Hardik Pandya: అతడే వ్యత్యాసం.. స్టంప్స్‌ వెనుక మాస్టర్‌మైండ్‌: హార్దిక్‌ పాండ్య

హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్దామని భావించిన ముంబయికి ఓటమి ఎదురైంది. వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విజయం సాధించింది.

Updated : 15 Apr 2024 10:38 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదున్న ముంబయికి చుక్కెదురైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ సాధించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. చెన్నై యువ బౌలర్ పతిరన (Patirana) నాలుగు వికెట్లు తీసి ముంబయిని దెబ్బ కొట్టాడు. ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తేలిపోయాడు. కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. తమ ఓటమిపై పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఈ టార్గెట్‌ను ఛేదించగలిగిందే. చెన్నై అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. మాకు, వారికి పతిరన ప్రదర్శనే ప్రధాన వ్యత్యాసం. ప్రణాళికలకు తగ్గట్టు చెన్నై ఆడింది. అక్కడ స్టంప్స్‌ వెనుక మాస్టర్‌ మైండ్‌ ఉంది. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనీకి తెలుసు. మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ కఠినంగా మారింది. లక్ష్య ఛేదనలో మేం దూకుడుగానే వెళ్లాం. ఎప్పుడైతే పతిరన బౌలింగ్‌కు వచ్చి రెండు వికెట్లు తీశాడో.. అప్పుడు కాస్త వెనుకడుగు వేశాం. తొలుత చెన్నై బ్యాటింగ్‌ సమయంలోనూ బౌలింగ్‌లో మార్పులు చేయడానికి కారణముంది. శివమ్‌ దూబె స్పిన్‌ కంటే సీమ్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడతాడు. అతడు బ్యాటింగ్‌ చేసే సమయంలో పేసర్లతోనే బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఓటమి నుంచి బయటపడి మిగతా మ్యాచ్‌ల కోసం సన్నద్ధమవుతాం. తర్వాత నాలుగు మ్యాచ్‌లు కూడా ప్రత్యర్థుల సొంత మైదానాల్లో తలపడనున్నాం’’ అని హార్దిక్ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఐపీఎల్‌లో ముంబయి తరఫున రోహిత్‌కిది రెండో సెంచరీ. ఆ జట్టు తరఫున మూడో అత్యుత్తమ స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో రోహిత్ 105 పరుగులు చేశాడు. సనత్ జయసూర్య (2008లో) చెన్నైపైనే 114* పరుగులు చేశాడు.
  • ఈ మ్యాచ్‌లో రోహిత్ ఐదు సిక్స్‌లు బాదాడు. దీంతో టీ20ల్లో 500+ సిక్స్‌లు కొట్టిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. క్రిస్‌ గేల్ (1059) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
  • ఐపీఎల్‌లో సెంచరీ చేసినా జట్టు గెలవని మూడో సందర్భం ఇదే. అంతకుముందు పంజాబ్‌పై (2021లో) సంజూ శాంసన్‌ 119 పరుగులు, ముంబయిపై (2010లో) యూసఫ్‌ పఠాన్ 100* పరుగులు చేశారు.
  • ఐపీఎల్ 2021 సీజన్‌ నుంచి ముంబయితో జరిగిన ఆరు మ్యాచుల్లో చెన్నై ఐదింట్లో విజయం సాధించింది.  ఈ ఎడిషన్‌లో బయటి మైదానాల్లో చెన్నైకిదే తొలి గెలుపు.
  • ఐపీఎల్‌ 2024 సీజన్‌లో బుమ్రా డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. మొత్తం 8 ఓవర్లు వేసి 6 వికెట్లు పడగొట్టాడు. కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
  • మిడిల్‌ ఓవర్లలో (7 నుంచి 16) అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన మొదటి ఆటగాడిగా శివమ్‌ దూబె (166.08) నిలిచాడు. పరుగుల పరంగా రెండో స్థానంలో ఉన్నాడు. దూబె 191 పరుగులు చేయగా.. రియాన్ పరాగ్ (220) ముందున్నాడు.
  • సీఎస్‌కే తరఫున ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌ పతిరన. అతడు 21 ఏళ్ల 118 రోజుల వయసులో ముంబయిపై (4/28) అదరగొట్టాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని