Mumbai vs UP: ముంబయికి షాక్‌.. యూపీ వారియర్స్‌ బోణీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో యూపీ వారియర్స్‌ బోణీ కొట్టింది. ముంబయి ఇండియన్స్‌పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 28 Feb 2024 23:18 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో హ్యాట్రిక్‌పై కన్నేసిన ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు యూపీ వారియర్స్‌ (UP Warriorz) షాక్‌ ఇచ్చింది. భారీ లక్ష్యం ఎదుట ఉన్నా.. ఒత్తిడిని చిత్తు చేస్తూ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కిరణ్‌ నవ్‌గిరే (57: 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు),  గ్రేస్‌ హరిస్‌ (38 నాటౌట్‌: 17 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అలిస్సా హేలీ (33), దీప్తి శర్మ(27*) దూకుడుగా ఆడారు. వీరి మెరుపులకు భారీ లక్ష్య ఛేదన సునాయాసమైంది. ఈ విజయంతో యూపీ జట్టు ఈ సీజన్‌లో బోణీ కొట్టింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్‌ తొలి వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యంతో శుభారంభానిచ్చారు. ముంబయి బ్యాటర్లలో హేలీ మాథ్యూస్‌ (55) హాఫ్‌ సెంచరీ సాధించి జట్టుకు కీలక ఇన్నింగ్స్‌ అందించింది. యస్తికా భాటియా (26), అమేలియా ఖెర్‌ (23) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో అంజలి శ్రావణి, గ్రేస్‌ హారిస్‌, సోఫి, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని