Virat Kohli: తొలి బ్యాచ్‌తో వెళ్లని విరాట్ కోహ్లీ - హార్దిక్‌ పాండ్య.. కారణమిదే!

టీ20 ప్రపంచ కప్ సమరం కోసం టీమ్‌ఇండియా సమాయత్తమవుతోంది. అందులో భాగంగా కెప్టెన్‌తోపాటు కొందరు ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయారు.

Published : 26 May 2024 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మొదలుకానుంది. భారత్‌ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా తొలి బృందం అమెరికా బయల్దేరింది. కెప్టెన్‌ రోహిత్‌తోపాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోపాటు (Virat Kohli) వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఇంకా వెళ్లలేదు. ఐపీఎల్‌లో వీరి మ్యాచ్‌లు కూడా లేవు. అయినా వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు ఉన్నాయి. 

విరాట్ విషయంలో.. 

ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌తో భారీగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ‘యూఎస్‌’ వెళ్లే విషయంలో ఓ సమస్య వచ్చింది. అతడి వీసాకు సంబంధించి పేపర్ వర్క్‌ పెండింగ్‌లో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మే 30న అమెరికాకు బయల్దేరతాడని సమాచారం. దీంతో బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. బంగ్లాతో జూన్ 1న టీమ్‌ఇండియా వార్మప్‌లో తలపడనుంది.

లండన్‌లో హార్దిక్‌..?

వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో పాండ్య లండన్‌ వెళ్లడం గమనార్హం. ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి జట్టు  ఘోర ప్రదర్శన చేయడంతో కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా విడాకుల వార్తలు కూడా రావడంతో అతడు లండన్‌ వెళ్లినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచే నేరుగా యూఎస్‌కు వస్తాడని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని