Virat Kohli: ఏమైంది ‘రికార్డుల రారాజు’..? ఇలాగైతే వరల్డ్‌కప్‌కు కష్టమే!

టీ20 లీగ్‌ నుంచి విరాట్ కాస్త విరామం తీసుకుంటే మంచిదని ...

Updated : 28 Apr 2022 08:25 IST

41, 12, 5, 48, 1, 12, 0, 0, 9.. తొమ్మిది మ్యాచుల్లో చేసిన మొత్తం పరుగులు 128.. 

ఇవేవో యువ క్రికెటర్ చేసిన రన్స్‌ కావు.. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చిన బ్యాటర్‌ చేసినవీ కావు.. ఇవీ రన్‌మెషీన్‌ విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. టీ20 లీగ్‌లో కోహ్లీ ప్రదర్శన ఇలా ఉంది. ఇందులో రెండుసార్లు గోల్డెన్‌ డక్.. మరోసారి కాస్తలో డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గత ఆరేడేళ్లుగా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ ఫామ్‌ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి ప్రదర్శనతో ఆటగాడిగా టీ20 కెరీర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జట్టులో స్థానం దక్కడమూ కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇలా కావడానికి గల కారణాలు ఏంటంటే..

టీ20 లీగ్‌ నుంచి విరాట్ కాస్త విరామం తీసుకుంటే మంచిదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి చెప్పాడంటే.. కోహ్లీ ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి దిగ్గజ బ్యాటర్‌కైనా కెరీర్‌లో ఒడుదొడుకులు సహజమే. అయితే వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా రాణించాలి. అప్పుడే సాధారణ ఆటగాడికి లెజెండరీ ప్లేయర్‌కు తేడా ఉంటుంది. అసలే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ పోటీలు ముందున్నాయి. ఇప్పటికే అన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు ఫామ్‌ను దొరకబుచ్చుకుని చెలరేగుతున్నారు. అలానే విరాట్‌ కోహ్లీ కూడా మళ్లీ పరుగులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అవే తప్పులు మళ్లీ మళ్లీ.. 

యువ క్రికెటర్లు అంటే అనుభవం తక్కువ ఉండి ఉద్రేకంతో ఆడుతుంటారు. అలాంటి సమయంలో వికెట్లను సమర్పించుకోవడం సహజం. అయితే అపార అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ కూడా నిన్న మొన్న వచ్చిన ఆటగాడిగా ఒకే రకమైన షాట్లకు పెవిలియన్‌ చేరడం అభిమానులను మరింత బాధిస్తోంది. ఉదాహరణకు గత మూడు మ్యాచ్‌లను చూసుకుంటే.. బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని బంతి ఫీల్డర్‌ చేతిలో పడిపోయింది. ఒకటి అరా తప్ప ఏ మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసిన దాఖలాలు కనిపించలేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటున్న కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చేసరికి తేలిపోతున్నాడు. 

కెప్టెన్సీ ఒత్తిడేమీ లేదే

నాయకత్వ బాధ్యతలు  తన బ్యాటింగ్‌పై ప్రభావం పడుతున్నాయనే ఉద్దేశంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. టీ20 లీగ్‌ గత సీజన్‌ మధ్యలోనే బెంగళూరు సారథ్యం నుంచి తప్పుకొంటున్నానని ప్రకటించాడు. దీంతో ఈసారి బ్యాటింగ్‌తో చెలరేగుతాడని అంతా భావించారు. మొదటి మ్యాచ్‌లో 41 పరుగులు చేయడంతో ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు సంతోషించారు. మరొక మ్యాచ్‌లో 48 రన్స్‌తో మెరిశాడు. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో రెండు డకౌట్లు కావడం తీవ్ర నిరాశపరిచింది. మరీ దారుణంగా ఇందులో వరుసగా రెండు గోల్డెన్‌ డక్‌లు ఉండటం గమనార్హం. దీంతో ప్రత్యర్థి బౌలర్ల బుట్టలో విరాట్ కోహ్లీ ఈజీగా పడిపోయాడు. ఆఫ్‌సైడ్‌ వికెట్‌కు కాస్త దూరంగా వేస్తే చాలు ఔట్‌ అవుతున్నాడని నిరూపించుకున్నాడు. సారధ్య బాధ్యతలకు సంబంధించిన ఎలాంటి ఒత్తిడి లేదు. అయినా ప్రదర్శనలో మాత్రం మార్పు రావడం లేదు.

ప్రపంచ కప్‌ జట్టులో కష్టమే..

ఇలానే ప్రదర్శన కొనసాగితే ఆసీస్‌ వేదికగా జరగబోయే ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కడం విరాట్ కోహ్లీకి కష్టమే అవుతుంది. ఇప్పటికే సీనియర్ల నుంచి తీవ్ర పోటీ ఉంది. మరోవైపు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆటగాళ్ల ప్రదర్శనకే ప్రాధాన్యతనిస్తాడు. రోహిత్ శర్మ కాకుండా.. కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తిక్‌, శిఖర్ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్, పృథ్వీ షా, శివమ్‌ దూబే, అంబటి రాయుడు, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, రిషభ్ పంత్ వంటి ప్లేయర్లు టీ20 లీగ్‌లో పరుగులు చేస్తూ విరాట్‌కు సవాల్‌ విసురుతున్నారు. ఇక ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, తిలక్‌ వర్మ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, అనుజ్‌ రావత్, వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్‌లాంటి యువ క్రికెటర్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ వెనక్కి రావాలని డిమాండ్లూ వినవస్తున్నాయి. ఇటువంటి సమయంలో విరాట్ మిగతా మ్యాచుల్లోనైనా రాణించి తనకున్న ఛేదనల రారాజు నామధేయం సార్థకం చేసుకోవాలని కోహ్లీ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు