USA vs CAN: కెనడాను చిత్తు చేసిన యూఎస్‌ఏ.. టీ20ల్లో రికార్డు విజయం

టీ20 ప్రపంచ కప్‌ సంగ్రామం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ రికార్డు ఛేదన చేసి విజయం నమోదు చేసింది.

Updated : 02 Jun 2024 11:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆతిథ్య యూఎస్ఏ - కెనడా (USA vs CAN) జట్ల మధ్య మ్యాచ్‌తో టీ20 ప్రపంచ కప్‌ పోరు మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే యూఎస్‌ఏ రికార్డు లక్ష్య ఛేదన చేసి విజయం సాధించింది. కెనడా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి గెలిచింది. యూఎస్‌ఏ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇదే. వరల్డ్‌ కప్‌ హిస్టరీలోనూ అత్యధిక టార్గెట్‌ ఛేదించి గెలిచిన మ్యాచుల్లో మూడోది కావడం విశేషం. 

ఆరోన్ జోన్స్ భారీ ఇన్నింగ్స్‌.. 

లక్ష్యం 195. రెండో బంతికే ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0) డకౌట్‌ కాగా.. కాసేపు పోరాడిన యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ (16) పెవిలియన్‌కు చేరాడు. దీంతో తమ జట్టు విజయం నల్లేరు మీద నడకే అనుకున్న కెనడా అభిమానులకు యూఎస్‌ఏ ఆటగాళ్లు ఆరోన్ జోన్స్ (94*), ఆండ్రిస్‌ గోస్ (65) షాక్‌ ఇచ్చారు. మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 131 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. ఆండ్రిస్‌ ఔటైనప్పటికీ కోరే అండర్సన్ (3)తో కలిసి జోన్స్‌ మరో వికెట్‌ కోల్పోకుండా జట్టును గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అతడికే దక్కింది. 

ఇద్దరు హాఫ్‌ సెంచరీలు..

తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (23), నవ్‌నీత్ (61) తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో జాన్సన్‌తోపాటు పర్గత్ సింగ్ (5) ఔటయ్యారు. ఆ తర్వాత నికోలస్ కిర్టన్ (51)తో కలిసి ఆరోన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. చివర్లో శ్రేయస్‌ మొవ్వా (32: 16 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. దీంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు