Virat - MS Dhoni: ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్‌కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్‌లో మరోసారి ధోనీ బ్యాటింగ్‌ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Published : 18 May 2024 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు -  చెన్నై జట్లు తమ లీగ్‌ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌ ఇరుజట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు మరోసారి తలపడుతున్న క్రమంలో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌ బెర్తుల్లోని నాలుగో స్థానం ఎవరిదనేది తేలుతుంది. మ్యాచ్‌ జరగకుండా వర్షం కారణంగా రద్దైతే నేరుగా సీఎస్కే నాకౌట్‌కు వెళ్లిపోతుంది. ఈక్రమంలో మరోసారి ధోనీతో ఆడటంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు మాట్లాడిన మాటలు బట్టి ఎంఎస్‌డీ ఆడబోయే చివరి సీజన్‌ ఇదేనా? అనే అనుమానాలు ప్రారంభం కావడం గమనార్హం. ఇంతకీ అతడు ఏం చెప్పాడంటే?

‘‘మహీభాయ్‌తో మరోసారి మ్యాచ్‌ ఆడబోతున్నా. నాకు తెలిసి ఇదే చివరిదేమో మేమిద్దరం ఆడటం. అతడు కొనసాగుతాడో? లేదో? అనేది ఎవరికి తెలుసు. తప్పకుండా ఇది ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మేమిద్దరం భారత్‌ తరఫున చాలా ఏళ్లు కలిసి ఆడాం. టీమ్‌ఇండియాను సింగిల్‌ హ్యాండ్‌తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’’ అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

ధోనీతో ఆడటం ప్రతిఒక్కరి కల: స్వప్పిల్

‘‘ ఎంఎస్ ధోనీతో మైదానం పంచుకోవడం ప్రతిఒక్కరి కల. భారత దిగ్గజ క్రికెటర్‌ ప్రాతినిధ్యం వహించే జట్టుపై ఆడటం తేలిగ్గా ఉండదు. కానీ, దానిని మేం ఒత్తిడిగా భావించం. మా జట్టు సన్నద్ధతకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని గేమ్‌లో అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం. తొలి అర్ధభాగంలో మా ఆటతీరు చూశాక కేవలం ఒక్క శాతం మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పర్సంటేజీని పెంచుకోగలిగాం. వచ్చిన ప్రతీ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ప్లేఆఫ్స్‌ అనే ఒత్తిడిని దరి చేరనీయకుండా వందశాతం మా ప్రదర్శనను ఇచ్చి గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ‘ఇంపాక్ట్’ రూల్‌ వల్ల బౌలర్ల ఆలోచనా విధానం చాలా మారిపోతుంది. ఎందుకంటే ప్రత్యర్థి జట్టుకు నాణ్యమైన ఏడుగురు బ్యాటర్లు అందుబాటులోకి వస్తారు. ఇక ఆల్‌రౌండర్లు ఉంటే దాదాపు 9వ స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల అవకాశం ఆయా జట్లకు వస్తుంది. దీంతో వారిని అడ్డుకొనేందుకు బౌలర్లు ఇంకాస్త విభిన్నంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. విరాట్‌తో నా అండర్-19 రోజుల నుంచి ఆడుతున్నా. ఆర్సీబీతో కలవకముందు పెద్దగా మేం టచ్‌లో లేం. కానీ, జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌తో మ్యాచ్‌ సమయంలో 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా సంభాషించుకున్నాం’’ అని స్వప్నిల్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని