Virat Kohli - Dinesh Karthik: థ్యాంక్యూ డీకే.. ఆ సమయంలో ఎంతో స్ఫూర్తి పొందా: విరాట్ కోహ్లీ

బెంగళూరు జట్టు సహచరులుగా కాకుండా.. భారత జట్టు తరఫున ఆడినప్పుడు తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

Updated : 24 May 2024 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు దాదాపు దూరమైన వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఐపీఎల్‌కు వీడ్కోలు పలికేశాడు. మెగా లీగ్ 17వ సీజన్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమితో బెంగళూరు కథ ఇంటికి చేరింది. అప్పుడే డీకే కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అతడిని ఓదార్చిన వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా డీకేతో తన అనుబంధంపై విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

‘‘నేను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మేమిద్దరం ఆడాం. 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీ అనుకుంటా. అతడితో కలిసి మొదటిసారి ఛేంజ్‌రూమ్‌ను పంచుకున్నా. చాలా సరదాగా ఉంటాడు. హైపర్‌ యాక్టివ్‌. అదేవిధంగా కన్‌ఫ్యూజ్డ్‌ పర్సన్. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు.. దినేశ్‌పై నాకు కలిగిన తొలి ఇంప్రెషన్‌ ఇదే. అద్భుతమైన ప్రతిభావంతుడు. అప్పటికీ.. ఇప్పటికీ అతడిలో ఏ మార్పులేదు. మైదానం వెలుపల అతడితో సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. చాలా విషయాలపై మంచి నాలెడ్జ్‌ అతడి సొంతం. క్రికెటేతర అంశాల గురించీ చెబుతాడు. నాకు 2022 ఐపీఎల్ సీజన్‌ గొప్పగా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు పక్కనే కూర్చొని సవివరంగా నా సమస్యను చెప్పాడు. ఎలా అధిగమించాలనేదానిపై అవగాహన కల్పించాడు. ఎప్పటికీ అతడికి రుణపడి ఉంటా. థ్యాంక్యూ డీకే.. నీ అమూల్యమైన సలహాలతో మెరుగ్గా రాణించగలుగుతున్నా’’ అని విరాట్ తెలిపాడు. 

ఎప్పటికీ వెనక్కి తగ్గడు: దీపికా పల్లికల్

‘‘మేమిద్దరం తొలిసారి 2013లో కలిశాం. మా జీవితాలు పరస్పరం ముడిపడతాయని అప్పుడే అనుకున్నాం. దానికి మరెంతోకాలం పట్టలేదు. ఏదైనా మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోతే.. తనకు తానే జట్టు నుంచి డ్రాప్‌ అయిపోయేవాడు. ఓ మూడు రోజులు కాస్త బాధపడతాడు. వెంటనే కోలుకుంటాడు. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తాడు. డీకే నుంచి ఎప్పటికీ నేర్చుకొనే అంశం ఇదే. మరొకరైతే ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయేవారు. నేను కూడా అథ్లెట్‌నే. అతడి కెరీర్‌లో ఎన్నో దశలను చూశా. ఒకవేళ అదే స్థానంలో నేనుంటే ఆటను వదిలేసేదాన్ని. అతడు మాత్రం ఎప్పుడూ అలా ఆలోచించడు. కార్తిక్‌ రాణించడం వెనుక అభిషేక్ నాయర్‌ పాత్ర కీలకం. కేవలం కెరీర్‌ పరంగానే కాకుండా.. వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించాడు’’ అని దినేశ్ కార్తిక్‌ భార్య దీపికా పల్లికల్ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని