Cricket News: ఈసారైనా.. టైటిల్ కల నెరవేరేనా?

ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. తొలి ఎడిషన్‌ నుంచి ఆడుతున్న మూడు జట్లు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్‌ను ముద్దాడలేకపోయాయి. 

Published : 23 Mar 2024 13:26 IST

రెండేళ్ల కిందట ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ గెలిచింది గుజరాత్. ఆ జట్టులో బడా బడా స్టార్లేమీ లేరు. అయినా సమష్టిగా ఆడి విజేతగా నిలిచింది. కానీ ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతూ.. 16 సీజన్లుగా పోరాటం సాగిస్తూనే ఉన్నా.. మూడు జట్లకు టైటిల్ కలగానే ఉంది. అప్పుడప్పుడూ చక్కటి ప్రదర్శన చేసి కప్పుపై ఆశలు రేకెత్తించడమే కానీ.. ఆ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాయి ఆ మూడు జట్లు. అవే.. బెంగళూరు, దిల్లీ , పంజాబ్. మరి ఈసారైనా ఈ మూడు జట్లలో ఒకటి కప్పు నెగ్గుతుందా? వాటి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఓసారి చూద్దాం పదండి.

ఆర్సీబీ.. అదో వ్యథ

ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో బెంగళూరు ఒకటి. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ సాధించిన కోల్‌కతా, ఒక్కోసారి కప్పు నెగ్గిన రాజస్థాన్, హైదరాబాద్‌ కంటే ఈ జట్టుకు ఆకర్షణ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లయిన చెన్నై, ముంబయి జట్లకు ఏమాత్రం తీసిపోని ఆకర్షణ ఆ జట్టు సొంతం. ఇక బెంగళూరు ఎప్పుడూ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుంటుంది. కాగితం మీద ఆ జట్టు ఎంతో బలంగా కనిపిస్తుంది. ప్రతిసారీ ఫేవరెట్లలో ఒకటిలా కనిపిస్తుంది. ఐతే ఎంత ప్రయత్నించినా ఇప్పటిదాకా టైటిల్‌ను గెలవలేకపోయింది. 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఆ జట్టు టైటిల్‌కు అత్యంత చేరువగా వెళ్లింది. కానీ ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కెప్టెన్‌గా చాలా సీజన్లు జట్టును ముందుండి నడిపించాడు. కానీ కప్పును అందుకోలేకపోయాడు. గత రెండు సీజన్ల నుంచి అతను ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

డుప్లెసిస్ నేతృత్వంలో కూడా గత రెండు సీజన్లలో టైటిల్ సాధించలేకపోయింది ఆర్సీబీ. ఐతే ఈసారి కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్ లాంటి మేటి ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకుని బలం పెంచుకుంది. ఇక కోహ్లికి తోడు డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఉండనే ఉన్నారు. ఇంకా లాకీ ఫెర్గూసన్, అల్జారి జోసెఫ్‌, సిరాజ్, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మలతో బౌలింగ్ కూడా మెరుగ్గానే ఉంది. మొత్తంగా ఛాంపియన్ జట్టుకు ఉండాల్సిన బలం ఆ జట్టులో కనిపిస్తోంది. కావాల్సిందల్లా మైదానంలో ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు, సమష్టిగా ఆడడమే. ఈ ఏడాది మహిళల ఆర్సీబీ జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో ఆ ఉత్సాహంలో కప్పు గెలుస్తామని విరాట్ కోహ్లి చెప్పాడు. అయితే, తొలి మ్యాచ్‌లోనే చెన్నై చేతిలో ఓటమిపాలైంది. మరి మిగతా మ్యాచుల్లో విజయం సాధించి కోహ్లీ మాటను నిజం చేస్తారో లేదో చూడాలి.

దిల్లీ.. ఛాన్సుంది కానీ

ఐపీఎల్ ఆరంభం నుంచి దిల్లీ ప్రదర్శన పర్వాలేదనే చెప్పాలి. 16 సీజన్లలో ఆరుసార్లు సెమీస్/ప్లేఆఫ్స్ చేరింది. 2020లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. కానీ కప్పు గెలవలేకపోయింది. మొదట దిల్లీ డేర్ డెవిల్స్‌గా ఉన్న ఆ జట్టు 2018లో దిల్లీ క్యాపిటల్స్‌గా మారింది. అప్పుడే జట్టు స్వరూపం కూడా చాలా వరకు మారింది. 2020లో శ్రేయస్ అయ్యర్ జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. కానీ కప్పు అందించలేకపోయాడు. తర్వాతి సీజన్‌కు అతను పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పంత్ కెప్టెన్ అయ్యాడు.  అతడి సారథ్యంలో ప్లేఆఫ్స్ చేరుకుంది కానీ.. అంతకుమించి ముందంజ వేయలేకపోయింది. 2022లో లీగ్ దశ దాటలేదు. నిరుడు రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ ఐపీఎల్ ఆడలేదు. వార్నర్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ ఏడాది పంత్ పునరాగమనం చేస్తున్నాడు. అతడితో పాటు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్‌లతో దిల్లీ బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పేసర్ జే రిచర్డ్‌సన్‌కు తోడు అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌లతో బౌలింగ్ పర్వాలేదనిపిస్తోంది. దిల్లీ జట్టును తీసిపడేయలేం. అలా అని మరీ గొప్పగానూ కనిపించడం లేదు. సమష్టిగా ఆడడం ఆ జట్టు బలం. అలాగే ఆడి అన్నీ కలిసి వస్తే ఛాంపియన్ కాగలదు. చూద్దాం ఏమవుతుందో?

పంజాబ్‌.. అద్భుతం జరగాలి

ఐపీఎల్‌లో ఆట పరంగా, ఆకర్షణ పరంగా దిగువన ఉండే జట్టు పంజాబ్. ఒకప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌గా ఉన్న ఆ జట్టు.. దిల్లీ తరహాలోనే పేరు మార్చుకుంది. కానీ అదేమీ పెద్దగా కలిసి రాలేదు. ఇన్నేళ్లలో పంజాబ్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. 2014లో జార్జ్ బెయిలీ ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆ సీజన్లలో మెరుపులు మెరిపించి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఫైనల్లో నిరాశ తప్పలేదు. ఆ తర్వాత తొమ్మిది సీజన్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేదు పంజాబ్. ఈ తొమ్మిదేళ్లలో చాలామంది కెప్టెన్లు మారారు. జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. అలాగే పేరూ మారింది. కానీ ఫలితం మాత్రం మారలేదు. ప్రస్తుతం ఆ జట్టు శిఖర్ ధావన్ నేతృత్వంలో ఆడుతోంది. ఆ జట్టు ప్రధానంగా విదేశీ ఆల్‌రౌండర్లను నమ్ముకుంది. కొన్నేళ్లుగా పంజాబ్‌కు ఆడుతున్న లివింగ్‌స్టన్‌కు తోడు సామ్ కరన్, సికందర్ రజా, క్రిస్ వోక్స్ ఆ జట్టు ఆల్‌రౌండ్ బలాన్ని పెంచుతున్నారు. వీరికి తోడు రబాడ, అర్ష్‌దీప్, ఎలిస్‌లతో పేస్ బౌలింగ్ కూడా బాగుంది. కానీ చాలా ఏళ్ల నుంచి పంజాబ్ సమస్య ఏంటంటే.. జట్టుతత్వం కొరవడడం, సమష్టిగా రాణించలేకపోవడం. పదే పదే కెప్టెన్లను మార్చడం కూడా ఆ జట్టుకు సమస్యగా మారింది. ప్రస్తుత కెప్టెన్ ధావన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. మరి అతడి సారథ్యంలో పంజాబ్ పుంజుకుని.. మిగతా జట్ల పోటీని తట్టుకుని కప్పు గెలవాలంటే అద్భుతమే జరగాలి. కానీ ఎప్పుడూ ఎవరి అవకాశాలనూ కొట్టిపారేయలేం కాబట్టి పంజాబ్ అద్భుతమే చేసి కప్పు గెలుస్తుందేమో చూడాలి.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని