Bengaluru Vs Kolakata: కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్‌.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?

బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు.

Published : 29 Mar 2024 15:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరుతో గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా తలపడనుంది. వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండటం ఖాయం.

బెంగళూరు ఓపెనర్లు Vs మిచెల్ స్టార్క్

బెంగళూరుకు బలం బ్యాటింగ్‌. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌ దూకుడుగా ఆడుతూ శుభారంభం అందిస్తారు. వీరు కోల్‌కతా స్టార్‌ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. అయితే, గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై స్టార్క్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడు ఎలాంటి బౌలింగ్‌ ప్రణాళికతో బరిలోకి దిగుతాడో చూడాలి. ఓపెనర్ల తర్వాత అనుజ్‌ రావత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, రజత్‌ పటీదార్‌, కామెరూన్‌ గ్రీన్‌ మిడిలార్డర్‌లో రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. గత రెండు మ్యాచుల్లో అద్భుత ఫినిషర్‌గా దినేశ్‌ కార్తిక్‌ మునుపటి ఫామ్‌ను అందుకోవడం బెంగళూరుకు సానుకూలాంశం.

రస్సెల్ Vs సిరాజ్‌ బౌలింగ్‌ యూనిట్

హైదరాబాద్‌పై ఒంటిచేత్తో భారీ ఇన్నింగ్స్‌ ఆడిన రస్సెల్‌పైనే అందరి దృష్టి. భారీ సిక్స్‌లతో అతడు విజృంభించాడు. దీంతో బౌలింగ్‌ యూనిట్‌ బలంగా లేని బెంగళూరు అతడిని ఏమాత్రం అడ్డుకుంటుందో చూడాలి. సిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌ వంటి పేసర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. మయాంక్‌ దగర్, మ్యాక్స్‌వెల్‌పైనే స్పిన్ విభాగం ఆధారపడి ఉంది. భారీ హిట్టింగ్‌ చేసే రస్సెల్‌ను త్వరగా ఔట్‌ చేస్తేనే మ్యాచ్‌పై బెంగళూరు పట్టు సాధించగలదు. ఏమాత్రం బౌలింగ్‌లో గతి తప్పినా.. చిన్న బౌండరీలు కలిగిన స్టేడియంలో పరుగుల వరద తప్పదు.

రింకు సింగ్‌ - యశ్ దయాల్‌

గత ఐపీఎల్‌ సీజన్‌లో రింకు సింగ్‌ ఐదు సిక్స్‌ల ప్రదర్శన గుర్తుండే ఉంటుంది కదా. ఆ ఓవర్‌ను అప్పటి గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ సంధించాడు. ప్రస్తుతం అతడు బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌ తర్వాతనే రింకు ఫినిషర్‌గా పేరు గడించాడు. భారత జట్టలోకి అడుగు పెట్టి సత్తా చాటాడు. గత మినీ వేలానికి ముందు గుజరాత్‌ యశ్‌ను వదిలేసుకోగా.. అనూహ్యంగా బెంగళూరు (రూ. 5 కోట్లు) సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ మ్యాచ్‌లో రింకు సింగ్ - యశ్‌ దయాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మరోసారి ‘ఐదు సిక్స్‌ల’ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా..? లేకపోతే రింకు వికెట్‌ తీసి యశ్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తాడో చూడాలి. 

కోహ్లీ Vs గంభీర్‌.. 

చివరిగా.. ఆటకు సంబంధించినది కాకపోయినా.. విరాట్ కోహ్లీ - గౌతమ్‌ గంభీర్ ఈ మ్యాచ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్. గతేడాది వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఒక్కసారిగా అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈసారి మాత్రం అలాంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉండదని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గత సీజన్‌లోనే లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌ సమయంలో వీరిద్దరూ కరచాలనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని