IPL 2024: భారీ రేటు.. ఈసారి కథ మారింది

ఐపీఎల్ 17వ సీజన్‌లో అంచనాలను మించి రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆ టీమ్‌ల వెనక ఇద్దరు కీలక పాత్ర పోషించారు. ఈ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక రేటు పలికినవారు కావడం గమనార్హం.

Published : 29 May 2024 15:57 IST

రికార్డు ధరకు న్యాయం చేసిన కంగారూ స్టార్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ వేలంలో అత్యధిక ధరలు దక్కించుకునే ఆటగాళ్లు రేటుకు తగ్గ ప్రదర్శన చేసిన దాఖలాలు దాదాపుగా కనిపించవు. గత సీజన్లో రూ.18.5 కోట్లతో రికార్డు రేటు పలికిన సామ్ కరన్‌తో మొదలుపెడితే ప్రతి సీజన్లోనూ భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లలో దాదాపు అందరూ నిరాశపరిచినవాళ్లే. ఇలా రికార్డు రేటు పలికిన ఆటగాళ్ల మీద భారీ అంచనాలు ఏర్పడతాయి. దాని తాలూకు ఒత్తిడిలోనే ఆటగాళ్లు చిత్తయిపోతుంటారు. ఈ ఐపీఎల్ ఆరంభంలో ట్రెండ్ చూస్తే ఈసారి కూడా రికార్డు రేటు పలికిన ఆటగాళ్లు నిరాశపరిచేలాగే కనిపించారు. కానీ చివరికొచ్చేసరికి కథ మారింది. ఈ సీజన్లో అత్యధిక రేటు దక్కించుకున్న ఇద్దరు ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో తమ జట్టు విజయాల్లో కీలకంగా మారారు.

2024 ఐపీఎల్‌ ముంగిట జరిగిన వేలంలో ఏకంగా రూ.24.75 కోట్ల‌తో రికార్డు రేటు ప‌లికాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ మిచెల్ స్టార్క్. అత‌ణ్ని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుక్కుంది.  ఇక ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్‌ మీద సన్‌రైజర్స్ రూ.20.5 కోట్లు పెట్టింది. వీళ్లిద్దరి ఆట సీజన్ ఆరంభంలో అంతంతమాత్రంగానే కనిపించింది. స్టార్క్ అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. పైగా రెండు మ్యాచ్‌ల్లో క‌లిపి వంద ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తాడని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న స్టార్క్ ఇలా తేలిపోయేసరికి కోల్‌కతా జట్టు, అభిమానులు కంగారుపడ్డారు. 

కమిన్స్‌ ఇలా..

ఇక కమిన్స్ విషయానికి వస్తే.. ఈసారి అతడికి కెప్టెన్సీ కూడా అప్పగించింది సన్‌రైజర్స్. కానీ కమిన్స్ సైతం ఆరంభంలో అంచనాలను అందుకోలేకపోయాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లే తీశాడు. పైగా ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. రెండు మ్యాచ్‌లు ఓడి, ఒకటే గెలిచింది. దీంతో ఈసారి కూడా ‘‘రేటు ఎక్కువ, ఆట తక్కువ’ ట్రెండ్ కొనసాగుతుందనే అంతా భావించారు. కానీ తర్వాతే అసలు కథ మొదలైంది.

అసలైన సమరాల్లో అదరహో..

లీగ్ దశ ఆరంభంలో స్టార్క్ ప్రదర్శన చూసి అతన్ని తక్కువ అంచనా వేసినవారికి తన సత్తా ఏంటో తర్వాతే తెలిసింది. ఐపీఎల్ ఆడిన అనుభవం తక్కువ కావడం, చాలా విరామం రావడం వల్ల ఆరంభంలో కొంత ఇబ్బందిపడ్డాడు కానీ.. తర్వాత బలం పుంజుకున్నాడు. కీలక మ్యాచ్‌ల్లో అదిరే ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ప్లేఆఫ్ రేసు పోటాపోటీగా సాగుతున్నపుడు స్టార్క్ నిలకడగా రాణించాడు. ఇక ప్లేఆఫ్స్‌ దశ మొదలయ్యాక స్టార్క్ ఆట వేరే స్థాయికి చేరుకుంది. సన్‌రైజర్స్‌తో తొలి క్వాలిఫయర్లో మూడు వికెట్లతో చెలరేగాడు. ఫైనల్ ఆరంభంలోనే సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి ఓవర్లోనే ప్రమాదకర అభిషేక్ శర్మను బౌల్డ్ చేశాడు. తర్వాత ఫామ్‌లో ఉన్న త్రిపాఠిని ఔట్ చేశాడు. మొత్తంగా అతను 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి కోల్‌కతాకు పెద్ద బలంగా మారాడు. స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇంతే. కీలక మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన వేరే స్థాయిలో ఉంటుంది. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో, అలాగే గత ఏడాది వన్డే ప్రపంచకప్ తుది పోరులోనూ భారత్ మీద సత్తా చాటి జట్టు టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా తన రేటుకు అతను పూర్తి న్యాయం చేశాడనడంలో సందేహం లేదు.

జట్టు దృక్పథాన్నే మార్చేశాడు

కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అతను మామూలు ఆటగాడే. కానీ కెరీర్ ముందుకుసాగేకొద్దీ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. కెప్టెన్సీ అందుకున్నపుడు అతడి మీద పెద్దగా అంచనాలు లేవు. కానీ యాషెస్ సిరీస్‌లో జట్టును గెలిపించడమే కాక.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో, నిరుడు వన్డే ప్రపంచకప్ తుది పోరులో జట్టును గొప్పగా నడిపించి ట్రోఫీలు అందించాడు. కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్లు మారుస్తున్నా ఫలితం రాక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఈసారి కమిన్స్‌ను ట్రై చేసింది. అది జట్టు దృక్పథాన్ని, ఆటతీరును పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు జిడ్డు బ్యాటింగ్‌కు, డిఫెన్సివ్ అప్రోచ్‌కు పేరుపడ్డ సన్‌రైజర్స్ ఈ సీజన్లో దూకుడుకు మారుపేరుగా మారింది. 11 ఏళ్లుగా నిలిచి ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును ఈ సీజన్లో ఒకటికి రెండుసార్లు బద్దలు కొట్టిందంటే సన్‌రైజర్స్ దూకుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జట్టు ఆటతీరు ఇలా దూకుడుగా మారడంలో కెప్టెన్‌గా కమిన్స్ పాత్ర కీలకం. జట్టు సమష్టిగా సాగడంలో కమిన్స్ ముద్ర బలమైంది. ఇక వ్యక్తిగతంగానూ అతడి ప్రదర్శన నిలకడగా సాగింది. అతను 16 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాటుతోనూ రాణించాడు. ప్లేఆఫ్స్ దశలో జట్టు నిలకడ తప్పినా.. కమిన్స్ మాత్రం రాణించాడు. ఫైనల్లో 24 పరుగులతో అతనే టాప్ స్కోరర్‌. బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మొత్తంగా ఆటగాడిగా, కెప్టెన్‌గా కమిన్స్ గొప్ప ప్రదర్శన చేసి తనకు రూ.20 కోట్లకు పైగా రేటు పెట్టడం సబబే అని రుజువు చేశాడు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని