KKR - IPL 2024: గంభీర్ - శ్రేయస్ మాత్రమే కాదు.. కేకేఆర్‌ సక్సెస్‌లో అతడిదీ కీలక పాత్రే!

ఏదైనా జట్టు గెలిస్తే కోచ్‌ లేదా కెప్టెన్‌పై ప్రశంసలు కురుస్తాయి. కేకేఆర్‌ విషయంలో మాత్రం ఎక్కువగా మెంటార్‌కే క్రెడిట్‌ దక్కింది. కానీ, జట్టు వెనకుండి నడిపించిన మరో వ్యక్తి కూడా ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. 

Updated : 28 May 2024 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఓ వైపు తన వయసు క్రికెటర్లు అంతర్జాతీయంగా అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంటే.. అతడు మాత్రం కోచ్ అవతారం ఎత్తాడు. కుర్రాళ్లకు తర్ఫీదు ఇవ్వడంలోనే అసలైన ఆనందం పొందుతున్నాడు. తాజాగా కోల్‌కతా మూడోసారి ఛాంపియన్‌గా నిలవడంలో ఆ జట్టు సహాయక కోచ్ అభిషేక్‌ నాయర్‌దీ కీలక పాత్రే.

ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసి కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచింది. పదేళ్ల తర్వాత కప్‌ను సగర్వంగా ఎత్తుకుంది. ఈ సక్సెస్ వెనుక మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ కీలక పాత్ర పోషించాడని సర్వత్రా ప్రశంసలు దక్కాయి. జట్టులో జోష్ తెచ్చి సరైన నిర్ణయాలు తీసుకున్నాడని అభినందించారు. ఇక కెప్టెన్ శ్రేయస్‌ మైదానంలో ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసి ఫలితం రాబట్టాడు. దేశవాళీలోనే అత్యుత్తమ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ జట్టుతోపాటు ఉండనే ఉన్నాడు. కానీ, వీరితో సమానంగా ఈ ప్రశంసలకు అర్హుడైన వ్యక్తి అభిషేక్ నాయర్. ఎంతో మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దిన నాయర్‌ కోల్‌కతాకు సహాయక కోచ్‌గా ఉన్నాడు. సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్, వెంకటేశ్‌ తదితరులు తమ విజయం వెనుక నాయర్ ఉన్నాడని చెప్పారంటే అతడి సత్తా ఏంటో అర్థమవుతుంది. 

కుర్రాళ్ల వెనుక..

కేకేఆర్ అకాడమీలో ప్రధాన కోచ్‌తోపాటు మెంటార్‌గా అభిషేక్ నాయర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. భారత స్టార్ క్రికెటర్లతోనూ సత్సంబంధాలు కలిగిన నాయర్‌ యువకుల్లోని సత్తాను బయటకు తేవడంలో సిద్ధహస్తుడు. అందుకు ఉదాహరణ వెంకటేశ్ అయ్యర్. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు కోల్‌కతా అయ్యర్‌ను రిటైన్ చేసుకోవడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతడు.. ప్లేఆఫ్స్‌లో సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. కొత్త కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీలోని టాలెంట్‌ను గుర్తించి ఛాన్స్‌ ఇప్పించాడు. కీలక సమయంలో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడి తండ్రి ‘‘మీరు ముందు ఒక మాట అన్నారు. రఘువంశీని తొలుత వ్యక్తిగా తీర్చిదిద్దుతా. ఆ తర్వాతే క్రికెటర్‌గా మారుస్తా. ఇదే సరైన ప్రణాళికగా కనిపిస్తోంది’’ అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. 

ఎవరీ అభిషేక్ నాయర్‌?

భారత జట్టు తరఫున అభిషేక్ కేవలం మూడు వన్డేలను మాత్రమే ఆడాడు. ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు. ఒక్క పరుగూ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. 60 ఐపీఎల్‌ మ్యాచుల్లోనూ పాల్గొన్నాడు. 672 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 5,749 పరుగులు, 173 వికెట్లు తీశాడు. లిస్ట్‌ Aలో 99 మ్యాచులు ఆడిన అతడు 2,145 రన్స్, 79 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. 40 ఏళ్ల హైదరాబాదీ అయిన నాయర్‌ అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పెద్దగా లేకపోయినా.. కోచింగ్‌ ఇవ్వడంలో మాత్రం దిట్టగా మారాడు. 2018 నుంచి కోల్‌కతా టీమ్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఆత్మవిశ్వాసం కల్పించడంలో.. 

కేవలం కోచింగ్‌పైనే కాకుండా ఆత్మవిశ్వాసం లోపించిన క్రికెటర్లలోనూ స్ఫూర్తి నింపే ‘మార్గదర్శకుడు’ నాయర్‌. ఐపీఎల్‌ నుంచి వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్‌ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో డీకేలో నమ్మకం కలిగించిన వారిలో అభిషేక్ నాయర్‌ కీలక పాత్ర పోషించాడని కార్తిక్‌ భార్య దీపికా పల్లికల్ తెలిపింది. అతడి మాటల్లోని ధైర్యం క్రికెటర్లను ముందుకు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు. వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రి రస్సెల్ గత సీజన్‌లో పెద్దగా రాణించలేదు. ఈసారి మాత్రం కేకేఆర్‌ తరఫున వరుణ్‌ అత్యధిక వికెట్లు తీయగలిగాడు. రస్సెల్‌ కూడా విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. ‘అతడి గురించి ఎలా వివరించాలో కూడా పదాలు రావడం లేదు. మమ్మల్ని లక్ష్యం దిశగా నడిపించడంలో చాలా శ్రమించాడు’’ అని నాయర్‌ గురించి రస్సెల్‌ చేసిన వ్యాఖ్యలు చాలు అతడి కోచింగ్‌ స్కిల్స్ ఏంటని చెప్పేందుకు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు