లేదు. టోర్నీలు లేవు. అతడి కల మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు నాన్నకు అనారోగ్యంగా ఉండడంతో రామ్‌బాబు కూలీకి కూడా వెళ్లాడు. రోజుకు రూ.300 సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. టోర్నీలకు వెళ్లిన సమయంలో డబ్బులు లేక ఫుట్‌పాత్‌ మీదే పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. పస్తులు కూడా ఉన్నాడు. కానీ కోచ్‌ సుందర్‌రాజన్‌ చేసిన ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చేవాడు. 

జాతీయ రికార్డు బద్దలుకొట్టి

ఇన్ని ఇబ్బందులు ఎదురైనా రామ్‌బాబు ఆగలేదు. ప్రాక్టీస్‌ ఆపలేదు. ఈ కష్టానికి అతడికి త్వరగానే ఫలితం వచ్చింది. గతేడాది జాతీయ క్రీడల్లో 35 కిలోమీటర్ల నడకలో 2 గంటల 36 నిమిషాల 34 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శనే అతడిని ఆసియా క్రీడలకు పంపించింది. అక్కడా అదరగొట్టిన ఈ అథ్లెట్‌ కాంస్యంతో మెరిసి సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది రామ్‌బాబుకు పెద్ద కల. వచ్చే ఏడాది పారిస్‌లోనే ఈ కలను సాకారం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని