IPL 2024: హార్దిక్‌ పాండ్య ఇక్కడా కెప్టెన్సీ నిరూపించుకోవాల్సిందే..: టామ్ మూడీ

ముంబయి సారథిగా రోహిత్ శర్మ నైపుణ్యాలను ప్రదర్శించి జట్టును గెలిపించాల్సిన అవసరం ఉందని.. ఆరంభంలోనే ఓటములు ఎదురైనా విమర్శలు ఎదుర్కోక తప్పదని ఆసీస్‌ మాజీ దిగ్గజం హెచ్చరించాడు.

Updated : 20 Mar 2024 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా నియమితుడైనప్పటి నుంచి హార్దిక్‌ పాండ్యకు (Hardik Pandya) నెట్టింట విమర్శలు తప్పడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌తో తనకేమీ ఇబ్బందులు ఉండవని.. తన భుజంపై చేయి వేసి అతడే నడిపిస్తాడని పాండ్య వ్యాఖ్యానించాడు.  ఇప్పుడంతా బాగానే ఉన్నప్పటికీ ఓ రెండు పరాజయాలు ఎదురైతే పరిస్థితి విభిన్నంగా ఉంటుందని ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం టామ్‌ మూడీ హెచ్చరించాడు. గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్‌  ముంబయి సారథిగానూ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మూడీ స్పష్టం చేశాడు. 

‘‘హార్దిక్‌కు జట్టు నుంచి, సిబ్బంది నుంచి మద్దతు అందించాలి. గత సీజన్‌లో నిలకడ లేని ప్రదర్శనతో జట్టు ఇబ్బంది పడింది. ఇప్పుడు దాని నుంచి జట్టును బయటపడేయాలి. అతడికి భారత క్రికెటర్లతోపాటు ఓవర్సీస్‌ ప్లేయర్లూ సపోర్ట్‌గా నిలవాలి. ఆల్‌రౌండర్‌గా టాప్‌ క్రికెటర్. ఇప్పుడు ఎవరూ అతడిని ఇబ్బంది పెట్టలేరు. కానీ, పరాజయాలు ఎదురైనప్పుడు మాత్రం కెప్టెన్సీ క్లిష్టంగా మారే అవకాశం ఉంది. నీ నాయకత్వంలోని లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నాలు జరుగుతాయి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా లోపాలను వెతుకుతారు. అత్యుత్తమ నిర్ణయాలు తీసుకుని జట్టును గెలిపిస్తున్నప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. గతంలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ జట్టులోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలిచారు’’ అని మూడీ వెల్లడించాడు.


హార్దిక్‌ను ఇబ్బంది పెట్టే అంశమదే: సునీల్ గావస్కర్

ముంబయి జట్టు సారథిగా హార్దిక్‌ పాండ్యకు కొన్ని సమస్యలు తప్పవని, వాటిని ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరంగా ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. ‘‘ముంబయి జట్టులో డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ అత్యంత కీలకం. ఒకవైపు బుమ్రా వంటి పేసర్ ఉన్నాడు. కానీ, మరో ఎండ్‌లో పరుగులు ధారాళంగా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే ముంబయి జట్టుకు సమస్యగా మారనుంది. దీనిపై కెప్టెన్ హార్దిక్‌ పాండ్య దృష్టిసారించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్యాటర్లు భారీగా పరుగులు చేసినా విజయం కోసం ఇబ్బంది పడాల్సి ఉంటుంది’’ అని తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని