Travis Head: మా జట్టులో ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ను ఎంచుకోవడం కష్టం: ట్రావిస్ హెడ్

ప్రపంచ టీ20ల్లోనే పవర్‌ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్‌ నిలిచింది. దిల్లీపై ఆరు ఓవర్లలో 125 పరుగులు చేసింది. దీనికి కారణం ట్రావిస్ హెడ్. తొలి బంతి నుంచి అతడు ఔటయ్యే వరకూ వీరబాదుడే. 

Published : 21 Apr 2024 11:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ మరో రికార్డు స్కోరును (266/7) సాధించింది. ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ (Travis Head) మరోసారి దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కేవలం 32 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో ఏకంగా 125 పరుగులు రాబట్టారు. లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ట్రావిస్ హెడ్‌ను ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ప్రతి మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా వచ్చే హెడ్‌ స్థానంలో ఒక బౌలర్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా హైదరాబాద్‌ తీసుకుంటుంది. 

‘‘మా కుర్రాళ్లు అదరగొట్టారు. బంతిని ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం కంగారు పడటం లేదు. బంతినిబట్టే బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకొంటాను. మెగా లీగ్‌లో ఫామ్‌ను కొనసాగించడం ఆనందంగా ఉంది. అభిషేక్ శర్మ పవర్‌ప్లేలో బీభత్సంగా ఆడతాడు. స్పిన్‌ బౌలింగ్‌లో అతడిని అడ్డుకోవడం చాలా కష్టం. శర్మతో భాగస్వామ్యం బాగుంటుంది. ఇక ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎవరిని తీసుకోవాలనేది మా జట్టులో చాలా కష్టంగా మారింది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా బౌలింగ్‌ చేసేవాళ్లే. ఎక్కువ ఆప్షన్లు ఉండటం మాకు కలిసొచ్చే అంశం. మేం భారీ స్కోర్లు చేయడానికి ఇదొక కారణం. దిల్లీతో మ్యాచ్‌లో మా బౌలర్లకూ పవర్‌ప్లేలో బంతులేయడం సవాలుగా మారింది. ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాం’’ అని హెడ్‌ తెలిపాడు. 

మాకు ఇక్కడ మంచి రికార్డు ఉంది: కమిన్స్

‘‘దిల్లీ మైదానంలో హైదరాబాద్‌కు మంచి రికార్డు ఉంది. దానిని కొనసాగిస్తూ అద్భుత విజయం సాధించాం. పవర్‌ ప్లేలో బౌలర్లకు ఏమాత్రం అవకాశం దొరకలేదు. బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు అవకాశాలొచ్చాయి. మా బ్యాటింగ్‌ను చూస్తుంటే అద్భుతమనిపిస్తోంది. భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ మేం ఎక్కడా గతి తప్పలేదు. క్రమశిక్షణతో బౌలింగ్ వేశాం. మా ప్రణాళికలను సరిగ్గానే అమలు చేసి విజయం సాధించాం’’ అని హైదరాబాద్‌ కెప్టెన్ కమిన్స్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు