IPL: ఐపీఎల్‌లో ఇప్పటివరకు బ్రేక్‌ కాని రికార్డులు

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌కు మార్చి 22న తెర లేవనుంది. ఈ లీగ్‌లో ఇప్పట్లో బ్రేక్‌ కావడానికి అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి.  

Published : 22 Mar 2024 00:06 IST

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాళ్లు, మేటి విదేశీ క్రికెటర్లు చేసే మెరుపులు విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మ్యాచ్‌లో బ్యాట్‌కు, బంతికి మధ్య జరిగే యుద్ధం అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంది. అందుకే ఈ లీగ్‌కు భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌క్రేజ్‌ ఉంది. మరి ఐపీఎల్‌లో ఇప్పట్లో బ్రేక్‌ కావడానికి అవకాశం లేని రికార్డులపై ఓ లుక్కేద్దాం.

ఒకే సీజన్‌లో 973 పరుగులు

విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారించే ఈ మేటి బ్యాటర్ ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2016 సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు మరే ఆటగాడు కోహ్లీ 973 పరుగుల రికార్డును బ్రేక్‌ చేయలేదు. గుజరాత్ టైటాన్స్‌ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 2023లో 890 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.  

వరుసగా 10 విజయాలు

టోర్నీలోనైనా వరుసగా నాలుగైదు మ్యాచ్‌ల్లో గెలవడం కష్టం. అలాంటిది చివరి బంతి వరకు ఉత్కంఠ సాగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ సాధించడం గొప్ప విషయమే. 2014, 2015 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (ఏకంగా వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014లో ఫైనల్‌తో కలిపి వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన కేకేఆర్‌.. 2015 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఏ టీమ్‌ బ్రేక్‌ చేయలేదు. 

ఒకే మ్యాచ్‌లో 175 

ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ వీరుడు క్రిస్‌ గేల్ పేరిట ఉంది. 2013 సీజన్‌లో పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్‌లు బాది 175 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. వేగవంతమైన సెంచరీ కూడా ఇదే మ్యాచ్‌లో గేల్‌ (30 బంతుల్లో)  నమోదు చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక (17) సిక్స్‌ల రికార్డు కూడా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 

12 పరుగులకే 6 వికెట్లు 

బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఐపీఎల్‌లో ఓ బౌలర్‌ ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడమే అరుదు. కానీ, అరంగేట్ర మ్యాచ్‌లోనే ఓ ఆటగాడు ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 2019లో సన్‌రైజర్స్‌పై ముంబయి ఇండియన్స్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ 3.4 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇది అరంగేట్ర మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీలో చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.  

ఫాస్టెస్ట్ ఫిప్టీ ఎవరంటే? 

రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 2023 ఐపీఎల్‌ సీజన్‌లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. టోర్నీ చరిత్రలో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్‌ పేరిట ఉంది. 2018లో దిల్లీ క్యాపిటల్స్‌పై రాహుల్‌, 2022లో ముంబయి ఇండియన్స్‌పై 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు. 

అమితే ‘హ్యాట్రిక్’ వీరుడు

ఐపీఎల్‌లో ఒక్కసారి ‘హ్యాట్రిక్‌’ సాధించడమే కష్టం. కానీ, ఓ బౌలర్‌ ఏకంగా మూడుసార్లు హ్యాట్రిక్‌ సాధించాడు. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా 2008లో దిల్లీ డేర్‌డేవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించి డెక్కన్‌ ఛార్జర్స్‌పై తొలి హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు. 2011లో దిల్లీ తరఫునే ఆడి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై రెండోసారి ఈ ఫీట్ సాధించాడు. 2013లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడి పుణె వారియర్స్‌పై మూడోసారి ‘హ్యాట్రిక్‌’ అందుకున్నాడు. అత్యధికసార్లు (3) హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్‌ అమిత్‌ మిశ్రానే. 

ఒకే ఓవర్‌లో 37 పరుగులు 

ఏ ఆటగాడికైనా ఒక ఓవర్‌లో 20 పరుగులు చేయడమే కష్టం. కానీ, ఐపీఎల్‌లో ఇద్దరూ బ్యాటర్లు ఒకే ఓవర్‌లో 37 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2011లో కొచ్చి టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్‌ గేల్ ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్‌లో 6, 6 నోబాల్‌, 4, 4, 6, 6, 4 సాయంతో 37 పరుగులు పిండుకున్నాడు. 2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా 37 రన్స్‌ చేసి గేల్ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 6, 6 నోబాల్‌, 6, 6, 2, 6, 4 సాయంతో ఈ ఫీట్‌ సాధించాడు. తర్వాత మరే ఆటగాడు ఈ రికార్డును అందుకోలేదు.

అత్యధిక భాగస్వామ్యం ఎవరిదంటే? 

ఐపీఎల్‌లో అత్యధిక (229) పరుగుల భాగస్వామ్యం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ద్వయం పేరిట ఉంది. 2016లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆర్సీబీ జంట చెలరేగింది. కోహ్లీ (109; 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఏబీ డివిలియర్స్‌ (129; 53 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లు) శతకాలతో కదం తొక్కారు. దీంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్‌ 104 పరుగులకే ఆలౌటైంది. 

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని