CSK: పారితోషికం తక్కువ.. పెర్ఫామెన్స్‌ ఎక్కువ.. ఆ చెన్నై ప్లేయర్స్‌ ఎవరంటే?

గుజరాత్ టైటాన్స్‌ (GT)ని ఓడించి చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లు తక్కువ ధరే పలికారు. కానీ, వారి ధరకు మించిన ఆటతీరును కనబర్చి ఔరా అనిపించుకున్నారు. మరి ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం. 

Published : 30 May 2023 17:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలోని నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK).. ఈ సారి ఏకంగా ఛాంపియన్‌గా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. సీఎస్కే సక్సెస్‌ క్రెడిట్‌ వెనుక కెప్టెన్‌ ధోనీ (MS Dhoni) పాత్ర కీలకం. అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లను ప్రోత్సహించి జాతిరత్నాల్లా తీర్చిదిద్దాడు. ఈ సీజన్‌లో చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో కొంతమంది తక్కువ పారితోషికం తీసుకున్నారు. కానీ, ఆ ఆటగాళ్లు తమ ధరకు మించిన ఆటతీరును కనబర్చి ఔరా అనిపించుకున్నారు. మరి ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం. 

డేవాన్‌ కాన్వే 

గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో చివరి రెండు బంతులకు జడేజా కొట్టిన 6,4 ఎంత విలువైనవో.. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్ డేవాన్‌ కాన్వే (Devon Conway) చేసిన 47 పరుగులు కూడా అంతే విలువైనవి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు రాబట్టి గట్టి పునాది వేశాడు. ఈ సీజన్‌లో కాన్వే 16 మ్యాచ్‌ల్లో 48.63 సగటుతో 672 పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలిచ్చి భారీ స్కోర్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది కాన్వే చేసిన ప్రదర్శనకు అతడు తీసుకున్న పారితోషికాన్ని చూస్తే చాలా తక్కువే తీసుకున్నాడని చెప్పాలి. ఈ సీజన్‌లో సీఎస్కే రూ.కోటికి కాన్వేతో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని బట్టి పారితోషికం తక్కువే తీసుకున్నా పెర్ఫామెన్స్‌ ఎక్కువే ఇచ్చాడని చెప్పొచ్చు. 

అజింక్య రహానె 

ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందే అజింక్య రహానె (Ajinkya Rahane) అనే క్రికెటర్ ఒకడున్నాడనే అభిమానులు మరిచిపోయారు. నిలకడలేమి ఆటతీరుతో టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయిన అతడు దేశవాళీ క్రికెట్‌లోనూ పెద్దగా రాణించలేదు. కానీ, ఈ  సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రహానె.. తన శైలికి భిన్నంగా దూకుడైన ఆటతీరుతో చెలరేగిపోయాడు. ముంబయిపై (61; 27 బంతుల్లో), రాజస్థాన్‌పై (31; 19 బంతుల్లో), బెంగళూరుపై (37; 20 బంతుల్లో), కోల్‌కతాపై (71; 29 బంతుల్లో) మేటి ఇన్నింగ్స్‌లు ఆడి సెలక్టర్ల దృష్టిలో పడి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన రహానె.. 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. అయితే, రహానెను సీఎస్కే రూ.50 లక్షలకే సొంతం చేసుకోవడం విశేషం. 

మతిశా పతిరన 

శ్రీలంకకు చెందిన యువ పేసర్ మతిశా పతిరన (Matheesha Pathirana) ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. లసిత్ మలింగ స్టైల్‌లో బౌలింగ్‌ చేయడం ఈ యువ బౌలర్ ప్రత్యేకత. అందుకే ఇతడిని క్రికెట్ అభిమానులు ‘జూనియర్‌ మలింగ’ అని పిలుస్తుంటారు. పతిరన బౌలింగ్‌ను గమనించిన కెప్టెన్ ధోనీ.. ఎక్కువగా డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయించి ఫలితం రాబట్టాడు. క్రీజులో మేటి ఆటగాళ్లున్నా పతిరన ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా కట్టుదిట్టంగా బంతులేసి అందరి మెప్పు పొందాడు. దూకుడుగా ఆడుతున్న ఆటగాళ్లను తన బౌలింగ్‌ నైపుణ్యంతో బోల్తా కొట్టించి జట్టుకు చాలా మ్యాచ్‌ల్లో విజయాలనందించాడు.  ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ పేసర్.. 7.96 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అతడు జట్టు నుంచి తక్కువ మొత్తమే అందుకున్నప్పటికీ అంతకమించిన ఆటతీరును కనబర్చాడు. పతిరనను సీఎస్కే రూ.20 లక్షలకే సొంతం చేసుకోవడం విశేషం. 

తుషార్‌ దేశ్‌పాండే 

తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande) ఈ సీజన్‌లో సీఎస్కే ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఆడాడు. మొదట్లో కాస్త ఎక్కువ పరుగులిచ్చినా అందుకు తగ్గట్లుగా వికెట్లు పడగొట్టాడు. తర్వాత బౌలింగ్‌లో మార్పులు చేసుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పవర్‌ ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లను గట్టి దెబ్బతీయడం దేశ్‌పాండే ప్రత్యేకత. ఈ ఏడాది 16 మ్యాచ్‌లు ఆడి 9.92 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున ఎక్కువ వికెట్లు తీసింది ఇతడే.  రానున్న సీజన్లలోనూ దేశ్‌పాండే ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భారత జట్టు నుంచి పిలుపు రావొచ్చు. ఇంతకీ ఈ సీజన్‌లో తుషార్‌ దేశ్‌పాండేను సీఎస్కే ఎంతకు దక్కించుకుందో తెలుసా రూ.20 లక్షలకే. అంటే అతడు తాను తీసుకున్న మొత్తానికి కంటే బెటర్ పెర్ఫామెన్స్‌ చేశాడన్నమాట.

మహీశ్ తీక్షణ 

చెన్నై సూపర్‌ కింగ్స్‌లో రవీంద్ర జడేజా తర్వాత ప్రధాన స్పిన్నర్‌ మరెవరైనా ఉన్నారంటే అది మహీశ్ తీక్షణ (Maheesh Theekshana)నే. ఈ 22 ఏళ్ల స్పిన్నర్‌కు గతేడాది కూడా సీఎస్కే ఆడిన అనుభవం ఉంది. ఈ సీజన్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 8.00 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కీలక సమయంలో హార్దిక్ పాండ్య, విజయ్‌ శంకర్‌లను పెవిలియన్‌కు పంపాడు. అతడు ఈ సీజన్‌లో  తీసుకున్న పారితోషికం కంటే చాలా రెట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చాడని చెప్పాలి. తీక్షణకు ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.70 లక్షలు చెల్లించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని