Pat Cummins: మూడో ఆసీస్‌ ప్లేయర్‌గా కమిన్స్.. షాబాజ్‌ ‘ఇంపాక్ట్‌’ నిర్ణయం వెటోరిదే!

భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న పాట్ కమిన్స్‌ సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కప్‌ను కూడా అందివ్వాలని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

Published : 25 May 2024 10:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టును (డెక్కన్‌ ఛార్జర్స్‌ను కలిపి) విదేశీ కెప్టెన్లే నాలుగు సార్లు ఫైనల్‌కు చేర్చారు. అందులో ముగ్గురు ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం. 2009లో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, 2016లో డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. తాజాగా ఆసీస్ ప్లేయర్ పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ ఫైనల్‌లో కోల్‌కతాతో తలపడనుంది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ విజేతగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ. 20 కోట్లను వెచ్చించి మరీ కమిన్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఫలితంతో ఆ మొత్తానికి న్యాయం జరిగిందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని పాట్ కమిన్స్ వెల్లడించాడు. 

‘‘ఈ సీజన్‌లో మా కుర్రాళ్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. జట్టులోని ప్రతి ఆటగాడిని చూస్తే మీకే అర్థమవుతుంది. ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. ఇప్పుడు మేం దానిని అందుకొన్నాం. మా బ్యాటింగ్‌ అత్యంత బలమైంది. అలాగని బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేయలేదు. భువనేశ్వర్, నటరాజన్, జయ్‌దేవ్ ఉనద్కత్‌తో కూడిన అనుభవమైన పేస్‌ ఎటాక్‌ ఉంది. వారంతా నా పనిని చాలా సులువు చేసేశారు. ఈ మ్యాచ్‌లో షాబాజ్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవాలనేది మా బౌలింగ్ కోచ్ డానియల్‌ వెటోరిదే. ఎడమచేతివాటం స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారని అంచనా వేశాడు. అభిషేక్‌ను బౌలింగ్‌కు దించడం కూడా సర్‌ప్రైజ్‌ డెసిషన్. రైట్‌ హ్యాండర్లను కట్టడి చేసేందుకు శర్మను ప్రయోగించాం. అది సక్సెస్ అయింది. వీరిద్దరే వల్లే మిడిల్‌ ఓవర్లలో  తక్కువ పరుగులు ఇవ్వగలిగాం. ఈ పిచ్‌పై 170 పరుగులను ఛేదించడం కష్టమని భావించా. నేనెప్పుడూ పిచ్‌ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయత్నించను. ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. మ్యాచ్‌ సమయానికి ఎలా స్పందిస్తుందనేదే ముఖ్యం. ఫైనల్‌లోనూ మేం మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉంది’’ అని కమిన్స్ వెల్లడించాడు. 

హెట్‌మయెర్‌కు జరిమానా

రాజస్థాన్‌ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయెర్‌కు జరిమానా పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు కమిటీ నిర్థరించింది. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో (14వ ఓవర్‌) హెట్‌మయెర్ బౌల్డయ్యాడు. తీవ్ర అసహనంతో స్టంప్స్‌ను తన్నేందుకు ప్రయత్నించాడు. దీనిని నేరంగా పరిగణించిన ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ అతడికి 10 శాతం మ్యాచ్‌ ఫీజ్‌లో జరిమానా విధించింది. ఆర్టికల్ 2.2 లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని