Virat - Dinesh Karthik: ‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఘనంగా ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్’

కీలకమైన మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆ ఫ్రాంచైజీ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ కూడా మెగా లీగ్‌కు వీడ్కోలు పలికాడు.

Updated : 23 May 2024 11:17 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్థాన్ విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ఇదే సమయంలో ఐపీఎల్‌ నుంచి ఆర్సీబీ ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) కూడా వీడ్కోలు పలికేశాడు. ఈ సీజన్‌లో డీకే 15 మ్యాచుల్లో 187.36 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన నిర్ణయం ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురై ఇబ్బంది పడిన డీకేను హత్తుకొని విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓదార్చాడు. ఆటగాళ్లతో కార్తిక్‌కు ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇప్పించాడు. అభిమానులను కూడా ఉత్సాహపరుస్తూ ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి కోహ్లీ మైదానం మొత్తం చుట్టేశాడు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. 

తుషార్ దేశ్‌పాండే పోస్టు వైరల్‌.. తర్వాత డిలీట్

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైన బెంగళూరును ఉద్దేశించి చెన్నై ఆటగాడు తుషార్ దేశ్‌పాండే పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో వెంటనే దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి డిలీట్‌ చేసేశాడు. అప్పటికే నెట్టింట స్క్రీన్‌షాట్‌లు వైరల్‌గా మారాయి. సీఎస్కే ఫ్యాన్స్‌ అఫీషియల్‌ అనే ఖాతా నుంచి వచ్చిన ఇమేజ్‌ను అతడు తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టాడు. ‘చెన్నై అభిమానులు విభిన్నంగా స్పందించారు’ అనే అర్థంలో క్యాప్షన్‌ జోడించాడు. ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానుల నుంచి తుషార్‌పై విపరీతంగా విమర్శలు వచ్చాయి. తమను ఓడించిన జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆనందపడుతున్నారని కొందరు కామెంట్లు పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని