Virat Kohli: కోల్‌కతాతో మ్యాచ్‌.. చర్చకు దారితీసిన కోహ్లీ ఔట్‌ వివాదం!

కోల్‌కతా నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో చివరి వరకూ వచ్చిన బెంగళూరు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే, విరాట్ కోహ్లీ ఔట్‌ నిర్ణయంపై వివాదాస్పదమైంది.

Updated : 22 Apr 2024 10:59 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మరోసారి అంపైరింగ్‌పై విమర్శలు వచ్చాయి. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ (18: 7 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్) దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి నిర్దేశించిన 223 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు వేగంగా ప్రారంభించింది. కానీ, హర్షిత్ రాణా వేసిన (2.1వ ఓవర్‌) బంతిని ఆడబోయిన కోహ్లీ (Virat Kohli) బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. అయితే, ఆ బంతి నడుము కంటే పైకి వచ్చిందని.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌కు ఫీల్డ్‌ అంపైర్ రిఫర్ చేశాడు. సమీక్షలో బంతి సరైందేనని తేలింది. దీంతో అసహనంగా విరాట్ డగౌట్‌ బాట పట్టాడు. దీంతో సాంకేతికతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రికెట్ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

స్పష్టత లేదు: ఏబీ డివిలియర్స్‌

‘‘విరాట్ ఔటైన బంతిపై  360 లైవ్‌ కార్యక్రమంలో వివరణ ఇద్దామని అనుకున్నా. కానీ, మరిచిపోయా. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నా. ఇక్కడ అంపైరింగ్‌తో ఎలాంటి సమస్యా లేదు. సాంకేతికతతోనే ఇబ్బందులు. వైడ్, ఎత్తు వంటి నిర్ణయాలను తీసుకొనేందుకు టెక్నాలజీని వాడుకోవడం బాగానే ఉంది. కానీ, ఈ మ్యాచ్‌లో ఇచ్చిన ఔట్‌పై మాత్రం స్పష్టత లేకపోవడంతోనే కొందరికి ఆగ్రహం తెప్పించింది. మరికొందరు అయోమయానికి గురి కావాల్సి వచ్చింది. బ్యాటర్ ఉన్న పొజిషన్‌ను పరిగణనలోకి తీసుకొని.. లైన్లను, బాల్ ట్రాకింగ్‌ను చూసి ఉంటే ఎలాంటి గందరగోళం ఉండేది కాదు’’ అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ పేర్కొన్నాడు. అంబటి రాయుడు, నవ్‌జ్యోత్‌ సిద్ధూ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఇది లీగల్‌ డెలివరీనే: పఠాన్, హర్షా భోగ్లే

ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయానికి విభిన్నంగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్పందించారు. ఇర్ఫాన్‌ దీనిని దీనిని లీగల్ బాల్ అని తేల్చేశాడు. భోగ్లే మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీకి ధన్యవాదాలు. పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు లేకుండా చేసింది. ఇప్పుడు కూడా అంపైరింగ్‌ గురించి కాదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మొహమాటంగా ఉపయోగించడంపైనే ఈ చర్చ సాగుతోంది. కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్‌లో సరైన నిర్ణయమే వచ్చింది’’ అని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని