T20 World Cup 2024: ఈ ప్లేయర్లు యమ డేంజర్‌ బాసూ..!

మొన్నటివరకు వారిని అభినందిస్తూ ఆనందించాం. ఇక ఇప్పటినుంచి వారు రాణించకపోతే బాగుండు అని అనుకుంటాం. ఇలాంటి విచిత్ర పరిస్థితిని టీ20 ప్రపంచ కప్‌ తీసుకొచ్చింది.

Updated : 31 May 2024 18:09 IST

ఆ ప్లేయర్ల ఆటను చూసి చప్పట్లు కొట్టాం. మనల్నే గెలిపించడానికి వచ్చారని సంబరపడ్డాం. వికెట్ తీస్తే జేజేలు.. బౌండరీలు బాదితే శభాష్‌ అంటూ పొగడ్తలు. ఇప్పుడు అదే ప్లేయర్‌లను చూస్తే వణుకు. దానికి కారణం టీ20 ప్రపంచకప్‌. ఇప్పటివరకు అన్ని దేశాల క్రికెటర్లు  ఆడిన ‘ఐపీఎల్’ మజాలో ఉన్న క్రికెట్ అభిమానుల కోసం.. పొట్టి కప్‌ సందడి వచ్చేసింది. మరి ఎవరు ‘ప్రమాదకారి’..? ప్రత్యర్థులను భయపెట్టే ఆ ప్లేయర్లెవరో చూద్దాం.. 

విండీస్ బ్యాచ్..

అసలే సొంత మైదానం. ఐపీఎల్ పుణ్యమా అని హార్డ్‌ హిట్టర్లంతా ఫామ్‌లోకి వచ్చేశారు. ఈ సీజన్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆండ్రీ రస్సెల్‌తోపాటు లఖ్‌నవూకు ఆటగాడు నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్‌, షై హోప్, రోవ్‌మన్‌ పావెల్, షిమ్రోన్ హెట్‌మయెర్ గత సీజన్‌లో పెద్దగా రాణించలేదు. ఈసారి మాత్రం ప్రతిఒక్కరూ వీరబాదుడు బాదేశారు. వారి దేశంలో టీ20 ప్రపంచకప్‌ జరగనుండటంతో విండీస్‌ను ఆపడం చాలా కష్టమని క్రికెట్ వర్గాల అభిప్రాయం. పిచ్‌ పరిస్థితులు వారికి కొట్టిన పిండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. 

ఆసీస్‌ను చూస్తుంటే.. 

ఐపీఎల్ భారత క్రికెటర్లకు ఎంతమేర ఉపయోగపడిందో కానీ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రం అద్భుతమైన ఫేమ్‌ను తీసుకొచ్చింది. కోల్‌కతా, హైదరాబాద్‌ను ఫైనల్‌కు తీసుకురావడంలో ఇద్దరు ఆసీస్‌ స్టార్లే కీలక పాత్ర పోషించారు. వారిలో తొలి క్వాలిఫయర్‌లో, ఫైనల్‌లో వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్‌ కాగా.. హైదరాబాద్‌ తరఫున కెప్టెన్‌గా వ్యవరించిన పాట్ కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వన్డే ప్రపంచ కప్‌లో శతకంతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్‌ మొదట్లో స్టార్క్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు. అంత డబ్బు (రూ. 24.75 కోట్లు) వేస్ట్ చేశారని కామెంట్లు చేశారు. కానీ, నాకౌట్‌ స్టేజ్‌లో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. ఇక టిమ్‌ డేవిడ్, డేవిడ్ వార్నర్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టాయినిస్ ప్రతిభ చూపారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ పెద్దగా ఆడలేకపోయినా.. జాతీయజట్టు తరఫున ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలనని గత వన్డే ప్రపంచ కప్‌లో ద్విశతకంతో నిరూపించాడు. జేక్‌ ఫ్రేజర్‌ కూడా పొట్టి కప్‌ జట్టులో ఉండుంటే ఆసీస్‌ను అడ్డుకోవడం చాలా కష్టమయ్యేదనే కామెంట్లు వచ్చాయంటే.. అతడి దూకుడు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇంగ్లాండ్‌కు తక్కువేం కాదు.. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌కు ఐపీఎల్‌ అనుభవం తప్పకుండా అక్కరకొస్తుంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో బట్లర్ కీలక పాత్ర. బెంగళూరు తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన విల్‌ జాక్స్‌, పంజాబ్‌ను నడిపించిన సామ్‌ కరన్‌.. ఆ జట్టులో ఓపెనర్‌గా దూకుడుగా ఆడిన జానీ బెయిర్‌స్టో ఉండనే ఉన్నాడు. ఇక ఫిల్‌ సాల్ట్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. కోల్‌కతా అగ్రస్థానంతో ఛాంపియన్‌గా నిలవడంలో సునీల్‌ నరైన్‌తో కలిసి సాల్ట్‌ ఇచ్చిన శుభారంభాలే కారణం. మొయిన్ అలీ, లివింగ్‌ స్టోన్ ఈసారి పెద్దగా రాణించలేదు.

దక్షిణాఫ్రికా ‘క్లాస్‌’ టచ్..

దక్షిణాఫ్రికా జట్టు పేపర్‌ మీద చాలా బలంగా ఉంటుంది. ఇప్పటివరకు మెగా టోర్నీల్లో ఒత్తిడికి గురికావడం సర్వసాధారణమైంది. ఈసారి మాత్రం తీవ్ర పోటీనివ్వడం ఖాయం. ఆ జట్టులో హెన్రిచ్‌ క్లాసెన్ ఉన్నాడు. హైదరాబాద్‌ జట్టు తరఫున భారీ ఇన్నింగ్స్‌లను చూశాం. క్వింటన్ డికాక్‌, డేవిడ్ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్ కూడా దూకుడుగా ఆడారు. బౌలర్ల విషయంలో కగిసో రబాడ, గెరాల్డ్ కొయిట్జీ, ఆన్రిచ్ నోకియాకి కావాల్సినంత టీ20 అనుభవం దక్కింది.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని