Team India Coach: ప్రధాన కోచ్‌గా గంభీర్‌ కంటే ధోనీ బెటర్..: విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్

త్వరలో భారత కోచ్‌గా కొత్త వ్యక్తిని చూడబోతున్నాం. ఎందుకంటే ద్రవిడ్ కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. ఈ రేసులో గౌతమ్‌ గంభీర్‌ ముందున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Published : 28 May 2024 17:12 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు ప్రధాన కోచ్‌ (Team India) పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరివి చెల్లుబాటు అయ్యాయనే విషయాలను ఇంకా బీసీసీఐ వెల్లడించలేదు. ఈ రేసులో మాత్రం గౌతమ్ గంభీర్‌ ముందున్నాడనేది క్రికెట్ విశ్లేషకుల మాట. గంభీర్‌ ఈ పదవి కోసం దరఖాస్తు చేశాడా? లేదా? అనేది తెలియదు. తాజాగా మరో పేరును తెరమీదకు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ. టీమ్‌ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ప్రధాన కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని రాజ్‌కుమార్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘అసలు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారన్నది ఆసక్తికరంగా ఉంది. కోచ్‌గా ఎవరు వచ్చినా ఫర్వాలేదు కానీ భారత్‌ నుంచే రావాలి. ఒకవేళ ఐపీఎల్‌ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్‌ తీసుకున్నట్లు ప్రకటిస్తే.. అతడు చాలా మంచి ఎంపిక అవుతుంది. ఇప్పటికే చాలా క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. పెద్ద టోర్నీల్లో జట్టును గెలిపించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోనీకి చాలా రెస్పెక్ట్‌ ఉంటుంది. అదేవిధంగా పొట్టి ఫార్మాట్‌లోనూ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. జట్టును సక్రమంగా నిర్వహించగల సామర్థ్యం ఉంది. అతడు సారథిగా వచ్చినప్పుడు జట్టులో అప్పటికే పెద్ద స్టార్లు ఉన్నారు. సచిన్, సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్‌ సింగ్‌, కుంబ్లే, గంభీర్, యువరాజ్‌ సింగ్‌.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ, ఒక్క వివాదం కూడా లేకుండా ధోనీ జట్టును అద్భుతంగా నడిపాడు. సక్సెస్‌ఫుల్ సారథిగా మారాడు’’ అని రాజ్‌కుమార్ వెల్లడించాడు. 

రోహిత్ - కోహ్లీ ఈసారి మిస్టేక్ చేయరు: మంజ్రేకర్

‘‘2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేసిన పొరపాట్లను ఇప్పుడు పునరావృతం చేయరని ఆశిస్తున్నా. మరీ డిఫెన్సివ్‌గా ఆడి ఓటమిని చవిచూసింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 20 ఓవర్లలో 168 పరుగులు సాధించింది. తొలి 60 బంతుల్లో కేవలం 62 రన్స్‌ మాత్రమే చేసింది. సీనియర్లు ఎక్కువగా ఆ బంతులను ఎదుర్కొన్నారు. రోహిత్ 27 బంతుల్లో 28, విరాట్ 40 బంతుల్లో 50 పరుగులు చేశారు. టీ20ల్లో ఇది సరిపోదు. హార్దిక్ పాండ్య (33 బంతుల్లో 63) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్‌ దూకుడు మంత్రంతో ఆడి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది’’ అని మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని