Tilak Varma: తిలక్‌ కథ.. ముగియలేదు.. ప్రపంచకప్‌ రేసులోనే హైదరాబాద్‌ స్టార్‌

వన్డే ప్రపంచ కప్‌ (ODI WOrld Cup 2023) స్క్వాడ్‌లో మార్పులు చేసుకోవడానికి ఇంకా వారం సమయం ఉంది. ఆలోగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. దీంతో తొలుత స్క్వాడ్‌లోకి లేని తిలక్‌ వర్మకు చక్కటి అవకాశం దొరికినట్లేనని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

Updated : 20 Sep 2023 14:05 IST

వన్డే ప్రపంచకప్‌నకు (ODI World Cup 2023) భారత జట్టును పది రోజుల కిందటే ప్రకటించారు సెలక్టర్లు. వెస్టిండీస్‌ పర్యటనలో అరంగేట్రం చేసి.. తొలి సిరీస్‌లోనే అదరగొట్టిన తిలక్‌ వర్మకు కూడా ప్రపంచకప్‌లో అవకాశం కల్పించాలనే డిమాండ్లు గట్టిగా వినిపించగా.. సెలక్టర్లు అతడికి మొండిచెయ్యే చూపించారు. అంతటితో తిలక్‌ ప్రపంచకప్‌ ఆశలకు తెరపడిపోయాయి అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అతను మళ్లీ రేసులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు జట్టులో చోటు సంపాదించిన అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని.. అదృష్టం కూడా కలిసొస్తే ప్రపంచకప్‌లో చూడొచ్చు.

వరుసగా రెండు ఐపీఎల్‌ సీజన్లలో ముంబయి ఇండియన్స్‌ తరఫున అదరగొట్టి రెండు నెలల కిందట వెస్టిండీస్‌ పర్యటనకు తొలిసారి భారత జట్టులో చోటు సంపాదించాడు హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ. ఆ జట్టుతో అయిదు టీ20ల సిరీస్‌లో అవకాశం దక్కించుకుని.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. 5 మ్యాచ్‌ల్లో 50కి పైగా సగటుతో 173 పరుగులు సాధించి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటికే శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో తిలక్‌ను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఎడమచేతి వాటం బ్యాటర్‌ కావడం, పార్ట్‌టైం స్పిన్నర్‌ కూడా కావడం.. మిడిలార్డర్‌కు చక్కగా సరిపోయే ఆటగాడవడం.. ఒత్తిడిలో తొణకకుండా నిలకడగా ఆడే నైపుణ్యం ఉండటం తిలక్‌కు సానుకూల అంశాలుగా కనిపించాయి.

వన్డే ప్రపంచకప్‌ అధికారిక సాంగ్‌ వచ్చేసింది.. చూశారా?

అయితే ఈలోపు శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సాధించడంతో తిలక్‌కు అవకాశం కల్పించలేని పరిస్థితి తలెత్తింది. కొన్నేళ్లుగా నాలుగో స్థానంలో ఆడుతున్న శ్రేయస్‌కే సెలక్టర్లు ఓటు వేశారు. ఆసియా కప్‌కు శ్రేయస్‌తో పాటు తిలక్‌నూ ఎంపిక చేసినప్పటికీ.. ప్రపంచకప్‌ జట్టులో మాత్రం శ్రేయస్‌కే చోటిచ్చారు. ఆసియా కప్‌లో తిలక్‌కు ముందు తుది జట్టులో చోటు కూడా ఇవ్వలేదు. శ్రేయస్‌నే ఆడించారు. కానీ శ్రేయస్‌ రెండు మ్యాచ్‌లు ఆడగానే గాయం తిరగబెట్టింది. టోర్నీలో తర్వాత అతను ఆడనే లేదు. దీంతో మళ్లీ తిలక్‌ వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. బంగ్లాదేశ్‌తో నామమాత్రమైన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో తిలక్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కానీ ఆ మ్యాచ్‌లో అతను 5 పరుగులకే వెనుదిరిగాడు. అయినప్పటికీ తిలక్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌కు పక్కన పెట్టలేదు సెలక్టర్లు. శ్రేయస్‌తో పాటు అతణ్నీ ఎంపిక చేశారు.

తుది జట్టులో చోటు దక్కితే..

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తిలక్‌ వర్మకు తుది జట్టులో చోటిచ్చారంటే అతణ్ని ప్రపంచకప్‌లో ఆడించడంపై జట్టు సీరియస్‌గా ఉందని భావించవచ్చు. ప్రపంచకప్‌కు ఇంకో రెండు వారాలే సమయం ఉండగా.. ఫిట్‌నెస్‌పై సందేహాలుండటంతో పాటు ఫామ్‌ కూడా చాటుకోని శ్రేయస్‌ మీద నమ్మకం పెట్టడం సమంజసమేనా అన్న చర్చ ఇప్పటికే నడుస్తోంది. ఆసియా కప్‌ అనుభవం చూశాక శ్రేయస్‌ను ప్రపంచకప్‌లో ఆడిస్తే తర్వాత అయినా గాయం తిరగబెట్టదన్న గ్యారెంటీ లేదు. కాబట్టి అతణ్ని ఎంపిక చేస్తే చాలా రిస్క్‌ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రేయస్‌తో పాటు తిలక్‌నూ ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడించినా.. తిలక్‌ మెరుగైన ప్రదర్శన చేస్తే అతడి వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచకప్‌ జరిగేది సొంతగడ్డపై. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం. తిలక్‌ ఉపయుక్తమైన పార్ట్‌టైం స్పిన్నర్‌ కూడా కావడం కలిసొచ్చే అంశం. కాబట్టి తుది జట్టులో అవకాశం దక్కితే.. తిలక్‌ ఉత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నించాలి. మరోవైపు అక్షర్‌ పటేల్‌ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు కూడా ఉన్నట్లుండి భారత జట్టులో తలుపులు తెరుచుకున్నాయి. 18 నెలలుగా వన్డే మ్యాచ్‌ ఆడని అతను.. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు. అక్షర్‌ ఫిట్‌నెస్‌ సాధించని పక్షంలో అశ్విన్‌ కూడా అనుకోకుండా ప్రపంచకప్‌లో ఆడితే ఆశ్చర్యం లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు