Virat Kohli Fitness: ఇదే విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ మంత్రం!

భారత జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కోసం నిర్వహించే యోయో టెస్టు (YO YO Test)లో 17.2 స్కోరుతో విరాట్‌ కోహ్లీ ( Virat Kohli) తొలి స్థానంలో నిలిచాడు. దీంతో అసలువ విరాట్‌ ఫిట్‌నెస్‌ (Kohli Fitness) మంత్రం ఏంటి అనే చర్చ మరోసారి మొదలైంది. 

Published : 25 Aug 2023 19:06 IST

35 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి దగ్గరవుతున్న క్రికెటర్‌ అతను.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో శక్తిమంతమైన టీమ్‌ఇండియాను సారథిగా మూడు ఫార్మాట్లలో నడిపించాడు. స్టార్‌ ఆటగాడిగా మన్ననలు పొందుతున్నాడు. ఇప్పటికే దిగ్గజ హోదా దక్కించుకున్నాడు. రికార్డుల వేటలో సాగుతూ.. పరుగుల రారాజుగా కీర్తి గడించాడు. కానీ, ఇప్పటికప్పుడు మైదానంలో కుర్రాళ్లతో పరుగులో పోటీపడమంటే అతనే ముందుంటాడు. శరీరానికి శ్రమ కల్పించే ఏ పరీక్ష అయినా అతనిదే అగ్రస్థానం. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి దశాబ్దన్నర అవుతున్నా.. అతనికి అలుపన్నదే రాదు. ఫిట్‌నెస్‌లో ఇప్పటికీ భారత క్రికెట్‌ జట్టులో అతణ్ని కొట్టేవాళ్లే లేరు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్లోనే అతని ఫిట్‌నెస్‌కు పోటీ వచ్చే ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతనే.. విరాట్‌ కోహ్లి. ఫిట్‌నెస్‌లోనూ తిరుగులేని కింగ్‌. తాజాగా భారత జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కోసం నిర్వహించిన కఠినమైన యోయో టెస్టులో 17.2 స్కోరుతో విరాట్‌ అగ్రస్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. మరి ఇన్నేళ్లుగా అత్యున్నత ఫిట్‌నెస్‌ను కోహ్లి ఎలా కొనసాగించగలుగుతున్నాడు?

ఆహార నియమాల్లో కఠినంగా..

రికార్డులు సాధించామని ఆగిపోకుండా.. సెంచరీ చేశామని ఉండిపోకుండా.. విజయాలు దక్కాయని నిలిచిపోకుండా.. రోజునూ తొలిరోజుగానే భావిస్తూ ఫిట్‌నెస్‌పై కోహ్లి దృష్టి పెడతాడు. కసరత్తులైనా.. ఆహార నియమాలైనా.. మళ్లీ కొత్తగా మొదలెడతాడు. అలసిపోయాననే భావనే దరి చేరకుండా.. తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, తీరిక లేని షెడ్యూల్‌లో ఉన్నా ఫిట్‌నెస్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడు. కోహ్లి ఇన్నేళ్లుగా ఈ ఫిట్‌నెస్‌ను కొనసాగించడానికి మానసిక స్థైర్యం, ఆత్మబలంతో పాటు చేసే కసరత్తులు, పాటించే ఆహార నియమాలే కారణం. ఫిట్‌నెస్‌ కోసం తనకెంతో ఇష్టమైన చికెన్‌ను పూర్తిగా దూరం పెట్టి శాకాహారిగా మారిపోయాడు. మసాలా వంటకాలకు పూర్తి దూరంగా ఉండే అతను.. తాజా కూరగాయలు, పప్పు, గుడ్లను ఆహారంలో భాగం చేసుకున్నాడు. 

ఉదయం పూట బ్రెడ్‌ ఆమ్లెట్‌తో ఉడకబెట్టిన గుడ్లను తింటాడు. వీటితో పాటు పాలకూర, ఎండుమిర్చి, పనీర్‌ సలాడ్‌ను అల్పాహారంగా తీసుకుంటాడు. మధ్యాహ్న భోజనంలో నట్స్, బ్రౌన్‌ బ్రెడ్  తింటాడు. ప్రొటీన్‌ షేక్‌ తాగుతాడు. డిన్నర్‌ను రోటీ, పప్పు, పచ్చి ఆకు కూరలతో సాధారణంగా ముగిస్తాడు. శరీరాన్ని డీహైడ్రేడ్‌ కాకుండా చూసుకోవడం కోసం బ్లాక్‌ వాటర్‌ తాగుతాడు. ఖరీదైన ఈ నీళ్ల ధర లీటర్‌కు రూ.4 వేల వరకూ ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత ప్రొటీన్‌ షేక్స్, సోయా మిల్క్, బటర్‌ పనీర్‌ తీసుకుంటాడు. ఒక్కోసారి తనకెంతో ఇష్టమైన ఛోలే భటూరే (శనగ మసాలా కూరతో పూరి)ను లాగిస్తుంటాడు. కానీ ఆ వెంటనే మళ్లీ కసరత్తుల్లో మునిగిపోతాడు. అంతే కాకుండా ఏది ఎంత తినాలో తగిన మోతాదులో ఉండేలా చూసుకుంటాడు. 

ఆ కసరత్తులు..

ఎంత తీరిక లేని షెడ్యూల్‌ ఉన్న వ్యాయామం విషయంలో మాత్రం కోహ్లి అసలు అశ్రద్ధ చూపడు. ఎక్కడ? ఎలాంటి పరిస్థితుతుల్లో ఉన్నా కచ్చితంగా కసరత్తులు చేస్తాడు. గంటల కొద్దీ వ్యాయామం చేసి క్యాలరీలు కరిగిస్తుంటాడు. ముఖ్యంగా వెయిట్‌లిఫ్టింగ్, కార్డియో వాస్క్యులర్‌ కసరత్తులను కలిపి చేయడం అతని ఫిటెనెస్‌ రహస్యం అని చెప్పొచ్చు. దీంతో ఆరోగ్యమే కాకుండా కండరాల పటుత్వం, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది. శరీరంలోని ప్రతి అవయవానికి తగ్గట్లుగా ప్రత్యేక వ్యాయామ పద్ధతులు అవలంబిస్తూ ఇప్పటికీ ఫిట్‌గానే ఉంటున్నాడు. అందుకే మొదటి నుంచి ఇప్పటి వరకూ ఒకే శరీరాకృతిని కొనసాగించగలుగుతున్నాడు.

తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల మధ్య పరుగుల కోసం కోహ్లి 510 కిలోమీటర్లు పరుగెత్తాడంటేనే అతని ఫిట్‌నెస్‌ స్థాయి అర్థం చేసుకోవచ్చు. తాను కొట్టిన పరుగుల కోసం 277 కిలోమీటర్లు, నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉంటూ మరో 233 కిలోమీటర్లు పరుగెత్తాడు. ప్రపంచ క్రికెట్లో మరో క్రికెటర్‌ కూడా వికెట్ల మధ్య ఇంత దూరం పరుగెత్తలేదు. ఇప్పటికీ క్రీజులో అడుగుపెడితే వికెట్ల మధ్య కోహ్లి మెరుపు వేగం ఎలా ఉంటుందో తెలిసిందే. తన ఫిట్‌నెస్‌తో మైదానంలో ఉత్సాహాన్ని పెంచుతూ సాగుతున్నాడు. ఫిట్‌నెస్‌ అంటే కోహ్లీలా ఉండాలనే ప్రమాణాలను నెలకొల్పి యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని