SL vs BAN: అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి.. టైమ్‌డ్‌ ఔట్‌ అయిన శ్రీలంక బ్యాటర్‌

ODI World cup 2023: అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ఓ క్రికెటర్‌ టైమ్‌డ్‌ ఔట్‌ ( timed out)గా పెవిలియన్‌ చేరాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏంటీ టైమ్‌డ్‌ ఔట్‌..?

Updated : 06 Nov 2023 17:19 IST

(Photo: ICC Twitter)

దిల్లీ: వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI World cup 2023)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏంజెలో మాథ్యూస్‌ (Angelo Mathews) ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ‘టైమ్‌డ్‌ ఔట్‌ (timed out)’గా వెనుదిరగాల్సి వచ్చింది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ (SL vs BAN)లో.. మాథ్యూస్‌ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆటగాడు ఇలా  ‘టైమ్‌డ్‌ ఔట్‌’ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

25వ ఓవర్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వేసిన రెండో బంతికి లంక ఆటగాడు సమరవిక్రమ ఔట్‌ అయ్యాడు. దీంతో నంబర్‌ 6లో మాథ్యూస్‌ బ్యాటింగ్‌కు దిగేందుకు బయల్దేరాడు. మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో అతడి హెల్మెట్‌ స్ట్రాప్‌ విరిగిపోయింది. దీంతో అతడు కొత్త హెల్మెట్‌ కోసం డ్రెస్సింగ్‌ రూం వైపు సిగ్నల్‌ ఇచ్చాడు. అలా అతడు క్రీజులోకి రావడం ఆలస్యమైంది.

ఈ క్రమంలోనే బంగ్లా జట్టు ‘టైమ్‌డ్‌ ఔట్‌’ కోసం అప్పీల్‌ చేసింది. ఆ అప్పీల్‌ను పరిశీలించిన అంపైర్‌.. మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. హెల్మెట్‌ బాగా లేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్‌ వాదించినప్పటికీ.. అంపైర్లు ఔట్‌ ఇచ్చేశారు. దీంతో క్రీజులోకి రాకముందే అతడు ఔటై పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.

భారత్‌ చేతిలో ఘోర ఓటమి.. క్రికెట్ బోర్డును రద్దు చేసిన శ్రీలంక క్రీడాశాఖ

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి..

ఇలా ఓ క్రికెటర్‌ ‘టైమ్‌డ్‌ ఔట్‌’తో వెనుదిరగడం ప్రపంచకప్‌లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లోనే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఆరుగురు ఆటగాళ్లు ఇలా టైమ్‌డ్‌ ఔట్‌ అయ్యారు. అందులో భారత్‌కు చెందిన హేములాల్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు.

ఏంటీ టైమ్‌డ్‌ ఔట్‌ రూల్‌..

ఐసీసీ నిబంధనల ప్రకారం.. క్రీజులో ఉన్న బ్యాటర్‌ ఔట్‌ అయితే.. తర్వాతి బ్యాటర్‌ నిర్ణీత సమయంలోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ సమయం 3 నిమిషాలుగా ఉండగా.. 2023 వన్డే ప్రపంచకప్‌ నిబంధనల్లో ఆ గడువు 120 సెకన్లుగా మార్చారు. అంటే, 2 నిమిషాల్లో తర్వాతి బ్యాటర్‌ క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ, ఆ గడువు లోగా బ్యాటర్‌ రాకపోతే.. దాన్ని టైమ్‌డ్‌ ఔట్‌గా పేర్కొంటూ.. ఆ క్రికెటర్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని