ODI WC 2023 : కివీస్‌.. పాక్‌.. అఫ్గాన్‌.. సెమీస్‌కి వచ్చే జట్టేది?

వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023) లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీ రసవత్తరంగా మారింది.

Updated : 08 Nov 2023 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : విధ్వంసక వీరుడు మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) అద్భుత పోరాటంతో అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా(AUS vs AFG) చిరస్మరణీయ విజయాన్ని సాధించి సెమీస్‌లో స్థానం సంపాదించుకుంది. దీంతో సెమీస్‌లో చేరిన మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకూ ఓటమే ఎరగకుండా దూసుకుపోతున్న టీమ్‌ఇండియా సెమీస్‌లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా.. రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇక సెమీస్‌లోకి వచ్చే నాలుగో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది(ODI World Cup 2023 Top 4 Race). మరి ఏయే జట్లు నాలుగో స్థానం కోసం పోటీపడుతున్నాయి.. వాటికి అవకాశాలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే..

సెమీస్‌లో నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ పోటీపడుతున్నాయి. ఇవన్నీ నాలుగేసి విజయాలతో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. ఒక్కో జట్టు ఇంకో మ్యాచ్‌ మాత్రమే ఆడాల్సి ఉంది. ఇక్కడో ఆస్తకికర విషయం ఏంటంటే.. ఈ మూడు జట్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచినా.. నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్‌ చేరుతుంది. మూడు జట్లూ ఓడినా.. అప్పుడూ నెట్‌రన్‌రేట్‌ ఆధారంగానే వీటిలో ఒకటి నాలుగో స్థానంలోకి వెళ్తుంది.

న్యూజిలాండ్‌..

నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటతో న్యూజిలాండ్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ చేరే అవకాశాలుంటాయి. ఇక కివీస్‌ ఓడితే మాత్రం.. పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. అప్పుడు.. పాక్‌, అఫ్గాన్‌ ఓడిపోయి.. నెట్‌ రన్‌రేట్‌ న్యూజిలాండ్‌కు అనుకూలంగా ఉండాలి.

పాకిస్థాన్‌..

న్యూజిలాండ్‌పై భారీ విజయం ఈ జట్టుకు కలిసొచ్చింది. నెట్‌రన్‌రేట్‌ మెరుగుపడటంతో సెమీస్‌ రేసులో ఉంది. పాక్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే పాక్‌కు సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడితే.. ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై పాక్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. 

నొప్పితోనే మ్యాక్సీ ఆట.. ‘బై రన్నర్‌’పై చర్చ.. ఐసీసీ రూల్స్‌ ఏంటంటే..?

అఫ్గానిస్థాన్‌..

ఈ ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న అఫ్గాన్‌.. మంగళవారం ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ ఓటమి ఆ జట్టు సెమీస్‌ అవకాశాలపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. 5 విజయాలతో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ల కంటే రేసులో ముందుండేది. మరోవైపు నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌లో ఉండటం కూడా ఈ జట్టుకు ప్రతికూలాంశం.  తర్వాతి మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాతో తలపడాలి. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో అఫ్గాన్‌ గెలవాలి. ఇతర జట్ల ఫలితాలూ తనకు కలిసిరావాలి. అప్పుడే సెమీస్‌ చేరే అవకాశాలు ఉంటాయి.

ఇక ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక సెమీస్‌ రేసు నుంచి వైదొలగగా.. నెదర్లాండ్స్‌కు దాదాపు అవకాశాలు లేనట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని