T20 World Cup 2024: పాకిస్థాన్‌కు సూపర్‌ షాక్‌

టీ20 ప్రపంచకప్‌లో తొలి సంచలనం. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్‌కు పసికూన అమెరికా షాకిచ్చింది.

Updated : 07 Jun 2024 06:47 IST

అమెరికా సంచలన విజయం

టీ20 ప్రపంచకప్‌లో తొలి సంచలనం. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్‌కు పసికూన అమెరికా షాకిచ్చింది. కెంజిగె, నేత్రావల్కర్‌ల సూపర్‌ బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేసిన యుఎస్‌.. మొనాంక్‌ పటేల్, ఆరోన్‌ జోన్స్‌ల అదిరే బ్యాటింగ్‌తో స్కోరును సమం చేసి పోరును సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లింది. సూపర్‌ ఓవర్లో సూపర్‌గా ఆడి విజయాన్నందుకుంది. 

డల్లాస్‌: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన ఆ జట్టు.. గురువారం సూపర్‌ ఓవర్‌కు దారితీసిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది. మొదట అమెరికా బౌలర్లు పాకిస్థాన్‌ను కట్టడి చేశారు. కెంజిగె (3/30), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) విజృంభించడంతో పాక్‌ 7 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. బాబర్‌ అజామ్‌ (44; 43 బంతుల్లో 3×4, 2×6), షాదాబ్‌ ఖాన్‌ (40; 25 బంతుల్లో 1×4, 3×6) రాణించారు. ఛేదనలో అమెరికా 3 వికెట్లకు సరిగ్గా 159 పరుగులే చేసింది. మొనాంక్‌ పటేల్‌ (50; 38 బంతుల్లో 7×4, 1×6), ఆరోన్‌ జోన్స్‌ (36 నాటౌట్‌; 26 బంతుల్లో 2×4, 2×6), ఆంద్రీస్‌ గౌస్‌ (35; 26 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటారు. స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. సూపర్‌ ఓవర్లో మొదట అమెరికా 18 పరుగులు చేయగా.. పాకిస్థాన్‌ 13 మాత్రమే చేసి పరాజయంపాలైంది.

పాకిస్థాన్‌ కట్టడి: కూనపై రెచ్చిపోతుందనుకున్న పాకిస్థాన్‌ బ్యాటుతో తడబడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఇన్నింగ్స్‌ చాలా పేలవంగా మొదలైంది. ఆ జట్టు 5 ఓవర్లలో 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (9)ను ఔట్‌ చేయడం ద్వారా పాక్‌ పతనాన్ని నేత్రావల్కర్‌ మొదలెట్టగా.. ఉస్మాన్‌ ఖాన్‌ (3)ను కెంజిగె ఔట్‌ చేశాడు. ఫకర్‌ జమాన్‌ (11)ను అలీ పెవిలియన్‌ చేర్చాడు. ఆ దశలో షాదాబ్‌ ఖాన్‌తో కలిసి కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పాకిస్థాన్‌ను ఆదుకున్నాడు. భాగస్వామ్యం మొదట్లో పరుగుల కోసం బ్యాటర్లిద్దరూ చాలా కష్టపడ్డారు. ఎదుర్కొన్న తొలి 23 బంతుల్లో బాబర్‌ 9 పరుగులు మాత్రమే చేశాడు. 9 ఓవర్లకు స్కోరు 46/3. అయితే క్రమంగా జోరందుకున్న షాదాబ్, బాబర్‌ సిక్స్‌లు, ఫోర్లు కొట్టడం మొదలెట్టడంతో స్కోరు  వేగం పెరిగింది. 10 నుంచి 12 ఓవర్ల మధ్య పాక్‌కు 37 పరుగులొచ్చాయి. కానీ షాదాబ్‌ను ఔట్‌ చేయడం ద్వారా 72 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన కెంజిగె.. తర్వాతి బంతికే అజామ్‌ ఖాన్‌ను ఔట్‌ చేసి పాక్‌కు షాకిచ్చాడు. ఓ ఫోర్, సిక్స్‌తో జోరు కొనసాగించే ప్రయత్నం చేసిన బాబర్‌ను 16వ ఓవర్లో జస్‌దీప్‌ వెనక్కి పంపాడు. ఇఫ్తికార్‌ (18) కొన్ని చక్కని షాట్లు ఆడినా.. ఎక్కువసేపు నిలవలేకపోయాడు. షహీన్‌ అఫ్రిది (23 నాటౌట్‌) పుణ్యమా అని ఆఖరి మూడు ఓవర్లలో పాక్‌ 27 పరుగులు రాబట్టగలిగింది.

సూపర్‌ ఓవరిలా..: పాకిస్థాన్‌ పేలవ ఫీల్డింగ్, బౌలింగ్‌ కారణంగా సూపర్‌ ఓవర్లో తొలుత అమెరికా 18 పరుగులు రాబట్టింది. తొలి బంతికి ఫోర్‌ కొట్టిన ఆరోన్‌ జోన్స్‌ ఈ ఓవర్లో 11 పరుగులు చేయగా.. మూడు బంతులను వైడ్‌గా వేసిన ఆమిర్‌ మొత్తం ఎక్స్‌ట్రాల రూపంలో ఏడు పరుగులిచ్చాడు. 19 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్‌ ఒక వికెట్‌ కోల్పోయి 13 పరుగులే చేసింది. నేత్రావల్కర్‌ బౌలింగ్‌లో తొలి బంతిని డాట్‌ ఆడిన ఇఫ్తికార్‌ రెండో బంతికి ఫోర్‌ కొట్టాడు. ఓ వైడ్‌ వేసిన నేత్రావల్కర్‌.. మూడో బంతికి ఇఫ్తికార్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి 3 బంతుల్లో నేత్రావల్కర్‌ 8 పరుగులే ఇచ్చి అమెరికాను ఆనందంలో ముంచెత్తాడు.

పాకిస్థాన్‌: 159/7 (బాబర్‌ అజామ్‌ 44, షాదాబ్‌ ఖాన్‌ 40, షహీన్‌షా అఫ్రిది 23 నాటౌట్‌; కెంజిగె 3/30, సౌరభ్‌ నేత్రావల్కర్‌ 2/18); అమెరికా: 159/3 (మొనాంక్‌ పటేల్‌ 50, ఆంద్రీస్‌ గౌస్‌ 35, అరోన్‌ జోన్స్‌ 36 నాటౌట్, నితీశ్‌ 14 నాటౌట్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు