Virat Kohli: వేటగాడు తిరిగొచ్చాడు... పాత రోజుల్ని గుర్తుకు తెస్తున్న విరాట్ కోహ్లి

విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి పరుగులు కొత్త కాదు, రికార్డులు కూడా కొత్త కాదు. అయితే కొన్ని నెలల క్రితం ఫామ్‌ పరంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తిరిగి పూర్వపు లయ అందుకుని దూసుకుపోతున్నాడు. 

Published : 13 Sep 2023 14:18 IST

విరాట్ కోహ్లి (Virat Kohli) అంటే ఒక పరుగుల ప్రవాహం. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతలున్నది ఎలాంటి బౌలర్లయినా అతడికి లెక్క ఉండదు. క్రీజులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే. అలుపు సొలుపు లేకుండా పరుగులు రాబట్టడం.. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదడం.. అతడికి వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం కోహ్లికే చెల్లు. ఇలాంటి అరుదైన, అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నట్లుండి ఫామ్ కోల్పోవడం.. పరుగుల కోసం తంటాలు పడటం అభిమానులకు ఏమాత్రం మింగుడుపడలేదు. ఇక విరాట్ పూర్వపు ఫామ్‌ను అందుకోవడం, బౌలర్లపై ఆధిపత్యం చలాయించడం కష్టమే అని ఒక నిర్ణయానికి వచ్చేసిన సమయంలో అతను పుంజుకున్నాడు. ఇటీవలి విరాట్ ఫామ్, పాకిస్థాన్‌తో ఆసియా కప్ (Asia Cup 2023) సూపర్-4 మ్యాచ్ చూసిన వాళ్లకి పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.

క్రికెట్ చరిత్రలో సచిన్ తెందుల్కర్ లాంటి బ్యాటర్ మరొకరు రారని.. అతడి రికార్డులు బద్దలు కొట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదని అందరూ అనుకున్న సమయంలో విరాట్ కోహ్లి వచ్చి సచిన్‌ను మించి పరుగుల వరద పారించి, మాస్టర్ బ్లాస్టర్ పేరిట ఉన్న రికార్డులను అలవోకగా బద్దలు కొట్టేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సచిన్ కంటే చాలా వేగంగా, తక్కువ మ్యాచ్‌ల్లో అతను 50 అంతర్జాతీయ శతకాల మార్కును అందుకున్నాడు. చూస్తుండగానే అతడి శతకాలు 70కి చేరువ అయ్యాయి. దీంతో మాస్టర్ వంద సెంచరీల రికార్డు నిలవడం కష్టమే అనుకున్నారు. 

వన్డేల్లో సచిన్‌కు కూడా సాధ్యం కాని 50వ శతకాన్ని అందుకోవడానికి కోహ్లికి ఎంతో సమయం పట్టదనిపించింది. వన్డే క్రికెట్లో ఎవ్వరూ టచ్ చేయలేరనుకున్న అనేక ఘనతలకు అతను చేరువ అయ్యాడు. ముఖ్యంగా ఛేదనలో విరాట్ సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలుగేళ్ల ముందు వరకు విరాట్ జోరు మామూలుగా లేదు. కోహ్లికి తిరుగే లేదనుకున్న సమయంలో అనూహ్యంగా అతను ఫామ్ కోల్పోయాడు. ఏడాదిలో పది శతకాలకు పైగా కొట్టిన వాడు.. రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ సాధించకపోవడం పెద్ద షాక్. ఒక దశలో అర్ధశతకం సాధించడానికి కూడా కోహ్లి కష్టపడ్డాడు.

మధ్యలో ఏమైంది?

ఎలాంటి ఆటగాడికైనా వయసు పెరిగికొద్దీ ఆట, దూకుడు తగ్గడం.. ఫామ్ దెబ్బ తినడం మామూలే. కోహ్లి కూడా ఒక దశలో ఫామ్‌తో కొంత తంటాలు పడ్డాడు. దీనికి తోడు కరోనా మహమ్మారి తన ఫామ్ మీద మరింత ప్రతికూల ప్రభావం చూపింది. నిండైన స్టేడియాల్లో అభిమానుల కోలాహలం మధ్య చెలరేగి ఆడటం కోహ్లికి అలవాటు. అభిమానుల అరుపులనే ఎనర్జీగా మార్చుకుంటాడు. అలాగే ప్రత్యర్థులు రెచ్చగొడితే మరింత రెచ్చిపోతాడు. ఐతే కరోనా కారణంగా చాన్నాళ్లు మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మ్యాచ్‌లు లేవు, ప్రాక్టీస్ తగ్గింది. కోహ్లి లయ దెబ్బతింది. అదే సమయంలో కెప్టెన్సీకి సంబంధించిన వివాదం విరాట్‌ను మానసికంగా దెబ్బ తీసింది. తప్పనిసరి పరిస్థితుల్లో టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. సెలక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. దీంతో బాగా హర్ట్ అయి టెస్టు కెప్టెన్సీ కూడా వదిలేశాడు. ఈ దశలో విరాట్ ఫామ్ మరింత దెబ్బతింది. వరుస వైఫల్యాలు అతడి మీద మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో కెరీర్లో ఇంకా ఇంకా పతనాన్ని చూశాడు.

గాడిన పడ్డట్లేనా?

గత ఏడాది విరాట్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. సుదీర్ఘ విరామానికి తెరదించుతూ ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై టీ20ల్లో సెంచరీ సాధించాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను క్రికెట్ ప్రేమికులెవ్వరూ ఇప్పట్లో మరిచిపోలేరు. తర్వాత ఆ ఫామ్‌ను వన్డేలు, టెస్టుల్లోకి కూడా తీసుకెళ్లాడు. వరుసగా సెంచరీలు సాధించాడు. ఇక కొత్త ఏడాదిలో విరాట్ ఊపు మామూలుగా లేదు. ఈ ఏడాది కోహ్లి అంతర్జాతీయ పరుగులు వెయ్యి దాటాయి. ఐదు సెంచరీలు కూడా సాధించాడు. తాజాగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ ఇన్నింగ్స్ అభిమానులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి.  

షహీన్, నసీమ్ షా లాంటి మేటి పేసర్లను అతను అలవోకగా ఎదుర్కొన్న తీరు.. అభిమానులను ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లింది. మెరుపు షాట్లతో బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ 84 బంతుల్లోనే సెంచరీ సాధించాడు కోహ్లి. వన్డేల్లో అతడికిది 47వ సెంచరీ కావడం విశేషం. మూడు శతకాలు సాధిస్తే సచిన్‌ను అధిగమించడమే కాక వన్డేల్లో 50 సెంచరీల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్ అవుతాడు విరాట్. అయితే, శ్రీలంకపై స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరినా.. కంగారు పడాల్సిన అవసరం లేదు. తన క్లాస్‌ ఆటతీరుతో మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడతాడనడంలో సందేహం లేదు. రాబోయే ప్రపంచకప్‌లో విరాట్ ఈ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ రికార్డును అందుకోవడమే కాక.. భారత్‌కు ప్రపంచకప్ కూడా అందించాలని అభిమానుల ఆకాంక్ష.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని