Virat Kohli: ఐపీఎల్‌ చరిత్రలో ఆ రికార్డు ఉన్న ఒకే ఒక్కడు కోహ్లీ

విరాట్ కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)లో చేరి నేటితో సరిగ్గా 16 ఏళ్లు అవుతోంది.  

Updated : 11 Mar 2024 18:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అది ఐపీఎల్ ఆరంభ సీజన్‌. అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఓ ఆటగాడిని మార్చి 11, 2008న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టులోకి తీసుకుంది. అనామకుడిగా టీమ్‌లోకి వచ్చిన అతడు అనతికాలంలోనే స్టార్‌ ఆటగాడిగా ఎదిగి కెప్టెన్‌ కూడా అయ్యాడు. అతడెవరో కాదు విరాట్ కోహ్లీ (Virat Kohli). ఈ స్టార్ బ్యాటర్‌ ఆర్సీబీతో చేరి నేటితో సరిగ్గా 16 ఏళ్లు పూర్తయింది.

అండర్‌-19 ప్రపంచకప్‌లో 47 సగటుతో 235 పరుగులు చేసి టోర్నీలో సెకండ్ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు కోహ్లీ. ఈ టోర్నీలో వెస్టిండీస్‌పై సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోహ్లీలోని ప్రతిభను గుర్తించి 2008 సీజన్‌కు గాను రూ.12 లక్షలకు ఆర్సీబీ అతడిని తీసుకుంది. తొలి సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 165 పరుగులే చేసిన కోహ్లీ ఇప్పుడు లీగ్‌ చరిత్రలో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడి 7,263 రన్స్‌ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 50 అర్ధ సెంచరీలున్నాయి. 2013 సీజన్‌ ఆరంభానికి ముందు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2016లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లినా విజేతగా నిలపలేకపోయాడు. కోహ్లీ 2021 సీజన్‌ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఆరంభ సీజన్‌ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే. మరే ఆటగాడు కూడా ఇన్ని సీజన్లు ఒకే ఫ్రాంఛైజీకి ఆడలేదు. అతడు ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. మార్చి 22న జరిగే ఐపీఎల్ 2024 సీజన్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని