Kolkata vs Bengaluru: టీవీ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో టీవీ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై బెంగళూరు స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో అతడికి ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. 

Updated : 22 Apr 2024 20:37 IST

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీవీ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై బెంగళూరు స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడికి ఐపీఎల్ నిర్వాహకులు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘కోహ్లీ ఐపీఎల్‌ కోడ్ ఆఫ్‌ కాండక్ట్ ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పిదాన్ని మ్యాచ్‌ రిఫరీ ఎదుట అంగీకరించాడు. లెవల్ 1 ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైనది’’ అని ఐపీఎల్ పేర్కొంది.  

అసలేం జరిగిందంటే.. 

కోల్‌కతా నిర్దేశించిన 223 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు వేగంగా ప్రారంభించింది. విరాట్ కోహ్లీ (18: 7 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్) దూకుడుగా ఆడాడు. కానీ, హర్షిత్ రాణా వేసిన (2.1వ ఓవర్‌) బంతిని ఆడబోయిన కోహ్లీ బౌలర్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. కానీ అది నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని కోహ్లీ సమీక్ష కోరేందుకు సిద్ధమయ్యాడు. కానీ అంపైర్లే దీన్ని టీవీ అంపైర్‌కు సిఫార్సు చేశారు. రీప్లేలో చూసిన తర్వాత కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని టీవీ అంపైర్‌ ఔటిచ్చాడు. నేలపై నుంచి కోహ్లీ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా.. అతను ఆడినప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులోనే ఉందని సాంకేతిక సాయంతో అంపైర్‌ నిర్ణయించాడు. కానీ ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ అంపైర్లతో వాదించాడు. పెవిలియన్‌ వైపు వెళ్తూ మళ్లీ వచ్చి అంపైర్లతో మాట్లాడి నిష్క్రమించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని