Team India: విరాట్‌ కోహ్లీ ఔట్.. కావాలి కుర్రాళ్లకు పాఠం

మొన్న వన్డే ప్రపంచ కప్‌లో అదరగొట్టి.. నిన్న ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీ విఫలం కావడం ఫ్యాన్స్‌ను కలవరానికి గురి చేస్తోంది.

Published : 06 Jun 2024 16:05 IST

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ మంచి బోణీ కొట్టిందిలే అనుకుంటే పొరపాటు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సత్తా చాటేశామని సంబరపడిపోకూడదు. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో సీనియర్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇబ్బందిపడినట్లు అనిపించింది. అయితే, ఆరంభంలోనే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఎదురుకావడం ఒకెత్తు మంచిదేనంటున్నారు విశ్లేషకులు.

ఓపెనర్‌గా వచ్చి.. 

వరల్డ్‌ కప్‌ కోసం జట్టును ప్రకటించినప్పుడు కెప్టెన్ రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా వస్తాడని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఐర్లాండ్‌తో పోరుకు విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా దింపారు. వన్‌డౌన్‌లో రిషభ్‌ పంత్ వచ్చాడు. పంత్ తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కానీ, విరాట్ మాత్రం క్రీజ్‌లో ఇబ్బందిపడ్డాడు. చివరికి ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పుడు సీనియర్‌ బ్యాటర్‌గా విరాట్ కాస్త నింపాదిగా ఆడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం క్రీడా పండితుల్లో వచ్చింది. బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లను తికమకకు గురి చేసింది. ఐర్లాండ్‌ బౌలర్ మార్క్ ఐదెర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కోహ్లీ బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌ నిలకడగా ఆడుతున్నప్పుడు.. పెద్దగా లక్ష్యం కానప్పుడు విరాట్ ఇంకాస్త సమయం తీసుకోవాల్సింది. యూఎస్‌ఏకు చేరుకున్నాక వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఆడకుండా నేరుగా ఐర్లాండ్‌తో బరిలోకి దిగాడు. ఇలాంటప్పుడే క్రీజ్‌లో కుదురుకుని బంతిని సరిగ్గా అంచనా వేస్తే బాగుండేది. న్యూయార్క్‌ పిచ్‌ మీద ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. రోహిత్ చేతికి గాయం కావడంతో హాఫ్‌ సెంచరీ తర్వాత మైదానాన్ని వీడాడు. బౌలర్లకే ఇక్కడ సహకారం లభిస్తుందని మన బౌలింగ్‌ను చూసిన తర్వాతనైనా కోహ్లీ నిదానించి షాట్ల ఎంపిక చేసుకోవాల్సింది. 

భారీ షాట్లు కొట్టడం ఈజీ కాదు..

టీ20 ఫార్మాట్‌ అనగానే భారీ స్కోర్లు ఉంటాయని ఆశించే అభిమానులకు ఈసారి నిరాశే ఎదురుకానుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నీ దాదాపు లో స్కోరింగ్‌వే కావడం విశేషం. తక్కువ పరుగులే లక్ష్యంగా ఉన్నా సరే.. చివరి వరకూ ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకటీ, రెండు మ్యాచులు తప్ప.. మిగతావి హోరాహోరీగానే సాగుతున్నాయి. బౌలర్లకే అనుకూలంగా ఉన్న పిచ్‌లు కావడంతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీ20ల్లోనే నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడంటే సిక్స్‌లు చూస్తామని అనుకుంటాం. కానీ, అతడు కూడా భారీ షాట్లు కొట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లోనూ స్పిన్నర్లపై ఎటాక్‌ చేద్దామని భావించిన శివమ్‌ దూబెకు చుక్కెదురైంది. ఇక బౌండరీలు బాదడం అంత సులువేం కాదు. 

ఎక్కడ పడిన బంతి అక్కడే.. 

ఇప్పటివరకు అమెరికా వేదికగా జరిగిన మ్యాచ్‌లు గమనిస్తే.. సిక్స్‌లు చాలా తక్కువే నమోదయ్యాయి. ఇక ఫోర్లను కూడా బ్యాటర్లు పెద్దగా రాబట్టలేకపోయారు. దానికి కారణం అవుట్‌ ఫీల్డ్. ఇసుకతో నింపి ఉండటం కూడా బంతి గమనాన్ని అడ్డుకుంటుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అన్నీ ఓపెన్‌ టాప్ స్టేడియాలే. దీంతో గాలి ప్రభావం కూడా ఎక్కువే. బౌలర్లకు అదనంగా పుష్‌అప్ లభిస్తుంది. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేస్తే వికెట్లు వస్తాయని ఇప్పటికే బౌలర్లు నిరూపించారు. అదే సమయంలో ఏమాత్రం అనవసర తప్పిదాలకు బ్యాటర్లు పాల్పడినా వికెట్లను సమర్పించుకోక తప్పని పరిస్థితి.

గమనిక: ప్రస్తుతం ఐర్లాండ్‌తో అంటే ఫర్వాలేదు.. జూన్ 9న పాకిస్థాన్‌తో కీలక పోరులో భారత్ తలపడనుంది. విరాట్ కోహ్లీ విజృంభణ కోసం టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌ ఎదురుచూసే మ్యాచ్. ఇలాంటి పొరపాట్లను పునరావృతం చేయకూడదు. అయితే, వరల్డ్‌ కప్ టోర్నీల్లో విరాట్‌కు తిరుగులేని రికార్డుంది. అదే సగటు అభిమాని భరోసా.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు