Ranji Trophy: వీడియో గేమ్‌ వయసులో రంజీ గేమ్‌లోకి..

అతడి వయసు కుర్రాళ్లు ఇంకా క్రికెట్‌ నేర్చుకుంటూ ఉన్నారు. కొంతమంది అసలు ఆ ఆటలోకే రాలేదు. అతడు మాత్రం భారత్‌లోనే ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ (Ranji Trophy) రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. పిన్న వయసులో స్టార్‌ బౌలర్లను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ కుర్రాడే వైభవ్‌ సూర్య వంశీ (Vaibhav Suryavanshi).

Published : 07 Jan 2024 17:23 IST

అతడి వయసు కుర్రాళ్లు ఇంకా క్రికెట్‌ నేర్చుకుంటూ ఉన్నారు. కొంతమంది అసలు ఆ ఆటలోకే రాలేదు. అతడు మాత్రం భారత్‌లోనే ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ (Ranji Trophy) అయిన రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. పిన్న వయసులో స్టార్‌ బౌలర్లను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ కుర్రాడే వైభవ్‌ సూర్య వంశీ (Vaibhav Suryavanshi). బిహార్‌కు చెందిన ఈ 12 ఏళ్ల బాలుడు.. ముంబయిపై రంజీట్రోఫీలో అరంగేట్రం చేసి ఆశ్చర్యపరిచాడు. పిన్న వయసులోనే రంజీ ఆడిన నాలుగో ఆటగాడిగా వైభవ్‌ చరిత్రలోకెక్కాడు.

నాన్న కలను నెరవేర్చడానికి..

నిజానికి ఇంత చిన్న వయసులోనే వైభవ్‌ రంజీ అరంగేట్రం చేయడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ క్రికెటర్‌ కావాలని కలలుకన్నాడు. ఇందుకోసం బిహార్‌ నుంచి ముంబయికి మకాం మార్చాడు. ఆర్థిక వనరులు లేకపోవడంతో కోచ్‌లను బతిమిలాడి క్రికెట్‌ ఆడేవాడు. బౌన్సర్‌గా పని చేశాడు. సులభ్‌ కాంప్లెక్స్‌లో వర్కర్‌గా కష్టపడ్డాడు. కానీ అతడి ఎదుగుదలకు ఆర్థిక పరిస్థితులతో పాటు రాజకీయాలు అవరోధంగా మారాయి. దీంతో సంజీవ్‌ కల అక్కడితో ముగిసింది. కానీ, తన వల్ల సాధ్యం కానిది తనయుడి ద్వారా నెరవేర్చుకోవాలని సంజీవ్‌ భావించాడు. దీనికి తగ్గట్టే వైభవ్‌ కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ను చాలా ఇష్టపడ్డాడు. అయిదేళ్ల వయసులోనే చక్కటి టైమింగ్‌తో షాట్లు ఆడుతూ అందర్ని ఆశ్చర్యపరిచాడు. మొదట స్థానిక కోచ్‌ సుధాకర్‌ రాయ్‌ ఆ తర్వాత మనీష్‌ ఓజా శిక్షణలో రాటుదేలిన వైభవ్‌ సీనియర్ల బౌలింగ్‌లో ధాటిగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ప్యాడ్లు కట్టుకోవడానికి, బ్యాట్‌ పట్టుకోవడానికి కూడా వైభవ్‌కు మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ నెమ్మదిగా అలవాటుపడిన అతడు తన శైలిలో దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు. బిహార్‌లోని సమస్థిపుర్‌ నుంచి వారానికి మూడుసార్లు పట్నాకు వెళ్లి మనీష్‌ అకాడమీలో సాధన చేసేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో సంజీవ్‌ తన తనయుడికి ఇంటి దగ్గరే సిమెంట్‌ పిచ్‌పై తానే కోచింగ్‌ ఇచ్చేవాడు. హర్యమన్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ ట్రోఫీలో 600పైన పరుగులు చేసి ఔరా అనిపించిన వైభవ్‌.. నేరుగా బిహార్‌ అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

వినూ మన్కడ్‌లో మెరిసి

అండర్‌-19 ఛాలెంజర్‌ ట్రోఫీలో అదరగొట్టిన వైభవ్‌.. వినూ మన్కడ్‌ టోర్నీలోనూ ఆకట్టుకున్నాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 393 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనలతో నాలుగు దేశాల అండర్‌-19 టోర్నీలో భారత జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న వైభవ్‌ అక్కడా రాణించాడు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌పై అర్ధశతకంతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌ అండర్‌-19 జట్టుకు శిక్షణ ఇస్తున్న టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ కూడా వైభవ్‌ ఆట పట్ల ముగ్ధుడయ్యాడు. అంత చిన్న వయసులో అంత పరిణతితో ఆడడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆట అయితే ఆడతాడు కానీ.. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా నాన్న సంజీవ్‌ వెంట ఉండాల్సిందే. రంజీ ట్రోఫీకి కూడా అతడే వైభవ్‌తో కలిసి ట్రావెల్‌ చేస్తున్నాడు. ముంబయిపై అరంగేట్రం చేసిన వైభవ్‌ (12 ఏళ్ల 284 రోజులు) ఈ టోర్నీలో ఆడిన నాలుగో పిన్న వయస్కుడిగా అరుదైన క్లబ్‌లో చేరాడు. ఎంతటి బౌలర్‌నైనా దీటుగా ఎదుర్కోగల నైపుణ్యం, స్థిరంగా ఆడే తత్వం, క్రీజులో కుదురైన టెక్నిక్‌ ఇవన్నీ వైభవ్‌ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మున్ముందు ఈ బాలుడు ఎలా రాణిస్తాడో చూడాలి. 

                           - ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని