Faf du Plessis: కోహ్లీ ఆగ్రహానికి కారణమదే.. రూల్‌ ప్రకారం వెళ్లక తప్పదు: డుప్లెసిస్

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇంటిముఖం పట్టే తొలి జట్టుగా బెంగళూరు నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరుసగా ఆరో ఓటమితో ప్లే ఆఫ్స్‌కు దాదాపు దూరమైనట్లే.

Published : 22 Apr 2024 08:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఆ జట్టు ఓడిపోయింది. ఆడిన 8 మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించగలిగింది. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఓటమి, విరాట్ కోహ్లీ ఔట్‌, ప్రస్తుత సీజన్‌లో తమ ప్లేఆఫ్స్‌ అవకాశాలపై బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఔట్‌పై విరాట్ (Virat) కూడా అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్లతో చర్చించిన సంగతి తెలిసిందే.

‘‘చివరి వరకూ పోరాడి కేవలం ఒక్క పరుగుతో ఓటమిపాలు కావడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే, మా జట్టు ఆటతీరుపై గర్వంగా ఉన్నా. ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోని బౌలింగ్ విభాగం రాణించింది. భారీ లక్ష్య ఛేదనలో శుభారంభమే దక్కినా.. స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్నాం. విరాట్ కోహ్లీ ఔట్‌ విషయంలో నిబంధనలు అలా ఉన్నప్పుడు మనమేం చేయలేం. కానీ, బంతి నడుంపైకి వస్తున్నట్లు అనిపించింది. అయితే, థర్డ్‌ అంపైర్ క్రీజ్‌ను బేస్‌ చేసుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. ఒక జట్టుకు ఇది కరెక్ట్‌ అనిపించినా.. అవతలి వారికి సరైంది కాదనే అభిప్రాయం ఉండటం సహజమే. రజత్ పటీదార్ - విల్‌ జాక్స్‌ మంచి భాగస్వామ్యంతో మ్యాచ్‌లో మేం ముందుండేలా చూశారు. నరైన్‌ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బ్యాటర్లకు ఎక్కువ సమయం దొరకడం లేదు. క్రీజ్‌లో కుదురుకుని ఆడటం కాకుండా.. వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడాల్సిన పరిస్థితి. కానీ, సునీల్ నరైన్ వంటి బౌలర్‌ను అడ్డుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టమే. పవర్‌ ప్లేలో వేగంగా పరుగులు చేస్తే తర్వాత ఒత్తిడి పెద్దగా ఉండదు. ఈ ఎడిషన్‌లో మా బౌలింగ్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, కోల్‌కతాపై గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాం. ఇంకా భారీ స్కోరు దిశగా వెళ్తున్న ఆ జట్టును కట్డడి చేయగలిగాం. బెంగళూరుకు ఉన్న పెద్ద సానుకూలాంశం అభిమానుల మద్దతు. వారిని సంతోష పెట్టడానికి చివరి వరకూ ప్రయత్నిస్తాం’’ అని డుప్లెసిస్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని